
సాక్షి, హసన్‌పర్తి: వరంగల్ అర్బన్ జిల్లా హసన్‌పర్తి మండలం సీతంపేటలో ఓ జంతువు కనిపించడంతో భయాందోళనకు గురైన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు ఆదివారం గ్రామాన్ని సందర్శించి ఆ జంతువు పాద ముద్రలను పరిశీలించి పెద్ద పులివి కావని చెప్పారు. అయితే చిరుత పిల్ల, జంగపిల్లి జాతికి చెందిన లిపోడి క్యాట్‌గా అనుమానిస్తున్నారు. గ్రామ పంచాయతీ నర్సరీ నిర్వాహకుడు గుర్రాల చంద్రమౌళికి శనివారం సాయంత్రం పరిసరాల్లో ఓ జంతువు కనిపించింది. ముందుగా ఏదో జంతువుగా భావించాడు. అయితే అరగంట వరకు అది పొలం వద్దే ఉండడంతో కర్ర తీసుకుని వెళ్లేగొట్టే ప్రయత్నం చేశాడు. అయితే ఆ జంతువు పులిలా శబ్దం చేయడంతో కొంత వెనక్కి తగ్గాడు. ఆ తర్వాత జంతువు ముందుకు పరుగెత్తుతుండగా పులిలా కనిపించిందని చెప్పాడు.
ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో భయాందోళనకు గురై ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా ఎల్కతుర్తి ఫారెస్ట్ రేంజర్ సందీప్, సెక్షన్ ఆఫీసర్లు హుస్సేన్, రమేష్, ముజీబ్ అక్కడి చేరుకున్నారు. ఆ జంతువు సంచరిస్తున్న సమయంలో తీసిన వీడియో క్లిపింగ్‌లు, పాద ముద్రలను పరిశీలించారు. ఇక్కడి వచ్చింది పెద్ద పులి మాత్రం కాదని, చిరుతపులి పిల్ల, లిపోడి క్యాట్‌గా అనుమానం వ్యక్తం చేశారు. ఒకవేళ చిరుత పిల్ల పరిసర ప్రాంతాల్లో ఉండవచ్చని, లేదంటే తిమ్మాపురం, గంటూరుపల్లి వైపునకు వెళ్లే అవకాశాలున్నాయని స్థానికులు అనుమానిస్తున్నారు. వేటకు వెళ్లొద్దని హెచ్చరిక జంతువులను పట్టుకోవడానికి స్థానికులు ఎవరూ వేటకు వెళ్లొద్దని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు. ఒక వేళ ఆకస్మాత్తుగా చిరుత పిల్లను వేటాడినట్లయితే కేసులు నమోదు చేస్తామని ఫారెస్ట్ రేంజర్ సందీప్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment