తల్లులు జైలుకు వెళ్లడంతో తండ్రులతో పిల్లలు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం ఎల్లన్ననగర్ పోడు భూముల వ్యవహారం కేసులో దూకుడుగా వ్యవహరించిన పోలీసులు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. పోడురైతులు–అటవీ శాఖ అధికారులకు మధ్య చోటు చేసుకున్న ఘటనలో చంటిపిల్లల తల్లులతోపాటు మహిళలను రిమాండ్‌కు తరలించడం వివాదాస్పదమైంది. ఈ విషయమై ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు కూడా సీరియస్ అయినట్లు తెలిసింది. ఈ పరిణామాలతో కొణిజర్ల పోలీసులు తాము నమోదు చేసిన కొన్ని సెక్షన్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఖమ్మం మూడో అదనపు మేజిస్ట్రేట్ కోర్టులో శనివారం మెమో దాఖలు చేశారు. విచారణలో పోడుదారులు మారణాయుధాలు కలిగిలేరని, దాడులు చేయలేదని తేలడంతో హత్యాయత్నం కింద 307, మారణాయుధాలు కలిగి ఉండటం కింద 148 సెక్షన్లను తొలగిస్తున్నట్లు మెమోలో పేర్కొన్నారు. కొణిజర్ల ఎస్సై సురేష్ దాఖలు చేసిన ఈ మెమోపై విచారణను న్యాయమూర్తి సోమవారానికి వాయిదా వేశారు. ఇక బాధితుల తరపున న్యాయవాది కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
ఘటనపై విచారణకు ఆదేశం
ఎల్లన్ననగర్ ఘటనలో 23 మందిపై కేసులు నమోదు చేయడం, అందులో చంటిపిల్లల తల్లులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. రాజకీయ విమర్శలు, మీడియాలో కథనాలు రావడంతో పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ ఈ ఘటనపై అడిషనల్ డీసీపీ స్థాయి అధికారితో విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. పూర్తిస్థాయిలో విచారణ చేయకుండా హడావుడిగా కేసులు ఎందుకు పెట్టారని కొణిజర్ల ఎస్‌ఐ సురేష్‌ను ఉన్నతాధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. చంటి పిల్లల తల్లులని చూడకుండా మహిళలపై అటవీ శాఖ అధికారులు కక్ష పూరితంగా వ్యవహరించడంపై ప్రభుత్వం ఉన్నతాధికారుల ద్వారా ఆరా తీసినట్లు తెలిసింది.
కేసులు ఎత్తివేయాలి..
ఎల్లన్ననగర్ వాసులపై పెట్టిన అక్రమ కేసులన్నీ ఉపసంహరించుకోవాలి. సరైన విచారణ చేయకుండానే వారిపై 307, 148 వంటి సీరియస్ సెక్షన్లు పెట్టి జైలుకు తరలించారు. అక్రమ కేసులు పెట్టడానికి కారణమైన అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలి.
– పోటు రంగారావు, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ.
Comments
Please login to add a commentAdd a comment