ఆర్టీసీ సురక్ష ఆగింది | Telangana: Rs 5 Lakh Financial Aid For RTC Employees | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ సురక్ష ఆగింది

Published Tue, Sep 14 2021 4:38 AM | Last Updated on Tue, Sep 14 2021 4:38 AM

Telangana: Rs 5 Lakh Financial Aid For RTC Employees - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఇద్దరి మృతి మధ్య పక్షం రోజులే తేడా. కానీ ఒకరికి బీమా సాయం అందితే, మరొకరికి అందకపోవటానికి ఆర్టీసీ నిర్వాకమే ప్రధాన కారణం. నర్సయ్య కుటుంబానికే కాదు, పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇక ముందు కూడా ఉద్యోగులెవరైనా చనిపోతే ఆ కుటుంబాలకు బీమా సాయం అందే పరిస్థితి లేదు. రూ.5 లక్షల చేయూతనందించేలా రైతు బీమా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకం కంటే దాదాపు ఏడాది ముందుగానే ఆర్టీసీలో పథకం ప్రారంభమైంది.

ఇప్పటివరకు 1,100 ఆర్టీసీ కుటుంబాలకు అండగా నిలిచింది. ఇప్పుడా పథకం ఆగిపోయింది. దీనిపై ఉద్యోగులు, పథకం నిలిచిపోవడంతో సాయం అందకుండా పోయిన కుటుంబాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. 

అండగా నిలిచిన సురక్ష 
ఆర్టీసీ సహకార పరపతి సంఘం 2017లో సురక్ష పేరుతో బీమా పథకం అమలులోకి తెచ్చింది. ఆర్టీసీ ఉద్యోగుల జీతం నుంచి ప్రతినెలా 7% సంఘానికి జమ చేయటం ద్వారా సమకూరిన సీసీఎస్‌ నిధిని బ్యాంకులో డిపాజిట్‌ చేయటం ద్వారా వడ్డీ వచ్చేది.  ఆ క్రమంలోనే బీమా పథకాన్ని ప్రారంభించారు. ఒక్కో ఉద్యోగికి సాలీనా రూ.1,500 ప్రీమియం చెల్లిస్తే.. ఉద్యోగి చనిపోతే ఆ కుటుంబానికి బీమాసంస్థ రూ.5 లక్షలు చెల్లిస్తుంది. ఉద్యోగుల నుంచి పైసా వసూలు చేయకుండా ఈ పథకం ప్రారంభమైంది.

ఒప్పందం కుదుర్చుకున్న బీమా సంస్థకు ప్రీమియంగా రూ.7.5 కోట్లు చెల్లించగా.. ఆ ఏడాది 220 మంది ఉద్యోగులు చనిపోవటంతో సదరు సంస్థ ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున రూ.11 కోట్లు చెల్లించింది. ఇలా వేర్వేరు బీమా సంస్థలు 1,100 కుటుంబాలను ఆదుకున్నాయి. ఏటా జూన్‌ ఆఖరుతో బీమా ఒప్పందం ముగిసేది. గతేడాది వారం ఆలస్యంగా ఒప్పందం జరగటంతో, గత జూలై ఏడు వరకు పథకం కొనసాగింది.

కోవిడ్‌ వల్ల ఎక్కువమంది చనిపోగా రూ.2,750 ప్రీమియంతో ఒప్పందం కుదుర్చుకున్న బీమా సంస్థ జూలై ఏడు వరకు చనిపోయిన ఉద్యోగులకు సంబంధించి అన్ని కుటుంబాలకు ఆర్థిక సాయం అందించింది. 

సీసీఎస్‌ వద్ద నయాపైసా లేక.. 
జూలై ఏడుతో పథకం ముగిసిపోగా, అది కొనసాగేందుకు మరో సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవాలంటే సీసీఎస్‌ వద్ద నయా పైసా నిల్వ లేకుండా పోయింది. డబ్బులన్నీ ఆర్టీసీ వాడేసుకోవటమే దీనికి కారణం. రూ.1,000 కోట్లకు పైగా ఏర్పడ్డ బకాయిలను ఆర్టీసీ చెల్లించకపోగా ప్రతినెలా ఇచ్చే మొత్తాన్ని ఇవ్వటం మానేయటంతో సీసీఎస్‌ పూర్తిగా దివాలా తీసింది. దీంతో బీమా పథకం ప్రీమియాన్ని చెల్లించే పరిస్థితిలేకుండా పోయింది.

దీంతో ఏ కంపెనీతోనూ ఒప్పందం కుదుర్చుకోలేదు. దీంతో జూలై 8 నుంచి చనిపోయిన ఏడుగురు ఉద్యోగుల కుటుంబాలకు బీమా పథకం అందకుండా పోయింది. దీంతో తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.  

ఆర్టీసీ సహకరిస్తేనే.. 
బీమా ప్రీమియంకు కావల్సిన మొత్తాన్ని సీసీఎస్‌కు ఆర్టీసీ చెల్లిస్తే.. వేలాది మంది అల్పాదాయ కార్మికుల కుటుంబాలకు మళ్లీ బీమా సాయాన్ని పునరుద్ధరించే వీలుంది. లేదంటే ఉద్యోగులే ప్రతినెలా నిర్ధారిత మొత్తాన్ని ప్రీమియం కింద చెల్లించడం ద్వారా ఏర్పడే నిధి నుంచి ఈ సాయం అందేలా ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. దీనిపై ఆర్టీసీయే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. 

పునరుద్ధరిస్తాం 
సురక్ష మంచి పథకమని దీనిని పునరుద్ధరించేందుకు ప్రయత్నం చేస్తామని సీసీఎస్‌ కార్యదర్శి మహేష్‌ చెప్పారు. ఇప్పటికే చనిపోయిన కార్మికుల కుటుంబాలకు కూడా సాయం అందేలా చూస్తామని తెలిపారు.   

ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పీఎస్‌ నారాయణ. జనగామ బస్‌ డిపోలో కండక్టర్‌. కోవిడ్‌ బారిన పడి కోలుకున్నట్టే కోలుకుని ఆరోగ్యం విషమించి గత జూన్‌ 29న చనిపోయారు. ఆ కుటుంబానికి ఆయన సంపాదనే ఆధారం.

ఆర్టీసీ సహకార పరపతి సంఘం (సీసీఎస్‌)లో బీమా పథకం అమలులో ఉండటంతో వారికి రూ.5 లక్షల సాయం అందింది. ఆ మొత్తం ఆ కుటుంబానికి ఎంతో ఉపయుక్తంగా మారింది.  

ఈయన పేరు నర్సయ్య. గోదావరిఖని డిపోలో డ్రైవర్‌. గత జూలై 14న బస్సు నడుపుతుండగానే గుండెపోటుకు గురయ్యారు. బాధతో విలవిల్లాడుతూనే ప్రమాదం జరక్కుండా బస్సును క్షేమంగా నిలిపి ప్రాణాలు వదిలారు. ఆయనది నిరుపేద కుటుంబం.

కానీ ఇన్సూరెన్సు పథకం నుంచి నయాపైసా రాలేదు. దీంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement