సాక్షి, హైదరాబాద్: విజయ్ కథానాయకుడిగా వచ్చిన సర్కార్ సినిమా గుర్తుందా..? అందులో ఎన్నారై, బడా వ్యాపారవేత్త అయిన కథానాయకుడు తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇక్కడికి వస్తాడు. అప్పటికే ఆ ఓటు ఎవరో వేసేశారని తెలుసుకుని న్యాయపోరాటం చేస్తాడు. దాదాపు ఇలాంటి ఉదంతమే నగరంలో చోటు చేసుకుంది. సినిమాలో ఓటు అంశం సాధారణ ఎన్నికలకు సంబంధించినదైతే... ఇక్కడ మాత్రం ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఎల్రక్టానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీర్స్ గవర్నింగ్ కౌన్సిల్‌ది.
సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల కథనం ప్రకారం... ఖైరతాబాద్‌లోని ది ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా) తెలంగాణ స్టేట్ సెంటర్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న బి.బ్రహ్మరెడ్డి న్యూఢిల్లీలోని ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీర్స్‌కు (ఐఈటీఈ) కార్పొరేట్ మెంబర్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ సంస్థ గవర్నింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో ఈయనకు ఓటుహక్కు ఉంది. దీనికి సంబంధించిన ఎన్నికలు ఈ ఏడాది జూన్‌లో జరిగాయి. ఆ నెల 30వ తేదీ రాత్రి 11.59 నిమిషాల వరకు ఆన్‌లైన్‌లో ఓటు వేసుకునేందుకు అర్హులకు అవకాశం ఇచ్చారు.
ఈ ఆన్‌లైన్ ఓటింగ్ కోసం అర్హులైన ఐఈటీఈ ఓటర్లు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ లేదా ఫోన్‌కు వచ్చే ఓటీపీ సహాయంతో అధికారిక వెబ్‌సైట్‌లోని ఎంటర్ కావాల్సి ఉంటుంది. ఆపై అక్కడ ఉన్న ఆప్షన్స్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఐఈటీఈ ఓటర్లు అంతా ఇలానే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బ్రహ్మారెడ్డి జూన్ 30 మధ్యాహ్నం 2.10 గంటలకు ఓటు వేయడం కోసం అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయ్యారు. అయితే అప్పటికే ఈ ఓటు వేరే వాళ్లు వేసినట్లు అందులో కనిపించింది.
తన ఈ–మెయిల్ ఐడీ, యూజర్ ఐడీ తదతరాలను హ్యాక్ చేసిన దుండగులు ఇలా చేశారని ఆయన అనుమానించారు. దీంతో ఇటీవల సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా కేసు నమోదు చేసుకున్న అధికారులు సాంకేతిక దర్యాప్తు చేపట్టారు. ఆన్‌లైన్ ఓటింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అందించాల్సిందిగా కోరుతూ ఐఈటీఈకి లేఖ రాశారు. ఆ ఎన్నికల్లో మహారాష్ట్రకు చెందిన వాళ్లు గెలిచారని, తన ఓటు కూడా ఆ రాష్ట్రంలోని అమరావతి నుంచే వేసినట్లు తెలుస్తోందని బ్రహ్మరెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ అంశాన్ని సైతం పరిగణలోకి తీసుకున్న సైబర్ క్రైమ్ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు.
(చదవండి: వచ్చేస్తున్నాయ్ వందేభారత్ రైళ్లు)
Comments
Please login to add a commentAdd a comment