సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ తల్లి విగ్రహంపై తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ నుంచి ఆమోదం తెలుపుతూ గెజిట్ విడుదల చేసినట్లు తెలిపింది.
ప్రభుత్వం జారీ చేసిన జీవోలో ‘తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో, కలెక్టర్ ఆఫీసులలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని, డిసెంబర్ 9 న రాష్ట్ర, జిల్లా మండల ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవంగా జరపాలని పేర్కొంది. ప్రభుత్వం ఆమోదించిన తెలంగాణ తల్లిని అధికారికంగా తెలంగాణ తల్లిగా గుర్తిస్తున్నామని’ జీవోలో స్పష్టం చేసింది.
తెలంగాణ తల్లి విగ్రహంపై సీఎం రేవంత్ ఏమన్నారంటే?
తెలంగాణ తల్లి విగ్రహంపై అసెంబ్లీలో సోమవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహంపై మాట్లాడుతూ..‘తెలంగాణ తల్లి అంటే భావోద్వేగం. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల శక్తి స్వరూపిణి తెలంగాణ తల్లి. మనల్ని లక్ష్యసాధన వైపు నడిపించిన తల్లి తెలంగాణ తల్లి. తెలంగాణ నేల స్వేచ్చ కోసం పిడికిలి బిగించిన ఉజ్వల జ్వాల. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల శక్తి తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లి రూపకల్పనలో సంస్కృతి, సాంప్రదాయాలను తీసుకొచ్చాం.
మెడకు కంటె, గుండు పూసల హారంతో తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన జరిగింది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. పత్రీ ఏటా డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి అవతరణోత్సవం అధికారికంగా నిర్వహిస్తాం. చరిత్ర ఉన్నంత వరకు తెలంగాణ తల్లి నిలిచిపోవాలి. సమ్మక్క-సారలమ్మ, చాకలి ఐలమ్మ స్పూర్తితో విగ్రహం.
ఏ తల్లికి కిరీటం ఉండదు. దేవతలకు మాత్రమే కిరీటం ఉంటుంది. తెలంగాణ గ్రామ దేవత పోచమ్మకు కిరీటం ఉంటుందా. చేతిలో వరి, జొన్నలు, సజ్జలతో తెలంగాణ తల్లి విగ్రహం. పుట్టుక నీది, చావు నీది అన్న కాళోజీ మాటల స్పూర్తితో యువత ఉద్యమించింది. అగ్నికీల్లలో దేహాలు మండినా తెలంగాణ సాధన కోసం యువత వెనకడుగు వేయలేదు’అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment