సాక్షి, హైదరాబాద్: ‘గాంధీ, నెహ్రూ, ఇందిర, రాజీవ్ గాంధీలతో దేశ ప్రజలకు రాజకీయ బంధం కంటే రక్త సంబంధంతో సమానమైన అవిభాజ్య బంధం ఉంది. కాంగ్రెస్ పార్టీ త్యాగధనుల పార్టీ. పదవులను త్యాగం చేసి మన్మోహన్‌ను ప్రధానిని చేసిన ఘనత గాంధీ కుటుంబానిది. బీజేపీలో అద్వానీని ప్రధానమంత్రిగా చేయగలరా? విలువల్లేని బీజేపీకి కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత లేదు’అని సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
గురువారం అసెంబ్లీ మీడియా హాల్‌లో ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్, బీజేపీ సహా ఏ పార్టీ నేతలైనా కాంగ్రెస్‌ను విమర్శిస్తే ఊరుకునేది లేదని, రాహుల్, ప్రియాంకలను ఎవరు విమర్శించినా కడిగి పారేస్తామని పేర్కొన్నారు. ఈసారి కూడా తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని, కేసీఆర్ ముందస్తు ఎన్నికలకే వెళ్తారని భావిస్తున్నానని అన్నారు. సాధారణ ఎన్నికలకు వెళ్తే ఎమ్మెల్యే, ఎంపీలకు ఒకేసారి పోలింగ్ ఉంటుందని, ఈ కోణంలో 2023 ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎన్నికలకు వెళ్తారని అనుకుంటున్నానని చెప్పారు.
దేశంలో ఎన్ని ఫ్రంట్‌లు వచ్చినా వాటికి కాంగ్రెస్ పార్టీ మద్దతు అవసరమని అన్నారు. రాహుల్ గాంధీని ఉద్దేశించి అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందించడంలో తప్పేమీ లేదని, గాంధీ కుటుంబం దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబమని, అందుకే ఆ కుటుంబాన్ని విమర్శించినందుకు కేసీఆర్ స్పందించి ఉంటారని అభిప్రాయపడ్డారు.
నిరుద్యోగానికి, పుట్టిన రోజుకు ఏం సంబంధం?
సీఎం కేసీఆర్‌కు జగ్గారెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి తన పుట్టినరోజును జరుపుకోవడంలో తప్పేమీ లేదని, నిరుద్యోగానికి, పుట్టినరోజుకు ఏం సంబంధమని ప్రశ్నించారు. అయితే ఉద్యోగాలు ఇస్తానని చెప్పి కేసీఆర్ మాట తప్పారని, తెలంగాణ నిరుద్యోగ యువతను కేసీఆర్ మోసం చేశారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ధర్నాల గురించి తనకు తెలియదని, తాను ఈ మధ్యకాలంలో ఎక్కువగా నియోజకవర్గానికే పరిమితం అవుతున్నందున ఆ విషయం తనకు తెలియలేదని చెప్పారు. రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కలసిపోవడం కాంగ్రెస్ పార్టీకి మంచి పరిణామమని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment