సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యలో పదోన్నతుల లెక్క తేలింది. మొత్తంగా 8,725 మందికి పదోన్నతులు కల్పించేందుకు అవకాశముందని విద్యాశాఖ నిర్ధారించింది. 2009లో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం యాజమాన్యాల వారీగా పదోన్నతులు కల్పించేందుకు చర్యలు చేపడుతోంది. అంతేకాదు హెడ్‌మాస్టర్ స్థాయి వరకే పదోన్నతులు ఇచ్చే అవకాశం ఉందని, ఎంఈవో, డిప్యూటీ ఈవో వంటి పోస్టుల్లో ప్రమోషన్లు ఇచ్చే అవకాశం లేదని పేర్కొంది. దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించింది. రాష్ట్రంలో విద్యాశాఖలో హెడ్‌మాస్టర్ కేటగిరీ వరకు 8,725 పోస్టుల్లో పదోన్నతులు కల్పించేందుకు అవకాశం ఉన్నట్లు విద్యాశాఖ చెబుతోంది.
సర్వీసు రూల్స్ సమస్య కారణంగా ఎంఈవో, డిప్యూటీ ఈవో, జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్), టీచర్ ఎడ్యుకేషన్ కాలేజీల్లో సీనియర్ లెక్చరర్ పోస్టుల్లో పదోన్నతులు కల్పించే అవకాశం లేదని స్పష్టం చేసింది. అర్హత కలిగిన సెకండరీ గ్రేడ్ టీచర్లకు (ఎస్‌జీటీ) స్కూల్ అసిస్టెంట్లుగా (ఎస్‌ఏ) పదోన్నతులు కల్పించేందుకు 6,627 ఎస్‌ఏ పోస్టులు అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించేందకు 1,771 హెడ్‌మాస్టర్ పోస్టులు ఉన్నట్లు వెల్లడించింది. మరోవైపు మోడల్ స్కూళ్లలోని పీజీటీలకు పదోన్నతులు కల్పించేందకు 67 ప్రిన్సిపాల్ పోస్టులు ఉన్నాయని, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లకు (టీజీటీ) పదోన్నతులు కల్పించేందుకు 260 పీజీటీ పోస్టులు ఉన్నట్లు వివరించింది. చదవండి: (తెలంగాణకు నలుగురు కొత్త ఐపీఎస్‌లు)
ఎలా చేయాలో చెప్పండి...
టీచర్ల పదోన్నతులకు ఆమోదం కోసం విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. అందులో యాజమాన్యాల వారీగా పదోన్నతులకు ఉన్న అవకాశాలు, అన్ని యాజమాన్యాలను కలిపి పదోన్నతులు కల్పించేందుకు ఉన్న అడ్డంకులను వివరించింది.
– ఏకీకృత సర్వీసు రూల్స్ ఇస్తూ ప్రభుత్వ, పంచాయతీరాజ్ టీచర్లను రాష్ట్రపతి ఉత్తర్వుల్లో చేర్చుతూ 2017 జూన్‌లో రాష్ట్రపతి ఆమోదంతో కేంద్రం సవరణ చేసింది. దానిపై కేంద్ర ప్రభుత్వం జీవో 637, 639పై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వ టీచర్ల సంఘం అదే ఏడాది ఆగస్టులో హైకోర్టును ఆశ్రయించింది. దీంతో హైకోర్టు రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణను నిలిపివేసింది. దీనిపై 2018లో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, 2019 ఫిబ్రవరి 4వ తేదీన సుప్రీంకోర్టు మధ్యంతర స్టే విధించింది.
– మరోవైపు 2018లో రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు మేరకు 31 జిల్లాలతో కొత్తజోన్లను ఏర్పాటు చేస్తూ రాష్ట్రపతి కొత్త ఉత్తర్వులను జారీ చేశారు. అందులోనూ ప్రభుత్వ, స్థానిక సంస్థల టీచర్ల సర్వీసును ఏకీకృతం చేశారు. అయితే దీనిపైనా ప్రభుత్వ టీచర్ల సంఘం 2019 జనవరిలో రిట్ పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు దానిపై తదుపరి చర్యలు చేపట్టవద్దని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో 2009లో జారీ చేసిన టీచర్ల సబార్డినేట్ సర్వీసు రూల్స్ (అడ్‌హక్) ఉత్తర్వులు (జీవోలు 9, 10, 11, 12) మాత్రమే అమల్లో ఉన్నాయని, వాటి ప్రకారం యాజమాన్యాల వారీగా పదోన్నతుల కల్పనకు చర్యలు చేపట్టవచ్చని పేర్కొంది. మరోవైపు సాధారణ పరిపాలన శాఖ 2019 జూలైలో జారీ చేసిన ఉద్యోగుల కేటాయింపు మార్గదర్శకాలు, ఆగస్టులో జారీ చేసిన పదోన్నతుల ఉత్తర్వుల (మెమో) ప్రకారం ఎలా ముందుకు సాగాలో తెలియజేయాలని, టీచర్ల పదోన్నతులను 33 జిల్లాల ప్రకారం చేపట్టాలా? పాత 10 జిల్లాల ప్రకారం చేపట్టాలా? చెప్పాలని ప్రభుత్వాన్ని కోరింది. అలాగే టీచర్ల బదిలీలకు అవసరమైన అనుమతి ఇవ్వాలని అడిగింది.
Comments
Please login to add a commentAdd a comment