సాక్షి, హైదరాబాద్: రాడిసన్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాడిసన్ హోటల్‌లో పార్టీకి వెళ్లిన వారిలో డ్రగ్స్ ఆనవాళ్లను గుర్తించేందుకు తెలంగాణ పోలీసులు సరికొత్త ప్రయోగానికి ప్లాన్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా క్రోమోటోగ్రఫీ పరీక్ష చేసేందుకు రెడీ అయ్యారు పోలీసులు.
వివరాల ప్రకారం.. రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్ వాడిన వారిని గుర్తించేందుకు పోలీసులు క్రోమోటగ్రఫీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల కోసం పోలీసులు కూకట్‌పల్లి కోర్టు అనుమతి కోరారు. అయితే, కోర్టు అనుమతి ఇవ్వకపోవడంతో పోలీసులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు అనుమతిస్తే ఆరోజు రాడిసన్‌కు వెళ్లిన వారిలో డ్రగ్స్ ఎవరు తీసుకున్నారో గుర్తించే అవకాశం ఉంటుంది.
ఇక, ఫిబ్రవరి 24వ తేదీన రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్ పార్టీ జరిగింది. ఈ పార్టీకి మొత్తం 14 మంది హాజరైనట్టు పోలీసులు గుర్తించారు. కాగా, వీరికి డ్రగ్స్ టెస్టులు చేయగా కేవలం ముగ్గురికి మాత్రమే పాజిటివ్‌గా తేలింది. అయితే, వీరిలో సెలబెట్రీలు పార్టీ జరిగిన రోజు నుంచి ఎక్కువ సమయం తీసుకుని డ్రగ్స్ టెస్టు కోసం విచారణకు హాజరయ్యారు. దీంతో, వారి నమూనాలో డ్రగ్స్ ఆనవాళ్లు కనపించలేదు. ఈ నేపథ్యంలోనే రాడిసన్‌కి వచ్చిన వారిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. వారి శరీరాల్లో డ్రగ్స్‌ను గుర్తించేందుకు క్రోమోటోగ్రఫీ నిర్వహించాలని పోలీసులు ప్లాన్ చేశారు. ఇక, క్రోమోటోగ్రఫీ పరీక్షలు నిర్వహించడం తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటిసారి.
ఇదిలా ఉండగా.. రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీలో పాలు పంచుకున్న పది మంది వీఐపీలపై కేసు నమోదు అయ్యింది. ఈ మేరకు ఎఫ్‌ఐఆర్‌లో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఇద్దరు అమ్మాయిలతో పాటు మొత్తం 9 మందిపై కేసులు నమోదైంది. వ్యాపారవేత్తలు గజ్జల వివేకానంద్, అబ్బాస్, కేదార్, సందీప్‌లు.. సెల్రబిటీ శ్వేతతో పాటు లిశి, నీల్‌పైనా కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. అలాగే.. డ్రగ్స్ సేవించిన నిర్భయతో పాటు రఘు చరణ్‌పైనా పోలీసులు కేసు నమోదు చేశారు. అబ్బాస్ దగ్గర వివేకానంద డ్రగ్స్ కొనుగోలు చేసి.. తన స్నేహితులతో పార్టీ చేసుకున్నట్లు తేలింది. వీళ్లంతా కొకైన్ పేపర్‌లో చుట్టి డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొని ఉంది. అంతేకాదు.. ఈ డ్రగ్స్ పార్టీలో మరికొంత మంది ఉన్నట్లు గుర్తించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇక, ఈ కేసులో టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ కూడా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment