హనీట్రాప్ (వలపు వల). ఎదుటివారిని తమ వైపు ఆకర్షింపజేసుకుని, తమకు కావాల్సిన పని చేయించుకునేందుకు యువతులు/యువతుల పేరిట కేటుగాళ్లు వాడుతున్న అస్త్రం. గతంలో దేశ సరిహద్దుల రక్షణలో ఉండే కీలక అధికారులను లొంగ తీసుకునేందుకు శత్రుదేశాల గూఢచారులు ఈ విధమైన వల విసిరేవారు. ఇప్పుడిది అన్నిరకాల పనులకూ విస్తరిస్తోంది.
తాజాగా టీఎస్‌పీఎస్సీ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పేపర్ లీకేజీ ఉదంతంలో కూడా ఇదే తరహాలో టీఎస్‌పీఎస్సీ సిబ్బందిని ట్రాప్ చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఈ విధమైన వలపు వలలను ముందుగానే గుర్తించవచ్చని, తగిన జాగ్రత్తలు పాటిస్తే చిక్కుల్లో పడకుండా తప్పించుకోవచ్చని సైబర్ భద్రత నిపుణులు చెబుతున్నారు. నిత్యం సోషల్ మీడియా అకౌంట్లు వాడుతున్న ప్రతి ఒక్కరూ సోషల్ ప్రొఫైలింగ్‌కు గురికాకుండా జాగ్రత్త పడాలని హెచ్చరిస్తున్నారు.
ఇటీవల జరిగిన కొన్ని హనీ ట్రాప్‌లు
భారతీయురాలి పేరిట పాక్ నుంచి వాడుతున్న ఓ ఫేస్‌బుక్ అకౌంట్‌తో.. సరిహద్దుల్లో సున్నితమైన ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న భారత సైన్యంలోని 60 మంది జవాన్లు టచ్‌లో ఉన్నట్టు మిలటరీ ఇంటెలిజెన్స్ గుర్తించింది.
పాకిస్తాన్ ఐఎస్‌ఐ ఏజెంట్ల హనీ ట్రాప్‌లో చిక్కుకుని క్షిపణుల తయారీకి సంబంధించిన కీలక సమాచారాన్ని చేరవేశాడన్న ఆరోపణలపై డీఆర్‌డీఎల్ కాంట్రాక్టు ఉద్యోగి దుక్క మల్లికార్జున్‌రెడ్డిని 2022 జూన్‌లో రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు.
పాకిస్తాన్ ఏజెంట్ల హనీ ట్రాప్‌లో చిక్కి భారత నౌకాదళ సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేస్తున్న 13 మంది ఇండియన్ నేవీ అధికారులను ఏపీ ఇంటెలిజెన్స్, నేవీ ఇంటెలిజెన్స్ అధికారులు సంయుక్త ఆపరేషన్‌లో పట్టుకున్నారు. వీరందరినీ అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
హనీ ట్రాప్‌లు.. ఎన్నో రకాలు
సోషల్ మీడియా ఆధారిత ట్రాప్‌లు: అందమైన యువతుల ఫొటోలు, పేర్లతో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి వాటిని సోషల్ మీడియా ఖాతాల్లో ఉంచడం ద్వారా పలువురిని ట్రాప్ చేస్తున్నారు.
ఆన్‌లైన్ వీఓఐపీ కాల్స్ (ఇంటర్నెట్ కాల్స్)తో వల: వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ (వీఓఐపీ) టెక్నాలజీ ఆధారిత కాల్స్ చేసి హనీ ట్రాప్‌కు పాల్పడతారు. తర్వాత వాట్సాప్, ఇతర యాప్స్ ద్వారా వ్యక్తిగత, వృత్తిపరమైన సమాచారం
సేకరిస్తారు.
ఇన్‌స్టంట్ మెసేజ్ ప్లాట్‌ఫాంల ద్వారా: ఆన్‌లైన్‌లో రియల్ టైం టెక్ట్స్ చాటింగ్ యాప్‌ల ద్వారా మెసేజ్‌లు పెడుతూ పరిచయం పెంచుకుని సైబర్ నేరగాళ్లు వలపు వలలోకి దించుతారు.
అశ్లీల వెబ్‌సైట్‌ల ఆధారిత హనీ ట్రాప్‌లు: అశ్లీల వెబ్‌సైట్లు, అశ్లీల వీడియోలు, ఫొటోల లింక్‌లు పంపి, వాటి ద్వారా ఎదుటి వారిని లోబరుచుకుంటారు.
ఈ మెయిల్‌లో లింక్‌ల ద్వారా..: ఈ మెయిల్స్‌లో లింక్‌లు పంపుతారు. క్రమంగా పరిచయం పెంచుకుని కావాల్సిన కీలక సమాచారాన్ని సేకరిస్తారు.
డేటింగ్ యాప్‌లతో: డేటింగ్ యాప్‌లలో నగ్న వీడియో కాల్స్, ఫొటోలు పంపి ఆకర్షిస్తారు. ఎదుటి వారి నగ్న వీడియోలు, ఫొటోలు సేకరించి ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
♦ అపరిచితుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు అంగీకరించవద్దు.
♦ పనిచేసే కార్యాలయం వివరాలు, వృత్తి పరమైన అంశాలు సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకోవద్దు.
♦ మిలటరీ, పోలీస్, ఇతర కీలక ఉద్యోగాల్లో ఉండేవారు వారి వృత్తిపరమైన సమాచారం, ఫొటోలు సోషల్ మీడియా ఖాతాల్లో పెట్టకపోవడమే ఉత్తమం.
♦ సోషల్ మీడియా ఖాతాల్లో వచ్చే పోర్న్ వీడియో లింకులను ఓపెన్ చేయవద్దు.
సోషల్ ప్రొఫైలింగ్ అంటే ఏమిటి?
సైబర్ నేరగాళ్లు, తమకు అనుకూలంగా ఇతరులను మార్చుకోవాలనుకునే వారు సోషల్ ఫ్రొఫైలింగ్ ద్వారా టార్గెట్స్‌ను ఎంచుకుంటున్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ఖాతాలను విరివిగా వాడేవారికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు, కుటుంబ, వృత్తి సంబంధిత వివరాలను వీరు సేకరిస్తారు. వాటి ద్వారా ఎదుటివారి బలహీనతలపై ఒక అంచనాకు వస్తారు. దాని ఆధారంగా వలపు వలలోకి లాగుతారు.
అలా అడిగితే అనుమానించాల్సిందే
హనీ ట్రాప్‌ల ముప్పు పెరుగుతోంది. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు అంగీకరించవద్దు. మన వ్యక్తిగత, వృత్తిపరమైన సున్నిత సమాచారం అడుగుతున్నారంటే అనుమానించాలి. వెంటనే అలాంటి సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేయాలి. వారిని అన్‌ఫ్రెండ్ చేయాలి. అవసరమైతే పోలీసుల్ని సంప్రదించాలి.
– పాటిబండ్ల ప్రసాద్, సైబర్ ఇంటెలిజెన్స్ నిపుణుడు, ఢిల్లీ
Comments
Please login to add a commentAdd a comment