
కులగణన సలహాల కార్యక్రమానికి హాజరు
నిష్పక్షపాతంగా కులగణన చేపడతాం
కార్యక్రమంపై పీసీసీ ఆధ్వర్యంలో అఖిలపక్షం
టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆరో తేదీ నుంచి నిర్వహించనున్న కులగణనపై మేధావులు, విద్యార్థి నాయకులు, కుల సంఘాల నేతల నుంచి సలహాలు, సూచనలు తీసుకునేందుకు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఈ నెల ఐదో తేదీన హైదరాబాద్‌కు వస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో జరిగే సమావేశానికి రాహుల్ హాజరవుతారని, ఇదే సమావేశానికి రావాల్సిందిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా ఆహ్వానించామని చెప్పారు.
వీలును బట్టి ఆయన కూడా హాజరవుతారని వెల్లడించారు. కులగణన కోసం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన కనెక్ట్ సెంటర్‌ను పార్టీ నేతలతో కలిసి మహేశ్‌కుమార్‌గౌడ్ శనివారం ప్రారంభించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనాభా నిష్పత్తి ప్రకారం సంపద పంపిణీ జరగాలని అన్నారు. అందుకే దేశ వ్యాప్తంగా కులగణన జరగాలని కోరుతున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కులగణన కార్యక్రమంలో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త భాగం కావాలని పిలుపునిచ్చారు. కులగణనతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేప డుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కనెక్ట్ సెంటర్ ఉపయోగపడుతుందని తెలిపారు. కులగణన ఎక్కడా బ్రేక్ లేకుండా నిష్పక్షపాతంగా, సజావుగా జరగాలన్నదే తమ ఉద్దేశమని అన్నారు.
కులగణనపై పీసీసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకుంటామని వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే సమగ్ర కుటుంబ సర్వే నివేదికను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సజావుగా సాగుతుందని చెప్పారు.
మహేశ్వర్‌రెడ్డి తనకు మంచి మిత్రుడని, బీజేపీలో ఆయనకు కుర్చీ లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ మరే పార్టీలో ఉండదని తెలిపారు. ప్రధాని మోదీ ఎన్నికలకు ముందు అమలు చేస్తానని చెప్పిన సంక్షేమ పథకాలు, ఉద్యోగాలు ఎక్కడ అని పీసీసీ చీఫ్ ప్రశ్నించారు. సంక్షేమం అంటేనే కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్ తదితరులు పాల్గొన్నారు.