పేదల ప్రాణాలకు భరోసా | Telangana Govt Arranging Liquid Medical Oxygen Plant Gandhi Hospital Hyderabad | Sakshi
Sakshi News home page

పేదల ప్రాణాలకు భరోసా

Jan 24 2022 2:58 PM | Updated on Jan 24 2022 4:03 PM

Telangana Govt Arranging Liquid Medical Oxygen Plant Gandhi Hospital Hyderabad - Sakshi

నాట్కో, హెటిరో సంస్థలు నిర్మించిన ఆక్సిజన్‌ ప్లాంట్స్‌  

గాంధీఆస్పత్రి: కోవిడ్‌ సెకెండ్‌వేవ్‌లో ఆక్సిజన్‌ కొరత తీవ్రంగా బాధించింది. ఆక్సిజన్‌ అందక రోగి మృతి చెందాడు అనే వార్తలు దేశవ్యాప్తంగా  వినిపించాయి. ఆయా ప్రభుత్వాలు ప్రాణవాయువు కోసం పాకులాడాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక వాహనట్యాంకుల ద్వారా లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుని ఆయా ఆస్పత్రులకు సరఫరా చేసింది. నాటి పరిస్థితుల నుంచి పాఠాలు నేర్చుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాయి.

తెలంగాణ ప్రభుత్వ సహాయ సహకారాలతో పలు కంపెనీలు కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీలో భాగంగా కోవిడ్‌ నోడల్‌ కేంద్రమైన సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ ప్లాంట్స్‌ ఏర్పాటు చేశాయి. కేంద్ర ప్రభుత్వం పీఎం కేర్‌ నిధులతో అత్యంత అధునాతనమైన మరో ప్లాంట్‌ను సిద్ధం చేసింది. 26 వేల కిలోలీటర్ల లిక్విడ్‌ ఆక్సిజన్‌ను నిల్వ చేసే ట్యాంకులున్నాయి. నూతనంగా మరో 20 కేఎల్‌ ట్యాంకు మంజూరైంది. నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. సుమారు మూడువేల మంది రోగులకు నిరంతరం ఆక్సిజన్‌ సరఫరా చేసే సామర్థ్యం గాంధీ ఆస్పత్రి సొంతం.  
►  కోవిడ్‌ నోడల్‌ కేంద్రమైన సికింద్రాబాద్‌ గాంధీఆస్పత్రిలో 20కేఎల్, 6 కేఎల్‌ (కిలోలీటర్లు) సామర్ధ్యం గల రెండు లిక్విడ్‌ ఆక్సిజన్‌ ట్యాంకులు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా సుమారు వెయ్యి మంది రోగులకువెంటిలేటర్‌పై 24 గంటల పాటు ఆక్సిజన్‌ అందించవచ్చును.  
►  26 కేఎల్‌ లిక్విడ్‌ ఆక్సిజన్‌ ట్యాంకులు ఉండగా, నూతనంగా మరో 20 కేఎల్‌ ట్యాంకు మంజూరైంది. నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దీని నిర్మాణం పూర్తయితే 46 వేల కిలోలీటర్ల లిక్విడ్‌ ఆక్సిజన్‌ అందుబాటులోకి వస్తుంది. 
►    సుమారు రెండున్నర కోట్ల రూపాయల పీఎం కేర్‌ నిధులతో కేంద్రప్రభుత్వం అత్యంత అధునాతనమైన రెండు ఆక్సిజన్‌ ప్లాంట్‌లను 
గాంధీప్రాంగణంలో ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్‌ ద్వారా ఉత్పత్తి అయ్యే అక్సిజన్‌ 95 శాతం స్వచ్ఛంగా ఉంటుంది.  
►  కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్లాంట్‌ ద్వారా నిమిషానికి వెయ్యి చొప్పున రెండు యూనిట్స్‌ ద్వారా రెండు వేల లీటర్ల లిక్విడ్‌ ఆక్సిజన్‌ ఉత్పత్తి చేయవచ్చును. ఆక్సిజన్‌ ప్రెషర్‌ స్వింగ్‌ ఎడ్సార్ప్‌సన్‌ పద్ధతిలో ఈ యూనిట్‌ పనిచేస్తుంది.  
  కార్పోరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీలో భాగంగా పలు ఫార్మా, ల్యాబోరేటరీలకు చెందిన ఆరు కంపెనీలు కోట్లాది రూపాయల వ్యయంతో గాంధీప్రాంగణంలో ఆక్సిజన్‌ ప్లాంట్స్‌ ఏర్పాటు చేశాయి. ఈయూనిట్ల ద్వారా  గాలిలో ఉన్న ఆక్సిజన్‌ (అట్మాస్పియర్‌ ఎయిర్‌) ను సేకరించి, ప్రత్యేక పద్ధతిలో ఆక్సిజన్‌ను వేరుచేసి పైప్‌లైన్ల ద్వారా రోగులకు సరఫరా చేస్తారు. 

►  గాలిలో 20 శాతం ఆక్సిజన్, 70 శాతం నైట్రోజన్, 10 శాతం వివిధ రకాల గ్యాస్‌లు ఉంటాయి. అట్మాస్పియర్‌ ఎయిర్‌ ద్వారా ఉత్పత్తి చేసే ఆక్సిజన్‌ 93 నుంచి 95 శాతం స్వచ్ఛంగా ఉండగా, లిక్విడ్‌ ఆక్సిజన్‌ 99 శాతం çప్యూరిటీగా ఉంటుంది. వెంటిలేటర్‌పై ఉన్న రోగులకు లిక్విడ్‌ ఆక్సిజన్‌ సరఫరా చేస్తారు.  
► గాంధీఆస్పత్రిలో ప్రధాన భవనంలోని ఎనిమిది అంతస్థులు, ఇన్‌పేషెంట్, అవుట్‌ పేషెంట్, అత్యవసర విభాగ భవనాలు, ఎమర్జెన్సీవార్డులు, లేబర్‌రూంలతోపాటు గాంధీ మెడికల్‌ కాలేజీ ప్రాంగణంలోని లైబ్రరీ భవనంలో ఆక్సిజన్‌ పైప్‌లైన్లు ఏర్పాటు చేశారు. ఈ ఆక్సిజన్‌ పైప్‌లైన్ల పొడవు సుమారు 52 కిలోమీటర్లు ఉంటుందని ఇంజనీరింగ్‌ అధికారులు తెలిపారు.  
► ఆక్సిజన్‌ పైప్‌లైన్లు మరమ్మత్తులకు గురైతే రోగులకు అందించేందుకు సుమారు 200  ఆక్సిజన్‌ సిలిండర్లు అందుబాటులో ఉంచారు. వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగుల వద్దకు నేరుగా తీసుకువెళ్లేందుకు సిలిండర్లకు ట్రాలీలు అనుసంధానం చేశారు.  
► గాంధీలో ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసే ఎనిమిది ప్లాంట్లు ఉన్నాయి. పీఎం కేర్‌ ఆధ్వర్యంలో రెండు యూనిట్లు, అరబిందో ఫార్మా, ఎస్‌ఎంఎస్‌ లైఫ్‌ సైన్సెస్, దివీస్‌ ల్యాబోరేటరీస్, హెటిరో ల్యాబ్స్, ఎంఎస్‌ఎన్‌ ల్యాబోరేటరీస్, నాట్కో ఫార్మా లిమిటెడ్‌ కంపెనీలు ఆక్సిజన్‌ ప్లాంట్స్‌ను కార్పోరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ ద్వారా ఏర్పాటు చేశారు.  

ఇది తెలంగాణ ప్రభుత్వ ఘనత  
కోవిడ్‌ నోడల్‌ సెంటరైన గాంధీఆస్పత్రిలో అత్యంత అధునాతన వసతులు, మౌళిక సదుపాయాలు కల్పించి, నిరుపేదలకు మరింత మెరుగైన సేవలు అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని గాంధీ సూపరింటెండెంట్‌ రాజారావు తెలిపారు. సుమారు రెండువేలకు పైగా వెంటిలేటర్, ఆక్సిజన్‌ పడకలు సిద్ధం చేశామని, సుమారు మూడు వేల మంది రోగులకు నిరంతరం ఆక్సిజన్‌ సరఫరా చేసే సామర్ధ్యం సాధించామన్నారు.  
– రాజారావు, గాంధీ సూపరింటెండెంట్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement