పోలీస్ కస్టడీలో నిందితుడు నందుకుమార్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడు కొర్రె నందుకుమార్ పోలీస్ విచారణలో పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలిసింది. రెండు రోజుల పోలీస్ కస్టడీ ముగియడంతో పోలీసులు అతడిని మంగళవారం తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. సినీ నటుడు దగ్గుబాటి వెంకటేష్, నిర్మాత దగ్గుబాటి సురేష్‌లకు చెందిన ప్లాట్లను లీజు పేరుతో తీసుకొని దుర్వినియోగం చేసిన కేసులో నందుకుమార్ నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు బంజారాహిల్స్ పోలీసులు రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు.
ఇందులోభాగంగా పోలీసులు మంగళవారం నందుకు 22 ప్రశ్నలు సంధించారు. తొలుత మీ సొంతూరు ఏది అని ప్రశ్నించగా పరిగి, ఎల్బీనగర్, చైతన్యపురి అని నిర్లక్ష్యంగా చెప్పినట్లుగా తెలిసింది. నీ వృత్తి ఏంటన్న ప్రశ్నకు.. హోటల్ బిజినెస్ అని చెప్పినట్లు సమాచారం. మొదటగా అంబర్‌పేట్‌లో సీజన్ పేరుతో హోటల్ నడిపినట్లు చెప్పారు. ఫిలింనగర్‌లో డెక్కన్ కిచెన్ హోటల్ ఎలా వచ్చిందని ప్రశ్నించగా 2016 డిసెంబర్‌లో డబ్లూ3 పేరుతో హోటల్ లీజుకు తీసుకున్నానని, అనంతరం దక్కన్ కిచెన్‌గా మార్చానని బదులిచ్చారు. డెక్కన్ హోటల్‌కు ఎవరెవరు వచ్చే వారు? సదరు ఎమ్మెల్యేలు ఎలా తెలుసు? రామచంద్ర మూర్తితో పరిచయం ఎలా జరిగింది అని ఆరా తీసినట్లు సమాచారం.
డబ్లూ 3 హాస్పిటాలిటీకి ప్రమోద్ కుమార్ రాజీనామా చేయగానే తాను ఎండీగా కొనసాగినట్లు చెప్పారని తెలిసింది. అభిషేక్‌కూడా 2017లోనే డైరెక్టర్‌గా తప్పుకున్నారన్నారు. దక్కన్ కిచెన్ పేరుతో 6 లక్షలు వసూలు చేసినప్పుడు ఏదైనా డాక్యుమెంటేషన్ ఉందా అని ప్రశ్నించగా అలాంటిదేమి లేదని తెలిపారు. ఈ ప్రాపర్టీని ఎందుకు తీసుకున్నావన్న ప్రశ్నకు.. వ్యాపారనిమిత్తం తీసుకున్నట్లు చెప్పారు. ఏ వ్యాపారం కోసం తీసుకున్నారన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఐస్‌క్రీం షాపులు, మిల్క్‌షేక్ కౌంటర్లు ఏర్పాటు చేశానన్నారు.
దక్కన్ కిచెన్ ప్రొప్రైటర్లు ఎలా పరిచయం అని ప్రశ్నించగా వారే తనను సంప్రదించారని చెప్పినట్లు తెలిసింది. కామన్ ఫ్రెండ్ సురేష్‌రెడ్డి ద్వారా ప్రమోద్ కుమార్ పరిచయమైనట్లు చెప్పారు. ఈ హోటల్ ద్వారా పది శాతం రెవెన్యూ వాటా పొందుతున్నానని, ప్రస్తుతం డైరెక్టర్లుగా కల్వకుంట్ల తేజేశ్వర్ రావు అలియాస్ కన్నారావు, ఆవుల అభిషేక్ ఉన్నారని తెలిపినట్లు సమాచారం.
చదవండి: ఎమ్మెల్యేలకు ఎర కేసులో మరో కీలక పరిణామం
Comments
Please login to add a commentAdd a comment