Graduate MLC Elections In Telangana 2021: సిట్టింగ్‌ పట్టాలె.. ‘బోనస్‌’ కొట్టాలె! - Sakshi
Sakshi News home page

సిట్టింగ్‌ పట్టాలె.. ‘బోనస్‌’ కొట్టాలె! 

Mar 2 2021 3:18 AM | Updated on Mar 2 2021 11:28 AM

Telangana Graduate MLC Elections: BJP Focus For Won - Sakshi

రెండు ఎమ్మెల్సీ సీట్లకు నామినేషన్లు వేసిన నాటి నుంచే పార్టీ క్యాండిడేట్లు, నేతల్లో ఉత్సాహం కనిపిస్తోంది.

సాక్షి, హైదరాబాద్‌: కొంతకాలంగా రాష్ట్రంలో దూకుడుగా వ్యవహరిస్తున్న బీజేపీ త్వరలో జరుగనున్న గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో గెలుపే ధ్యేయంగా ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుత సిట్టింగ్‌ సీటుతోపాటు మరో ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా బోనస్‌గా దక్కించుకోవాలని భావిస్తోంది. ఈ దిశగా కమలనాథులు క్షేత్ర స్థాయి నుంచి ప్రచార వ్యూహాలను సిద్ధం చేశారు. రెండు ఎమ్మెల్సీ సీట్లకు నామినేషన్లు వేసిన నాటి నుంచే పార్టీ క్యాండిడేట్లు, నేతల్లో ఉత్సాహం కనిపిస్తోంది.

దానికితోడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఇతర ముఖ్య నేతలు కూడా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు. మరోవైపు సంఘ్‌ పరివార్‌ కేడర్‌ కూడా చాపకింద నీరులా దూసుకెళ్తోందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆశించిన ఫలితం సాధి స్తామని బీజేపీ నేతలు ధీమాగా ఉన్నారు. రంగారెడ్డి-హైదరాబాద్‌-మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ సీటులో తమ అభ్యర్థి ఎన్‌.రాంచందర్‌రావు గెలిచే చాన్స్‌ ఎక్కువని.. నల్లగొండ- ఖమ్మం-వరంగల్‌ సీట్లో గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి విజయం సాధించేలా ఫోకస్‌ పెట్టాలని నిర్ణయించారు.



అన్నిస్థాయిల వారిని రంగంలోకి దింపి.. 
గ్రాడ్యుయేట్‌ ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ అన్ని స్థాయిల నేతలు, కార్యకర్తలను రంగంలోకి దింపింది. పార్టీలో చేరిన ముఖ్య నేతలందరినీ రంగంలోకి తెచ్చింది. జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా, పోలింగ్‌ బూత్‌ల వారీగా ఇన్‌చార్జులను నియమించింది. పార్టీ నుంచి ప్రతి 25 మంది ఓటర్లకు ఓ ఇన్‌చార్జిని పెట్టింది. అన్ని స్థాయిల్లో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో మోత్కుపల్లి నర్సింహులు, గూడూరు నారాయణరెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి వంటి నేతలంతా బీజేపీ అభ్యర్థుల ప్రచారంలో ఉన్నారు. బీజేపీ శ్రేణులతోపాటు గ్రాడ్యుయేట్‌ ఓటర్ల నమోదులోనూ క్రియాశీలకంగా పాల్గొన్న సంఘ్‌ పరివార్‌ కార్యకర్తలు కూడా ప్రచారంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.

టార్గెట్‌ టీఆర్‌ఎస్‌.. కాంగ్రెస్‌పై ఫైరింగ్‌
కాషాయ నేతలు ముఖ్యంగా టీఆర్‌ఎస్‌ను టార్గెట్‌గా చేసుకుని, ఆరేళ్ల టీఆర్‌ఎస్‌ వైఫల్యాలను ఎత్తిచూపుతున్నారు. వీలున్నప్పుడల్లా కాంగ్రెస్‌ గురించి ప్రస్తావిస్తూ.. ఆ పార్టీ పని అయిపోయినట్లే నని, రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం తామేనని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ మంచి ఊపుమీద ఉన్నప్పుడే బీజేపీ తరఫున రాంచందర్‌రావు భారీ మెజారిటీతో గెలిచారని, వరంగల్‌ సీటును కూడా కొద్ది ఓట్లతో పోగొట్టుకున్నామని అంటున్న బీజేపీ.. ఇప్పుడు రెండింటినీ కైవసం చేసుకుంటామని చెప్తోంది. టీఆర్‌ఎస్‌పై అన్నివర్గాల్లో వ్యతిరేకత పెరిగిపోయిందని బీజేపీ నేతలు అంటున్నారు.

ఏడేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో ఉద్యోగాల సృష్టి, వీసీల నియామకాలు, ఉద్యోగ నోటిఫికేషన్ల జారీ, గ్రూపు- 1, 2 పోస్టుల భర్తీ చేపట్టకపోవడం, యూనివర్సిటీపై నిర్లక్ష్యం, పీఆర్‌సీ, రిటైర్‌మెంట్‌ వయసు పెంపు వంటివి అమలు చేయకపోవడం వంటివాటిని గ్రాడ్యుయేట్లలోకి బలంగా తీసుకెళ్తామని చెప్తున్నారు. ఈ దిశగా మంత్రులు, టీఆర్‌ఎస్‌ నేతలపై విమర్శలు చేయడంలో, కౌంటర్లు ఇవ్వడంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్సీ క్యాండిడేట్‌ రాంచందర్‌రావు కూడా అదే తరహాలో మంత్రి కేటీఆర్‌కు సవాల్‌ విసిరారు. మంత్రులు, అధికార పక్ష నేతలను రెచ్చగొడుతూ, ఇరుకున పెట్టాలన్న వ్యూహంతో ముందుకుసాగుతున్నారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానంలో బీజేపీ క్యాండిడేట్‌ ప్రేమేందర్‌రెడ్డి తరచూ టీఆర్‌ఎస్‌ పాలనపై, మంత్రి దయాకర్‌రావు, ఇతర టీఆర్‌ఎస్‌ నేతల వ్యాఖ్యలపై గట్టి విమర్శలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement