కంచర్ల యాదగిరిరెడ్డి
అక్షరాలా.. ఒక లక్ష అరవై నాలుగు వేల ముప్పై మూడు. 2021 సంవత్సరంలో భారత దేశంలో ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య ఇది! కొంచెం అటు ఇటుగా నిమిషానికి ఇద్దరు బలన్మరణానికి పాల్పడుతున్నారన్నమాట!! కుటుంబ సమస్యలు, తీవ్రమైన వ్యాధుల బారిన పడటం ఇందుకు ప్రధాన కారణాలని నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ చెబుతున్నా, సంబంధిత నిపుణులు మాత్రం మానసిక సమస్యలే మూల కారణం అని స్పష్టం చేస్తుండటం గమనార్హం.
చికిత్సలో వెనుకంజ..
ఎందుకీ పరిస్థితి? మానసిక సమస్యలంటే కేవలం పిచ్చి మాత్రమేనా? ఈ విపత్తును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఏం చేస్తోంది? స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్లు ఏం చేయవచ్చు? అన్న దానిపై ప్రస్తుతం దేశంలో చర్చ కొనసాగుతోంది. భారతదేశం చాలా రంగాల్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండవచ్చు కానీ, అంతర్జాతీయంగా మానవాభివృద్ధికి సూచికలైన పలు అంశాల్లో ఇప్పటికీ వెనుకబడే ఉంది.
వైద్యంలో, ముఖ్యంగా మానసిక సమస్యలకు చికిత్స విషయంలో మరీ వెనుకంజలో ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతి లక్ష జనాభాకు ఉన్న సైకియాట్రిస్టులు కేవలం 0.3, సైకాలజిస్టులు 0.07 మాత్రమే. ఇంకా చెప్పాలంటే మానసిక సమస్యల చికిత్సకు ఈ దేశంలో దాదాపు అవకాశం లేనట్టే! ఇక నర్సులైతే 0.12, ఆరోగ్య సిబ్బంది 0.07% ఉన్నారు. పాశ్చాత్య దేశాల్లో ఆరోగ్య రంగానికి కేటాయించిన బడ్జెట్‌లో సుమారు 5–18 శాతాన్ని మానసిక సమస్యల పరిష్కారానికి ఖర్చు చేస్తుంటే భారత్‌లో ఇది 0.05 శాతాన్ని దాటడం లేదు.
దేశ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం
మానసిక సమస్యలతో బాధపడుతున్న వారి ప్రభావం దేశాభివృద్ధి, ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్రంగానే కనిపిస్తుంది. ప్రపంచంలోనే అత్యధికంగా బలవన్మరణాలకు పాల్పడు తున్న దేశాల్లో భారత్ ఒకటి. సుమారు 5.6 కోట్ల మనో వ్యాకులత బాధితులు, ఇంకో 4.3 కోట్ల మంది యాంగ్జైటీ రోగుల కారణంగా దేశంలో ఉత్పాదకత గణనీయంగా పడిపోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క కట్టింది. పనిచేసే సామర్థ్యమున్న 15– 39 ఏళ్ల మధ్య వయసు వారు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగించే విషయం. 2012– 2030 మధ్యకాలంలో ఈ నష్టం సుమారు రూ.84 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేసిందంటే పరిస్థితి తీవ్రత ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
దేశంలో మార్పు మొదలైంది
మానసిక సమస్యలపై దేశం దృష్టి కోణం ఇప్పుడిప్పుడే మారుతోంది. ఇంతకాలం మానసిక సమస్యల కారణంగా జరిగే ఆత్మహత్యలపైనే ప్రభుత్వం తన దృష్టిని కేంద్రీకరించగా, తాజాగా ఈ ఏడాది బడ్జెట్‌లో నిధుల కేటాయింపును పెంచింది. అంతేకాకుండా ఓ మోస్తరు మానసిక సమస్యల పరిష్కారానికి టెలి–మెంటల్ హెల్త్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.
ఈ నెల 10న ‘టెలి–మానస్’ పేరుతో భారీ కార్యక్రమం ఒకటి మొదలుపెట్టింది. దీనిలో భాగంగా మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న వారు 1–800–91–4416కు లేదా 14416కు ఫోన్ చేయడం ద్వారా సాయం పొందవచ్చు. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (నిమ్హాన్స్) ఆధ్వర్యంలో, ఐఐఐటీబీ సాంకేతిక సహకారంతో ఈ కార్యక్రమం అమలు కానుంది.
23 టెలి–మానస్ కేంద్రాలు
దేశవ్యాప్తంగా మొత్తం 23 టెలి–మానస్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వీటికి అదనంగా జిల్లా స్థాయిలో జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమం/ వైద్య కళాశాలల సిబ్బంది ద్వారా కన్సల్టేషన్లు నిర్వహిస్తారు. లేదంటే ఈ– సంజీవని ద్వారా ఆడియో, వీడియో సంప్రదింపులూ జరపవచ్చు. మానసిక ఆరోగ్య నిపుణులు, కౌన్సెలర్లు అన్నిరకాల మానసిక సమస్యలకు సంబంధించి సాయం అందిస్తారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌కు ఈ టెలి–మానస్ కార్యక్రమం అనుసంధానమై ఉంటుంది. ఫలితంగా ఆయా కేంద్రాల్లోని అత్యవసర సైకియాట్రిక్ సౌకర్యాలు కూడా రోగులకు అందుబాటులోకి వస్తాయి. నిమ్హాన్స్ ఇప్పటికే దాదాపు 900 మంది టెలిమానస్ కౌన్సెలర్లకు శిక్షణ కూడా పూర్తి చేసింది.
వ్యాయామం.. నిద్ర.. కీలకం
►రోజూ క్రమం తప్పకుండా కనీసం 45 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. వారంలో 5 రోజుల పాటైనా వ్యాయామం చేయడం ద్వారా మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
►సంతులిత ఆహారం, తగినన్ని నీళ్లు తాగడం కూడా అవసరం. తద్వారా శరీరానికి కావాల్సినంత శక్తి లభిస్తుండ టం వల్ల చురుగ్గా ఉంటామన్నమాట.
►కంటినిండా నిద్రపోవాలి. నిద్ర నాణ్యత పెరిగిన కొద్దీ మనిషి మాన సిక ఆరోగ్యంలోనూ మెరుగుదల కనిపించినట్లు 2021 నాటి ఓ సమీక్ష స్పష్టం చేసింది.
►ప్రాణాయామం, ధ్యానం, వెల్‌నెస్ అప్లికేషన్ల సాయంతో వీలైనంత వరకూ మనసును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం జరగాలి. దినచర్యలను, సంఘటనలను రాసుకోవడం కూడా ఒత్తిడికి దూరం చేస్తుందని అంచనా.
►బంధుమిత్రులతో సత్సంబంధాలు మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
చిన్నచూపు తగదు
మానసిక సమస్యలను దేశంలో ఇప్పటికీ చిన్నచూపు చూస్తున్నారు. బాధితులను హేళన చేయడం, వెకిలి మాటలతో హింసించడం కూడా సర్వసాధారణమవుతుండటం దురదృష్టకరమైన అంశం. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని, మానసిక సమస్యలతో బాధపడుతున్న వారిని ఇది మరింత కుంగుబాటుకు గురిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
సంపూర్ణ జీవితానికి ఓ సూచిక
మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉండటం సంపూర్ణ జీవితానికి ఓ సూచిక అన్నారు ఢిల్లీకి చెందిన మానసిక వ్యాధుల నిపుణుడు డాక్టర్ విశాల్ ఛబ్రా. పదిహేనేళ్లుగా ప్రాక్టీసు చేస్తున్న ఛబ్రాకు గడచిన నాలుగైదేళ్లుగా కేసుల సంఖ్య పది రెట్లు పెరిగింది. ఇప్పుడు ఆయన రోజుకు 10 గంటలు పని చేస్తున్నా 25% మందికి మాత్రమే అపాయింట్‌మెంట్ ఇవ్వగలుగుతున్నారు.
‘ఇటీవల కాలంలో మానసిక వ్యాధుల బారినపడుతున్నవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. అందులోనూ మహిళల సంఖ్య ఎక్కువ. పెరిగిపోతున్న పోటీతత్వం, విలాస వంతమైన జీవితాలు కావాలనుకోవడం, పొరుగు వారు లేదా సమీప బంధువులతో పోల్చుకోవడం వంటి వాటితో కుంగిపోతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది’ అని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
బతకాలని అనిపించలేదు: దీపిక పదుకునె
‘‘కనీసం ఒక్క ప్రాణాన్నైనా కాపాడలన్నది నా లక్ష్యం. అప్పుడే ఈ జీవితానికి సార్థకత’’.. ఏళ్లపాటు మనోవ్యాకులత సమస్యను ఎదుర్కోవడమే కాకుండా దాన్నుంచి విజయవంతంగా బయటపడి అంతర్జాతీయ స్థాయిలో సైతం గుర్తింపు పొందిన బాలీవుడ్ నటి దీపికా పదుకునె ఇటీవల చేసిన వ్యాఖ్య ఇది. నృత్య దర్శకురాలు ఫరాఖాన్‌తో కలిసి దీపిక కొద్దిరోజుల క్రితం ‘‘కౌన్ బనేగా కరోడ్‌పతి’’ కార్యక్రమంలో పాల్గొన్నారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో దీపిక మనోవ్యాకులత సమస్యను ఎలా ఎదుర్కొన్నది వివరించారు.
‘‘2014లో మొదటిసారి సమస్యను గుర్తించారు. అకస్మాత్తుగా చిత్రంగా అనిపించేది నాకు. పనిచేయాలని అనిపించేది కాదు. ఎవర్నీ కలవాలనిపించేది కాదు. బయటికి వెళ్లాలన్నా చిరాకు వచ్చేది. అసలు ఏమీ చేయకుండా ఉండిపోవాలనిపించేది. చాలాసార్లు ఈ జీవితానికి ఓ అర్థ్ధం లేదని, ఇంకా బతికి ఉండకూడదని అనిపించేది’’ అని తెలిపారు. ఈ సమయంలోనే తన తల్లిదండ్రులు తనను చూసేందుకు బెంగళూరు నుంచి ముంబై వచ్చారని చెబుతూ.. ‘‘వాళ్లు తిరిగి వెళ్లేటప్పుడు విమానాశ్రయంలో ఉన్నట్టుండి ఏడ్చేశా. ఏదో తేడాగా ఉందని అమ్మ గుర్తించింది.
అది మామూలు ఏడుపు కాదని అనుకుంది. ఓ సైకియాట్రిస్ట్‌ను కలవమని సూచించింది. ఆ తర్వాత కొన్ని నెలలకు కానీ కోలుకోవడం సాధ్యం కాలేదు’’ అని దీపిక తెలిపారు. ‘‘మనోవ్యాకులత సమస్య నాకే అనుభవమైందంటే నాలాంటి వాళ్లు ఇంకెంతమంది ఉన్నారో? అని అప్పట్లో నాకనిపించింది. అందుకే ఒక్క ప్రాణాన్ని కాపాడగలిగినా ఈ జీవితానికి సార్థ్ధకత ఏర్పడినట్లే అనుకుంటున్నా..’’ అని దీపిక తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment