సాక్షి, హైదరాబాద్: గతేడాది నవంబర్ ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలిసారి ఆ నెలలో పన్నుల ఆదాయం రూ. 10 వేల కోట్లు దాటింది. 2021–22 ఆర్థిక సంవత్సరానికిగాను నవంబర్‌లో మొత్తం పన్నుల ఆదాయం రూ. 10,659 కోట్లు వచ్చింది. సాధారణంగా పన్ను ఆదాయం ఆర్థిక సంవత్సరం చివరి మాసమైన మార్చిలో పన్నుల ఆదాయం రూ. 10 వేల కోట్లు దాటుతుంది. ఆర్థిక వనరులున్న అన్ని శాఖల అధికారుల నుంచి సిబ్బంది వరకు పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా ఆ మేరకు పన్ను రాబడి ఉంటుంది.
ఈ ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఏడాది మధ్యలోనే (8వ నెలలో) పన్నుల ఆదాయం రూ. 10 వేల కోట్లు దాటడం గమనార్హం. ఇందులో వస్తుసేవల పన్ను (జీఎస్టీ) రూపంలో రూ. 3 వేల కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 1,130 కోట్లు, అమ్మకపు పన్ను ద్వారా రూ. 2,100 కోట్లు, ఎక్సైజ్ ద్వారా రూ. 2,500 కోట్లు వచ్చాయి.
థర్డ్ క్వార్టర్... థండర్
ఈ ఏడాది మూడో త్రైమాసికంలో పన్ను రాబడులు భారీగానే వస్తున్నాయని కాగ్ లెక్కలు చెబుతున్నాయి. అక్టోబర్‌లో వచ్చిన రూ. 8,338.93 కోట్లు కలిపి మూడో త్రైమాసికం రెండు నెలల్లోనే పన్ను ఆదాయం రూ. 19 వేల కోట్లకు చేరింది.
2021–22 ఆర్థిక సంవత్సరంలో పన్నుల ఆదాయం కింద రూ. రూ. 1,06,900 కోట్లు వస్తుందని ప్రభుత్వం అంచనా వేయగా అందులో నవంబర్ నాటికి రూ. 64,857.95 కోట్లు (60.67 శాతం) పన్ను వసూలైంది. అదే 2020–21 ఆర్థిక సంవత్సర బడ్జెట్ అంచనాల్లో ఇదే సమయానికి కేవలం 44 శాతమే పన్ను ఆదాయం వచ్చింది. తొలి ఎనిమిది నెలల్లో వచ్చిన రూ. 64 వేల కోట్ల ఆదాయంలో కేవలం అమ్మకపు పన్ను, ఎక్సైజ్ శాఖల ద్వారానే రూ. 28 వేల కోట్ల వరకు సమకూరడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment