
కాంగ్రెస్ నేతలతో పీసీసీ చీఫ్ చర్చలు
రాహుల్ పర్యటనకు ఏర్పాట్లు
బీసీ సంఘాల నేతలతో రౌండ్‌టేబుల్ సమావేశం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ హైదరాబాద్ పర్యటన కోసం టీపీసీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల ఐదో తేదీన సాయంత్రం బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో నిర్వహించనున్న కులగణన సంప్రదింపుల సదస్సుకు రాహుల్ హాజరు కానున్నారు. దీంతో ఆదివారం సాయంత్రం పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ గాంధీభవన్‌లో కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశమై రాహుల్‌గాంధీ పర్యటన ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం ఇందిరాభవన్‌లో కుల సంఘాల నేతలు, మేధావులు, సామాజిక కార్యకర్తలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్ర కుమార్, ప్రొఫెసర్లు విశ్వేశ్వరరావు, సింహాద్రి, వెంకటనారాయణ, భూక్య, బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ తదితరులు పాల్గొని కులగణన సంప్రదింపుల సదస్సులో చర్చించాల్సిన అంశాల గురించి సమాలోచనలు చేశారు. ఈ సందర్భంగా మహేశ్‌గౌడ్ మాట్లాడుతూ రాహుల్‌గాంధీ గంటపాటు అన్ని వర్గాలతో భేటీ అయ్యి అభిప్రాయాలు తెలుసుకుంటారని చెప్పారు.
కులగణనకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ కులగణన దేశానికే ఆదర్శంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. పీసీసీ సమావేశంలో ఏఐసీసీ నేత కొప్పుల రాజు, ఎంపీలు అనిల్‌కుమార్ యాదవ్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ నేతలు రోహిణ్‌రెడ్డి, కోట నీలిమ, పవన్ మల్లాది, బెల్లయ్య నాయక్, ఒబేదుల్లా కొత్వాల్, మెట్టు సాయికుమార్, చరణ్ కౌశిక్ యాదవ్, మల్‌రెడ్డి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.