చేనేతపై జీరో జీఎస్టీ డిమాండ్ చేస్తూ హ్యాండ్లూమ్ మార్చ్‌లో పాల్గొన్న ఎల్.రమణ, నటి పూనంకౌర్ తదితరులు
ఖైరతాబాద్: చేనేత ఉత్పత్తులపై జీరో జీఎస్టీ చేసేవరకు కేంద్ర ప్రభుత్వంపై పోరాటం కొనసాగుతుందని ఎమ్మెల్సీ ఎల్.రమణ తెలిపారు. అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజా వేదికగా చేనేతపై జీరో జీఎస్టీ డిమాండ్ చేస్తూ హ్యాండ్లూమ్ మార్చ్ బుధవారం నిర్వహించారు. సినీ నటి పూనంకౌర్‌తో కలిసి... ఎల్.రమణ హ్యాండ్లూమ్‌మార్చ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేతపై 5శాతం పన్నును యథావిధిగా కొనసాగిస్తామని కేంద్రం ప్రకటించడం కంటితుడుపు చర్య మాత్రమేనన్నారు.
జీఎస్టీ తొలగించాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్, హరీశ్‌రావులు వివిధ సందర్భాల్లో జీఎస్టీ కౌన్సిల్‌కు లేఖలు రాశారని, చేనేతపై జీరో జీఎస్టీ ఉండాలని ఉద్యమం చేస్తుంటే... కేంద్ర ప్రభుత్వం 5శాతం జీఎస్టీ విధించి, దాన్ని 12శాతానికి పెంచి అన్యాయం చేసిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు స్వామి, ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం, చేనేత విభాగం జాతీయ అధ్యక్షుడు ఎర్రమాద వెంకన్న, యువజన నేత గుండేటి శ్రీధర్, తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేడం రాంబాబుతో పాటు వివిధ చేనేత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment