ఒకేసారి పెట్టుబడి, నెలనెలా ఆదాయం.. క్వింటాలుకు రూ.50 వేలుపైనే.. | Telangana: Mulberry Silk Cultivation Farmers Earning Profits | Sakshi
Sakshi News home page

ఒకేసారి పెట్టుబడి, నెలనెలా ఆదాయం.. క్వింటాలుకు రూ.50 వేలుపైనే..

Published Tue, Jul 5 2022 10:37 AM | Last Updated on Tue, Jul 5 2022 2:52 PM

Telangana: Mulberry Silk Cultivation Farmers Earning Profits - Sakshi

సాక్షి, దౌల్తాబాద్‌ దుబ్బాక): 
రోజురోజుకు పెరుగుతున్న సాగు వ్యయంతో వ్యవసాయం అంటేనే రైతులు ఆందోళన చెందుతున్నారు. పెరిగిన ఇంధనం ధరలు, కూలీల ఖర్చులు, పెట్టుబడి వ్యయంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో సాంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలికి ఆధునిక సాగుపై దృష్టి సారించాడు సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండలం ముబరాస్‌పూర్‌ గ్రామానికి చెందిన యువ రైతు చక్రపాణి. వ్యవసాయ అధికారుల సూచనతో మల్బరీ సాగు పట్టుపురుగుల పెంపకంపై దృష్టి సారించి నెలనెలా మంచి ఆదాయం పొందుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే....

రెండకారాల్లో సాగు..
గ్రామంలో సోదరుడి మల్బరీ తోట నుంచి చెట్టు కొమ్మలను తెచ్చి రెండెకరాల్లో సాగు ప్రారంభించా. ట్రాక్టర్‌కు రూ.14వేలు, కూలీలకు కలిపి రూ.16వేలు ఖర్చు అయ్యింది. రెండు రోజుల్లో రెండెకరాల్లో సుమారు 11వేల మొక్కలను నాటించా. ఒక్కో మొక్కకు మూడు ఫీట్ల దూరం ఉండేలా ఏర్పాటు చేసుకున్నా.మొక్కల మధ్య పెరిగిన కలుపును ఎప్పటికప్పుడు కూలీలతో తొలగించాం. మొక్కలకు నీరు అందించేందుకు రూ.8వేల వ్యయంతో ప్రభుత్వం సబ్సిడీపై అందించిన స్పింకర్లను ఏర్పాటు చేసుకున్న. ప్రతిరోజు క్రమం తప్పకుండా నీరు అందించడంతో మొదటి కోత వచ్చేందుకు మూడు నెలల సమయం పట్టింది.

గతేడాది జూన్‌లో మొక్కలు నాటగా సెప్టెంబర్‌లో ఆకులు కోతకు వచ్చాయి. ఆ తర్వాత నుంచి ప్రతీ నెలరోజులకు ఒకసారి కొమ్మలు, ఆకులు కోతకు వస్తున్నాయి.   150 రింగుల్లో వేసిన పట్టు పురుగులతో నెలకు సుమారు క్వింటాలున్నర పట్టుగూళ్లు వస్తాయి. కిలో రూ.500ల చొప్పున మార్కెట్‌లో విక్రయిస్తే సుమారు రూ.70 నుంచి 80వేల ఆదాయం వస్తుంది. కూలీలు, రవాణాకు కలిపి రూ.5వేలు ఖర్చు అవుతుంది. ఒక్కసారి సాగుచేసిన మొక్కలు సుమారు 20ఏళ్ల వరకు ఉపయోగపడతాయి. ఈ సాగులో పెట్టుబడి ఒక్కసారే, ఆదాయం మాత్రం నెలనెలా పొందవచ్చు.

పట్టుగూళ్లు.. 
రూ.8 లక్షల వ్యయంతో షెడ్డు నిర్మించి, అందులో పట్టు పురుగుల పెంపకం ప్రారంభించా. సిద్దిపేటలోని ఓ డీలర్‌ నుంచి పట్టు పురుగుల గుడ్ల రింగులను తెప్పించా. 150 రింగులకు సుమారు రూ.1600ల ఖర్చు అయ్యింది. ఒక్కో రింగులో 50చొప్పున గుడ్లు ఉంటాయి. గుడ్లను ప్రత్యేక బాక్సుల్లో పెట్టి నాలుగు రోజులు ఉంచితే గుడ్డు పగిలి పట్టుపురుగులు బయటకు వస్తాయి. ఇలా వచ్చిన పట్టు పురుగులను నెట్‌ ఏర్పాటు చేసిన బాక్సుల్లో ఉంచాలి. మల్బరీ ఆకులను క్రమం తప్పకుండా అందిస్తూ ఉంటే నెలరోజుల్లో పట్టుపురుగులు పెరిగి, చంద్రికలను(పట్టుగూళ్లు) తయారు చేస్తాయి.  

క్వింటాలుకు రూ.50వేలపైనే..
150 రింగుల్లో వేసిన పట్టు పురుగులతో నెలకు సుమారు క్వింటాలున్నర పట్టుగూళ్లు వస్తాయి. కిలో రూ.500ల చొప్పున మార్కెట్‌లో విక్రయిస్తే సుమారు రూ.70 నుంచి 80వేల ఆదాయం వస్తుంది. కూలీలు, రవాణా కలిపి రూ.5వేలు ఖర్చు అవుతుంది. ఒక్కసారి సాగుచేసిన మొక్కలు సుమారు 20ఏళ్ల వరకు ఉపయోగపడతాయి. ఈ సాగులో పెట్టుబడి ఒక్కసారే ఉన్నా, ఆదాయం మాత్రం నెలనెలా పొందవచ్చు.   

ఏడాదిగా సాగు.. 
వ్యవసాయంలో ఆదాయం తగ్గడంతో పట్టుపురుగుల పెంపకం వైపు దృష్టి సారించా. గతేడాది మల్బరీ, పట్టు పురుగుల పెంపకం చేపడుతున్నా. కుటుంబ సభ్యులతో కలిసి పని చేస్తాం. ఏడాదిలో గరిష్టంగా 10 నుంచి 12 బ్యాచ్‌ల వరకు వేయవచ్చు. నెలకు రూ.60వేలపైనే ఆదాయం సమకూరుతుంది. మొక్కలు కావాల్సిన వారికి ఉచితంగా అందిస్తాం. 
– చక్రపాణి, రైతు, ముబరాస్‌పూర్‌ 

రైతులు దృష్టి సారించాలి 
ఆధునిక వ్యవసాయ పద్ధతుల వైపు రైతులు దృష్టి సారించాలి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలువచ్చే పంటలను సాగుచేయాలి. ప్రత్యామ్నాయ పంటలసాగు కోసం ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం, బీసీలకు 50 శాతం ప్రభుత్వం రాయితీ అందిస్తోంది. దీనిని సద్వినియోగం చేసుకోవాలి.  
– గోవిందరాజులు, మండల వ్యవసాయ అధికారి, దౌల్తాబాద్‌

చదవండి: JEE Mains 2022 Answer Key: ఆన్సర్‌ చేసినా ఆనవాలే లేదట.. జేఈఈ అభ్యర్థులకు చేదు అనుభవం


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement