
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు (ఎత్తిపోతల పథకాలు), ఇంజనీర్ పెంటారెడ్డిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు పీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి బేషరతు క్షమాపణలు చెప్పాలని తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాశ్, రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.దామోదర్‌రెడ్డి, ఎం.శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి సోమవారం వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు.
అంచనాలకు మించి వరద వచ్చినప్పుడు ఎత్తిపోతల పథకాల పంపులు మునగడం సహజమేనన్నారు. గతంలో శ్రీశైలం, కల్వకుర్తిలో పంపులు మునిగిన విషయాన్ని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బాహుబలి లాంటి పంపులను తయారు చేయించడంలో ముఖ్యపాత్ర పోషించిన పెంటారెడ్డిని ఉద్దేశించి రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అన్నారం, మేడిగడ్డ పంపులు నీట మునగడంతో వేల కోట్ల నష్టమేమీ జరగలేదన్నారు. నీళ్లు తగ్గిన తర్వాత మళ్లీ బురదని తొలగించి సర్వీసు చేస్తే పంపులు నడుస్తాయని తెలిపారు.