
సాక్షి, హైదరాబాద్: సీరియస్ కరోనా రోగులకే ఆసుపత్రుల్లో పడకలు కేటాయించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. సాధారణ లక్షణాలతో కరోనా వచ్చిన వారికి ఆసుపత్రుల్లో ఐసోలేషన్ పడకలు అవసరం లేదని తేల్చిచెప్పింది. అటువంటి వారి కోసం కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేశామని, అక్కడకు వెళ్లాలని సూచించింది. ఒకవేళ ఎవరైనా అలాంటి బాధితులు ఆసుపత్రులకు వచ్చినా, వారిని కోవిడ్ కేర్ సెంటర్లకు పంపాల్సిన బాధ్యత ఆసుపత్రి వర్గాలదేనని పేర్కొంది. ఈ నేపథ్యంలో కోవిడ్ పాజిటివ్ రోగులను మూడు వర్గాలుగా విభజించింది. ఒకటి కరోనా పాజిటివ్ వచ్చిన సాధారణ రోగులు.
రెండు కరోనా వచ్చాక ఆక్సిజన్ అవసరమైన వారు. మూడు వెంటిలేటర్ లేదా ఐసీయూ అవసరమైన వారుగా విభజించింది. ఇందులో మొదటి వర్గం వారికి కరోనా పాజిటివ్ వచ్చినందున ఐసోలేషన్ కేంద్రాలకు పంపాలి లేదా వారిని ఇళ్లల్లోనే ఉంచి చికిత్స అందించాలి. ఆక్సిజన్, వెంటిలేటర్ అవసరమైన వారికే ఆసుపత్రుల్లో బెడ్స్ కేటాయించాలి. రాష్ట్రంలో తాజాగా ప్రభుత్వం అన్ని జిల్లాల్లో 44 కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసింది.
వాటిల్లో 4,013 ఐసోలేషన్ పడకలను సిద్ధంగా ఉంచింది. వీటిల్లో సాధారణ కరోనా రోగులు చికిత్స తీసుకోవచ్చు. వారికి అక్కడ ఏమైనా ఇబ్బందులు తలెత్తితే తక్షణమే అంబులెన్సుల్లో ఆసుపత్రులకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక కరోనా కాకుండా ఇతర వ్యాధులకు చికిత్స కోసం వచ్చే వారిలో తప్పనిసరి కేసులకే ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. వాయిదా వేసే చికిత్సలు, వైద్యానికి సంబంధించి రోగులను ఇప్పుడే తీసుకోకూడదని నిర్ణయించారు.
సాధారణ పడకలకూ ఆక్సిజన్ సదుపాయం
కరోనా విజృంభణ రోజురోజుకూ పెరుగుతోంది. వచ్చే మూడు నెలల్లోనే గతేడాది అవే నెలలతో పోలిస్తే మూడింతల కేసులు నమోదు అయ్యే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. కేసుల సరళి పరిశీలించినా అదే కనిపిస్తోంది. ఇప్పటికే అనేక ఆసుపత్రుల్లో కరోనా పడకల కొరత ఏర్పడింది. మున్ముందు ఇంకా కొరత ఏర్పడే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవాలంటే వ్యూహాత్మకంగా వ్యవహరించాలనేది వైద్య ఆరోగ్యశాఖ ఆలోచన. అయితే ఇప్పటివరకు ఆసుపత్రుల్లో కరోనా కోసం సాధారణ, ఆక్సిజన్, ఐసీయూ లేదా వెంటిలేటర్ పడకలుగా వర్గీకరించి ఆ ప్రకారం నింపుతున్నారు.
మొత్తం 61 ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా కోసం 8,542 పడకలు కేటాయించగా, అందులో 1,551 సాధారణ పడకలున్నాయి. మిగిలినవి ఆక్సిజన్, ఐసీయూ పడకలు. ఇక 244 ప్రైవేట్ కార్పొరేట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో 11,778 పడకలు కరోనాకు కేటాయించగా, అందులో 4,657 సాధారణ పడకలు ఉన్నాయి. వీటిల్లో 3,924 ఆక్సిజన్, 3,197 ఐసీయూ లేదా వెంటిలేటర్ పడకలున్నాయి. ఇలా సాధారణ పడకలు అధికంగా ఉండటంతో సీరియస్ రోగులకు బెడ్స్ దొరకని పరిస్థితి ఏర్పడుతుందని సర్కారు భావన. అందుకే ప్రభుత్వ ఆసుపత్రుల్లోని సాధారణ పడకలకూ ఆక్సిజన్ సదుపాయం కల్పించాలని నిర్ణయించారు. మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఆక్సిజన్ వసతిని కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.