సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ పరిధిలో సాయంత్రం క్లినిక్‌లను వెంటనే ప్రారంభించా లని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు. రోజూ సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు ఈ క్లినిక్‌లలో బస్తీవాసులకు డాక్టర్లు అందుబాటులో ఉండాలన్నారు. గురువారం ఆయన వైద్య, ఆరోగ్యశాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమావేశానికి వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణ, ఇతర అధికారులు రమేష్‌రెడ్డి, డాక్టర్ శ్రీనివాసరావు, చంద్రశేఖర్‌రెడ్డి, డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, డాక్టర్ గంగాధర్ పాల్గొన్నారు.
మంత్రి ఈటల మాట్లాడుతూ ఆసిఫాబాద్, భద్రాచలం పరిధిలో మలేరియా, జీహెచ్‌ఎంసీ, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో డెంగీ కేసులు ఎక్కువగా ఉంటాయని, దీనిపై శుక్రవారం అన్ని జిల్లాల వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్‌లో స్వైన్‌ఫ్లూ కేసులు కూడా వచ్చే అవకాశం ఉన్నందున అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు..
► అన్ని మందులతో పాటు డెంగీ, ఇతర వ్యాధి నిర్ధారణ ర్యాపిడ్ కిట్లను అందుబాటులో ఉంచాలి.
► ప్రతి ఇంటికి ఫీవర్ సర్వే కొనసాగించాలి. ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటుచేయాలి.
► సిబ్బందిని, డాక్టర్లను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించాలి.
► ప్రతి డాక్టర్, సిబ్బంది ఆసుపత్రి దగ్గర్లోనే నివాసం ఉండాలి. మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి అదనపు వేతనమివ్వాలి.
► రోగులు రాని చోట నుంచి అవసరం ఉన్నచోటకు డాక్టర్లను మార్చాలి. వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి.
► మున్సిపల్, పంచాయతీరాజ్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్లతో కలిసి పనిచేయాలి. ఈ శాఖలతో త్వరలో సమావేశాలుంటాయి.
► అన్ని బోధనాసుపత్రులు, వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో కరోనాతో పాటు అన్ని జబ్బుల కు పడకలు కేటాయించాలి. అన్ని వైద్యసేవలు నిర్వహించాలి.
► ఫీవర్ ఆసుపత్రిని పూర్తిగా సీజనల్ జ్వరాల చికిత్సల కోసం సిద్ధంచేయాలి.
► ప్రతి గర్భిణికి ప్రసవ తేదీ ప్రకారం వైద్యసేవలందాలి. డెలివరీ డేట్ కంటే ముందే ఆసుపత్రికి తరలించాలి.
► 13 రకాల స్పెషాలిటీ డాక్టర్లను జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచాలి.
► బ్లడ్‌బ్యాంకుల్లో రక్తం కొరత లేకుండా చూడాలి.
► జీతాలు పెండింగ్ ఉంచొద్దు. ప్రతి నెల మొదటి వారంలో అందేలా చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment