సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాంతం.. దట్టమైన అడవుల్లో.. గుట్టల దిగువన పొడవాటి శిలలు.. ఏదో పని కోసం మనుషులు చెక్కి అలా వదిలేసినట్టు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.. కానీ అవి ప్రకృతి చెక్కిన రాళ్లు.. అందులోనూ మామూలు రాళ్లు కాదు.. భూమి అడుగునుంచి పొంగుకొచ్చిన లావా గట్టిపడి నిలువునా పోతపోసి నట్టు ఏర్పడిన బసాల్ట్ శిలలు అవి. ఎంతో చరిత్ర దాగి ఉన్న ఆ నిలువు రాళ్లను ఔత్సాహిక యువత గుర్తించినా.. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) ఇప్పటివరకు నమోదు చేయలేదు. పరిరక్షణకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీనితో ఆ అరుదైన బసాల్ట్ శిలలు ధ్వంసమైపోయే అవకాశం ఉందన్న విమర్శలు వస్తున్నాయి.
ఏమిటీ శిలలు..
►ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని బజార్ హత్నూర్, బోరెల్‌గూడ, ఆసిఫాబాద్ సమీపంలోని వర్తమనూర్‌తోపాటు పలుచోట్ల అరుదైన బసాల్ట్ శిలలు ఉన్నాయి. వీటిని కాలమ్నార్ బసాల్ట్ (లావా శిలలు)గా పిలుస్తారు. సుమారు ఆరు కోట్ల ఏళ్ల కింద ఇవి ఏర్పడినట్టు అంచనా. సాధారణంగా భూగర్భం నుంచి ఉబికి వచ్చిన లావా ప్రవహిస్తూ నీటి ప్రవాహాల వద్ద వేగంగా ఘనీభవించినపుడు.. నీళ్లు ఇంకినప్పుడు నేల నెర్రలువాసినట్టుగా లావాలో అష్టభుజి, షట్భుజి, చతురస్రం.. ఇలా రకరకాల ఆకృతుల్లో లోతుగా పగుళ్లు ఏర్పడతాయి. కొన్నేళ్ల పరిణామక్రమంలో అవి విడివడి స్తంభాలుగా రూపొందుతాయి. చాలా ప్రాంతాల్లో లావా ప్రవహించినా ఈ కాలమ్నార్ బసాల్ట్‌లు మాత్రం కొన్ని చోట్లనే ఏర్పడడం విశేషం. ఇలాంటివి చాలా అరుదు కూడా.
5 లక్షల కిలోమీటర్ల పరిధిలో..
►భూగర్భం నుంచి ఉబికి వచ్చిన లావా ప్రవహించిన ప్రాంతం మన దేశంలో ఐదు లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉంది. దీన్ని డెక్కన్ వల్కానిక్ ప్రావిన్స్ (డీవీపీ)గా పేర్కొంటారు. ఇందులో మహారాష్ట్ర పూర్తి ప్రాంతం ఉండగా తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, గుజరాత్‌లలో కొంత భాగం ఉంది. డీవీపీ తూర్పు చివరిభాగం తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్‌లలో విస్తరించి ఉంది. ఈ డీవీపీలోనే పలు ప్రాంతాల్లో కాలమ్నార్ బసాల్ట్ శిలలు ఏర్పడ్డాయి.
ఇతర రాష్ట్రాల్లో రక్షిస్తున్నా..
మహారాష్ట్ర, కర్ణాటకలలో ఇలాంటి లావా శిలలున్న ప్రాంతాలను జీఎస్‌ఐ అధికారికంగా గుర్తించింది. ఇప్పుడు అవి రక్షిత ప్రాంతాలుగా ఉన్నాయి. కర్ణాటకలోని ఉడిపి జిల్లా పరిధిలోకి వచ్చే సెయింట్ మేరీస్ దీవిలో పొడవాటి లావా శిలలతో ఏర్పడిన గుట్ట ఉంది. ఆ శిలలను జీఎస్‌ఐ గుర్తించి ప్రాచుర్యంలోకి తేవటంతో అది పర్యాటక ప్రాంతంగా మారింది. విదేశాల్లోనూ ఇలాంటి శిలలున్న ప్రాంతాలను జియో పార్కులుగా అభివృద్ధి చేస్తున్నారు. అయితే మన రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఐదారు ప్రాంతాల్లో ఈ లావా శిల లను గుర్తించినా పట్టించుకునేవారే లేకుండా పోయారు. వ్యవసా యం, ఆవాసాల విస్తరణ, రోడ్ల నిర్మాణంతో అవి చెదిరిపోయే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అంగారకుడిపైనా కాలమ్నార్ శిలలు
► కొన్నేళ్ల కింద నాసా ఉపగ్రహాలతో అంగారకుడిని చిత్రించినప్పుడు కనిపించిన దృశ్యాలు శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరి చాయి. అంగారక గ్రహం మీద గుట్ట ల్లాగా ఉన్న ప్రాంతాల్లో నిలువు చారలను విశ్లేషించగా.. కాలమ్నార్ బసాల్ట్ (లావా శిలలు)గా తేల్చారు. అంగారక గ్రహం మీద అగ్నిపర్వతాలు ఉండేవన్న దానికి ఇవి ఆధారంగా నిలిచాయి. భవిష్యత్తులో మానవులు అంగారకుడిపైకి వెళ్లేందుకు ఎంత అనువుగా ఉంటుందన్న దిశలో సాగుతున్న పరిశోధనల్లో ఇదీ ఓ కీలక అంశంగా మారింది.
బొమ్మలు గీసినట్టే
ఇది ఆసిఫాబాద్ ప్రాంతంలోని వర్తమనూర్ వద్ద అడవిలో కనిపించిన అందమైన రాతి అమరిక. ఎవరో చెక్కినట్టుగా, రాళ్లపై ఆదిమానవులు రూపొందించిన పెట్రోగ్లివ్స్ను తలపిస్తున్న ఈ అమరిక లావా ప్రభావంతో ఏర్పడినదే. ప్రపంచవ్యాప్తంగా కొన్నిచోట్ల మాత్రమే ఇలాంటి శిలలు ఉన్నాయి. అలాంటి వాటిని పట్టించుకునే వారే లేరన్న విమర్శలున్నాయి.
రక్షిత ప్రాంతాలుగా గుర్తించాలి..
ప్రపంచంలో అరుదుగానే ఈ కాలమ్నార్ బసాల్ట్ శిలలు ఉన్నాయి. పలు దేశాల్లో వీటిపై అధ్యయనాలు జరుగుతున్నాయి కూడా. తెలంగాణలో ఈ శిలలు కనిపించిన ప్రాంతాలను రక్షిత ప్రాంతాలుగా గుర్తించి భవిష్యత్తు ప్రయోగాలకు రక్షించుకోవాలి.
– చకిలం వేణుగోపాల్, జీఎస్‌ఐ విశ్రాంత అధికారి
ఔత్సాహికులే గుర్తించారు..
ఆదిలాబాద్ ప్రాంతంలో ఇప్పటివరకు వెలుగు చూసిన లావా శిలలను మన్నె ఆలియా, కటకం మురళి, వేణుగోపాల్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితర ఔత్సాహికులు గుర్తించారు. కొత్త తెలంగాణ చరిత్ర బృంద సభ్యు ల వల్లనే ఆ శిలలు బయటి ప్రపంచానికి తెలిసి వాటిపై స్థానికంగా కొంత అవగాహనకు వీలు కలిగింది. వాటి పుట్టుపూర్వోత్తరాలపై అధ్యయనం జరగాల్సిన అవసరం ఉంది.
– శ్రీరామోజు హరగోపాల్, చరిత్ర పరిశోధకులు
రాజమండ్రి సమీపంలో ఓ చిన్న భాగం..
తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లోని డీవీపీతో లింకు లేకుండా.. రాజమండ్రి సమీపంలో 25 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో లావా ఘనీభవించిన ప్రాంతముంది. కోస్తా ప్రాంతంలో ఈ చిన్న ముక్క తప్ప మరెక్కడా ఇలాంటిది లేదని నిపుణులు చెప్తున్నారు
Comments
Please login to add a commentAdd a comment