సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌లో ఎమ్మెల్సీ మధుసూదనాచారికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 7కు వాయిదా వేసింది. గతంలో గవర్నర్ కోటాలో గోరటి వెంకన్న, దయానంద్, బసవరాజు సారయ్యలను మంత్రి వర్గ సిఫారసు మేరకు గవర్నర్ తమిళిసై నియమించారు. వీరి నియామకాన్ని సవాల్ చేస్తూ సామాజిక కార్యకర్త ధనగోపాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
గతంలో గవర్నర్ తన పేరును ఎమ్మెల్సీగా ప్రతిపాదించి చీఫ్ సెక్రటరీకు పంపారు. అనంతరం ఎం. శ్రీనివాస్‌రెడ్డి పదవీ కాలం ముగియడంతో మరో స్థానం ఖాళీ అయింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ స్థానానికి అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనాచారి పేరును సిఫారసు చేయడంతో.. గవర్నర్ ఆ మేరకు నామినేట్ చేశారు. ఈ నామినేషన్‌ను వ్యతిరేకిస్తూ పిటిషనర్ ధనగోపాల్ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు.
మధుసూదనా చారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారని.. అలాంటి వారిని గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు సిఫార్సు చేస్తూ రాజకీయ పునరావాసం కల్పిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది మామిడి వేణుగోపాల్ హాజరయ్యారు. ధర్మాసనం ఇంప్లీడ్ పిటిషన్‌ను అనుమతించింది. మధుసూదనాచారికి నోటీసులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment