హైదరాబాద్, సాక్షి: సీఎం రేవంత్ రెడ్డి భద్ర తలో ఉన్నతాధికారులు మార్పులు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ వద్ద పనిచేసి, ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి వద్ద కూడా కొనసాగుతున్న భద్రతా సిబ్బందిని పూర్తిగా మార్చేశారు. ముఖ్యమంత్రి కార్యకలాపాలకు సంబంధించిన ప్రతీ సమాచారం బయటకు పొక్కుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గత సీఎం వద్ద పనిచేసిన వారిలో ఇదివరకు కొద్ది మందిని మాత్రమే మార్చగా, ఇంకా చాలా మంది అదే సెక్యూరిటీ విధుల్లో కొనసాగుతున్నారు.
ఈ నేపథ్యంలో సీఎంకు సంబంధించిన కీలక సమావేశ వివరాలు బయటకు వెళ్లడం, ఆయన భద్రతకు, పరిపాలన, ప్రభుత్వానికి మంచిది కాదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నిఘా విభాగం అధిపతి శివధర్‌రెడ్డి ఈ అంశాన్ని సీఎం రేవంత్ దృష్టికి తీసుకెవెళ్లిన అనంతరం భద్రతా సిబ్బందిని మార్చాలని నిర్ణయించారు. ఈ క్రమంలో సీఎం భద్రతను చూసేందుకు ప్రత్యేకంగా ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌ను ఏర్పాటు చేశారు.
ల్యాండ్ క్రూయిజర్లతో కొత్త కాన్వాయ్..
భద్రతాధికారులు సీఎంకు కొత్త కాన్వాయ్‌ని కూడా సమకూర్చారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి నల్లరంగు కారులో వెళ్తే, ఆయన భద్రతా సిబ్బంది వాహనాలు వేరే రంగులో ఉండేవి. ఇలా సీఎం ప్రయా ణించే వాహనాన్ని సులభంగా గుర్తించడానికి వీలవడంతో.. ముప్పు ఉంటుందని నిఘావర్గాలు హెచ్చరించాయి. దీంతో ఆయన కాన్వాయ్‌లోని వాహన శ్రేణిని మొత్తం నల్లరంగులోకి మార్చేశారు. మాజీ సీఎం కేసీఆర్ తెల్లరంగున్న వాహన శ్రేణని వినియోగించేవారు. గత ప్రభుత్వ హయాంలోనే సీఎం కోసం తెల్లరంగు ల్యాండ్ క్రూయిజర్ వాహనాలను కొనుగోలు చేశారు. వాటికి విజయవాడలో బుల్లెట్‌ప్రూఫ్ చేయించారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నల్లరంగు వాహనాలంటే ఇష్టం కావడంతో, వాటి కలర్‌ను అధికారులు మార్చేశారని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment