ఆరడుగుల ఎర్రజెండా పాటల సీడీని ఆవిష్కరిస్తున్న డి. రాజా. చిత్రంలో చెరుపల్లి, అజీజ్ పాషా, నారాయణ, సురవరం, శ్రీనివాస్‌గౌడ్, చాడ, వినోద్‌కుమార్, చెరుకు సుధాకర్, జాజుల తదితరులు
సాక్షి, హైదరాబాద్: బీజేపీపై తెలంగాణ సీఎం కేసీఆర్ గట్టిగా గళం విప్పారని.. ఈ దూకుడు ఇంకా పెంచాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్య దర్శి డి.రాజా అన్నారు. స్వాతంత్య్ర సమర యోధులు బొమ్మగాని ధర్మభిక్షం శతజయంతి ఉత్సవాల ముగింపు సభ హైదరాబాద్ రవీంద్ర భారతిలో మంగళవారం జరిగింది.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభకు డి.రాజా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల హక్కుల కోసం నిరంతరం పరితపించి పోరాడిన ధర్మభిక్షం గొప్ప కమ్యూనిస్టు అని కొనియా డారు. ధర్మభిక్షం ఉద్యమ అనుభవాల నుంచి అనేక విషయాలు నేర్చుకున్నానని తెలిపారు.
రాష్ట్రాల హక్కుల్ని కేంద్రం హరిస్తోంది
‘భారతదేశం రాష్ట్రాల కూటమి అనే విషయాన్ని గుర్తించేందుకు మోదీ సిద్ధంగా లేరు. రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోంది. ఇది ప్రమాదకర మైన చర్య. మోదీని నిలదీస్తూ తమిళనాడు, పశ్చిమబెంగాల్, తెలంగాణ సీఎంలు స్టాలిన్, మమతా బెనర్జీ, కేసీఆర్ ముందుకు వస్తున్నారు. దేశాన్ని నాశనం చేస్తున్న మోదీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి.
దేశ సంపదను అంబానీ, అదానీ, టాటాలకు మోదీ కట్టబెడుతున్నారు. ప్రజాతంత్ర, లౌకిక పార్టీలన్నీ కలిసి పోరాడాలి..’ అని రాజా పిలుపునిచ్చారు. సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ధర్మభిక్షం ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని అన్నారు.
ప్రభుత్వ పథకానికి ధర్మభిక్షం పేరు
ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ఏదో ఒక పథకానికి ధర్మభిక్షం నామకరణం చేస్తామని రాష్ట్ర మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ ప్రకటించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేశారని కొనియాడారు. ఎన్నడూ స్వార్థం కోసం ఆలోచిం చకుండా నిజమైన కమ్యూనిస్టుగా జీవించిన నాయకుల్లో ధర్మభిక్షం ఒకరని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. బొమ్మగాని ధర్మభిక్షం జీవిత చరిత్రను మోడల్ సైన్స్ పాఠ్యాంశంలో పొందుపర్చాల్సిందిగా ప్రణాళిక సంఘం తరఫున ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్ కమిటీకి లేఖ రాస్తానని తెలిపారు. సూర్యాపేట జిల్లాకు ధర్మభిక్షం పేరు పెట్టాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. ధర్మభిక్షం పేరుతో ప్రతిఏటా అవార్డులు ఇవ్వాలన్నారు.
సమరయోధులకు సన్మానం
అలనాటి తెలంగాణ సాయుధ పోరాటంలో ధర్మభిక్షం సహచరులుగా ఉన్న గుంటకండ్ల పిచ్చి రెడ్డి, దొడ్డా నారాయణ, తోడేటి కొమురయ్య, కందిమళ్ల ప్రతాప్‌లను డి.రాజా శాలువా, జ్ఞాపికతో సన్మానించారు. తెలుగు విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ ఎస్వీ సత్యనారాయణ, హైకోర్టు న్యాయవాది బొమ్మగాని ప్రభాకర్ సంయుక్తంగా రచించిన బొమ్మగాని ధర్మభిక్షం జీవిత చరిత్ర ‘ప్రజల మనిషి’ పుస్తకాన్ని బోయినపల్లి వినోద్ ఆవిష్కరించారు.
ధర్మభిక్షం జీవితంపై ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ రచించిన పాటల ఆడియో సీడీని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. బొమ్మగాని నాగభూషణం రచించిన ‘ఉద్యమ సంతకం’ కవితా సంపుటిని సురవరం సుధాకర్ రెడ్డి విడుదల చేశారు. ఈ సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, ఏపీ సీపీఐ కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, ధర్మభిక్షం శతజయంతి నిర్వహణ కమిటీ ప్రధాన కార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్, తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) నేత కె.శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment