
సాక్షి, నిర్మల్: జిల్లా కలెక్టర్ ముషరఫ్ అలీ పై హైకోర్టు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్మల్ పట్టణంలో ఉన్న చెరువుల్లో చేపడుతున్న అక్రమాల పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ హైకోర్టు కలెక్టర్‌ను ప్రశ్నించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎందుకు పాటించలేదో సమాధానం చెప్పాలని కోర్టు ఆదేశింది. కంచరోలి, ఇబ్రహీం ట్యాంక్ చెరువులో చేపట్టిన అక్రమ నిర్మాణలను ఎందుకు అడ్డుకోవడం లేదో తెలపాలని కోర్టు కోరింది. కోర్టు చెప్పేది నాలుగవ తరగతి ఉద్యోగికి కూడా అర్థం అవుతుంది కానీ నిర్మల్ జిల్లా కలెక్టరుకు అర్థం కావడంలేదని హైకోర్టు న్యాయమూర్తులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. వచ్చే సోమవారం అనగా అక్టోబర్ 12వ తేదీన వ్యక్తిగతంగా హైకోర్టుకు హాజరు కావాలని కోర్టు కలెక్టర్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు న్యాయమూర్తులు సోమవారంకు వాయిదా వేశారు.