హైదరాబాద్: ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టుల్లో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్ స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు చేసిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో యాంటిజెన్ పరీక్షల శాతం 84.24 శాతం ఉండటం గమనార్హం. ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు 15.52, సీబీనాట్ పద్ధతిలో 0.24 శాతం కరోనా పరీక్షలు నిర్వహించారు. తమిళనాడులో 0.13 శాతం యాంటిజెన్, 98.61 శాతం ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు చేశారు. రాజస్తాన్‌లో 0.29 శాతం యాంటిజెన్, 98.05 శాతం ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు చేశారు.
ఆర్‌టీపీసీఆర్ టెస్టుల్లో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పోలిస్తే కింది నుంచి మూడో స్థానంలో తెలంగాణ నిలిచిందని కేంద్రం ఇటీవల విడుదల చేసిన నివేదికలో తెలిపింది. కరోనా విజృంభణ సమయంలో ర్యాపిడ్ టెస్టుల వల్ల వేలాది మందికి వేగంగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగలిగారు. ఆర్‌టీపీసీఆర్ పద్ధతిలో పరీక్షలు చేయించుకునేవారు శాంపిళ్లను నిర్ణీత ఆసుపత్రి లేదా డయాగ్నస్టిక్ సెంటర్‌కు వెళ్లి ఇస్తే దాని ఫలితం మరింత ఆలస్యమయ్యేది. ఒక్కోసారి రెండుమూడ్రోజులు పట్టేది. కొన్నిసార్లు వారం కూడా అయ్యేది. ర్యాపిడ్ టెస్టుల్లో అక్కడికక్కడే 20 నిమిషాల్లోనే పాజిటివా లేదా నెగెటివా అనేది తెలుస్తుంది. దీంతో యాంటిజెన్ పరీక్షలకే రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అధిక ప్రాధాన్యం ఇచ్చింది.
లక్షణాలున్నవారికి ఆర్‌టీపీసీఆర్ తప్పనిసరి... కానీ, ర్యాపిడ్ టెస్టుల్లో పాజిటివ్ వస్తే దాని కచ్చితత్వంపై ఎలాంటి సందేహాలు అవసరంలేదు. కానీ, లక్షణాలుండి ర్యాపిడ్ టెస్ట్‌లో నెగెటివ్ వస్తే మాత్రం ఆర్‌టీపీసీఆర్ పరీక్ష తప్పనిసరి చేయాలని కేంద్రం తన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. రాష్ట్రంలో 1,076 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నారు. ఆర్‌టీపీసీఆర్ పరీక్షలను 20 ప్రభుత్వ ఆసుపత్రులు, 60 ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లలో నిర్వహిస్తున్నారు.
ర్యాపిడ్ టెస్టులు చేసే సెంటర్లలోనే నెగెటివ్ వచ్చినవారికి లక్షణాలుంటే, వారి నుంచి తక్షణమే శాంపిళ్లను సేకరించి ఆర్‌టీపీసీఆర్ పరీక్షకు పంపించాలన్న ఉద్దేశం చాలాచోట్ల అమలు కాలేదు. ఈ విషయంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు నిర్లక్ష్యం ప్రదర్శించాయన్న ఆరోపణలు ఉన్నాయి. చాలాచోట్ల ఆర్‌టీపీసీఆర్ కోసం శాంపిళ్లు తీసుకోవడానికి కూడా వైద్య సిబ్బంది నిరాకరించారు. తమ వద్ద అటువంటి వసతి లేదని బాధితులను తిప్పిపంపారు. దీంతో అనేక పాజిటివ్ కేసులు వెలుగుచూడలేదని కొందరు వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్‌టీపీసీఆర్ పరీక్షలను మరింతగా పెంచాలని సూచించారు. దానివల్లే లక్షణాలున్నవారిని కచ్చితంగా పట్టుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్రం ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ ఆర్‌టీపీసీఆర్ పరీక్షలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ర్యాపిడ్‌లో నెగెటివ్ అని తేలినా లక్షణాలున్నవారి శాంపిళ్లను అక్కడికక్కడే తీసుకొని టెస్టింగ్ కేంద్రాలకు పంపాలని అధికారులను ఆదేశించింది. ఆర్‌టీపీసీఆర్ టెస్టులను 40 శాతం నుంచి 50 శాతం వరకు పెంచనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment