ప్రతీకాత్మకచిత్రం
కరోనా మహమ్మారి ప్రజలను వణికిస్తోంది. మొదటి దశలో వైరస్ సాధారణంగా ప్రభావం చూపినా రెండో దశలో జిల్లా ప్రజలను వణికించింది. దీంతో ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. వైద్యం కోసం అప్పుసొప్పు చేసి చికిత్స పొందారు. ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. రెండో దశ ముగియడంతో మూడో దశ చిన్నారులపై ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. పిల్లలపై కోవిడ్ వైరస్ ప్రభావం చూపితే వైద్యం అందించేందుకు తగు చర్యలు చేపడుతున్నారు. జిల్లాకు తలమానికంగా ఉన్న రిమ్స్‌లో పిల్లల కోసం ప్రత్యేక పడకలు, ఆక్సిజన్ సిలెండర్లు, వెంటిలెటర్లు, వైద్య సిబ్బందిని నియమించేందుకు ప్రత్యేక చర్యలు ముమ్మరం చేశారు.
సాక్షి, ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 5 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 2 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లతో పాటు రిమ్స్ వైద్య కళాశాల ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో, అర్బన్ హెల్త్ సెంటర్లలో పిల్లలకు సంబంధించిన వైద్య నిపుణులు లేరు. పిల్లలకు వైద్యం అందించేందుకు రిమ్స్ ఆస్పత్రే పెద్ద దిక్కుగా ఉంది. కోవిడ్ మహమ్మారి పేద, ధనిక అనే తేడా లేకుండా ఎవరిని వదలడం లేదు. రెండో దశ ఇంకా ముగియకముందే మూడో దశ చిన్నారులపై ప్రభావం చూపిస్తుందని వైద్య నిపుణులు సూచించారు. దీంతో పిల్లల తల్లిదండ్రుల్లో వణుకు పుడుతోంది. రిమ్స్ ఆస్పత్రిలో మొత్తం 768 పడకలు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం పెద్దల కోసం 416 ఐసీయూ, ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు. వీటికి తోడుగా పది ప్రైవేట్ ఆస్పత్రుల్లో 175 బెడ్లను ఏర్పాటు చేసి వైద్యసేవలు అందించారు. పిల్లలపై ప్రభావం చూపుతుందనే నేపథ్యంలో పిల్లల వార్డులో 60 ఆక్సిజన్ బెడ్లను రిమ్స్ అధికారులు సిద్ధం చేశారు. 10 ఐసీయూ బెడ్లను ఏర్పాటు చేయగా, మరో పది బెడ్లను అదనంగా ఏర్పాటు చేయనున్నారు. అన్ని రోగాలకు సంబంధించి రిమ్స్‌లో ప్రస్తుతం 280 మంది చికిత్స పొందుతున్నారు.
అప్రమత్తమైన వైద్య శాఖ
థర్డ్‌వేవ్‌లో చిన్నారులపై ప్రభావం చూపుతుందన్న నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ, రిమ్స్ అధికారులు ముందుచూపుతో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే బెడ్లను ఏర్పాటు చేయగా, మందులను అందుబాటులో ఉంచేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పటివరకు రిమ్స్ ఆస్పత్రిలో కరోనా బారిన పడి 4వేలకు పైగా చికిత్స పొందారు. 80కి పైగా మృత్యువాత పడ్డారు. మొదటి, రెండో విడతలో కలిపి మొత్తం 5శాతం మంది కూడా చిన్నారులు కోవిడ్ బారిన పడలేదని రిమ్స్ డైరెక్టర్ వివరించారు. దాదాపు 50 మంది వరకు కోవిడ్ బారిన పడి కోలుకున్నారని తెలిపారు. మరణాలు కూడా తక్కువగానే ఉంటాయని పేర్కొంటున్నారు.
తగ్గుముఖం పట్టిన కోవిడ్
కోవిడ్ మహమ్మారి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టింది. గతేడాది మార్చి నెలలో జిల్లాలో మొదటి కేసు నమోదు కాగా, జూలై, ఆగస్టు మాసాల్లో కేసులు పెరిగాయి. ఆ తర్వాత అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు పదుల సంఖ్యలో కేసులు నమోదు కాగా, ఈ ఏడాది మార్చిలో మరోసారి విజృంభించి ఏప్రిల్ నెలలో వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. గత నెలలో లాక్‌డౌన్ విధించడంతో మళ్లీ కేసులు తగ్గాయి. ప్రస్తుతం 5 నుంచి 10 లోపు కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు జిల్లాలో 3,70,648 పరీక్షలు చేయగా 16,252 మందికి పాజిటీవ్ నిర్ధారణ అయ్యింది. 3,54,193 మందికి నెగిటివ్ రిపోర్టులు వచ్చాయి. ప్రస్తుతం జిల్లాలో 84 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు జిల్లాలో 16,084 మంది కోవిడ్‌ను జయించారు. దాదాపు 200 మందికి పైగా కోవిడ్ బారిన పడి మృత్యువాత పడ్డారు. కానీ జిల్లా వైద్యారోగ్య శాఖాధికారుల లెక్కల ప్రకారం 84 మంది మృతిచెందారు.
భయపడాల్సిన అవసరం లేదు
థర్డ్ వేవ్ నేపథ్యంలో పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. పెద్దవారికి సోకినంతగా వైరస్ చిన్నారులకు సోకదు. వారిలో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుంది. పిల్లలు కూడా మాస్కులు ధరించేలా చూడాలి. భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలి. తల్లిదండ్రులు చిన్నారులను అనవసరంగా బయటకు తీసుకెళ్లొద్దు. చిరుతిండ్లకు దూరంగా ఉంచాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకునేలా చూడాలి. అనారోగ్య సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించాలి. చిన్నారుల్లో జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, విరేచనాలు, కడుపునొప్పి తదితర లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలి.
– బానోత్ బలరాం, రిమ్స్ డైరెక్టర్, ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment