సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్లపై టీఆర్‌ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి అసహనం వ్యక్తం చేశారు. ‘‘మేం నేర్పిన చదువు ఇదేనా’’ అంటూ మండిపడ్డారు. పట్టభద్రులు కూడా ఓటు సరిగా వేయకపోవడం దురదృష్టకరమన్నారు. సరూర్‌నగర్‌లో కౌంటింగ్ కేంద్రం వద్దకు వచ్చిన సురభి వాణిదేవి మాట్లాడుతూ.. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగుతోందని, గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు. కాగా మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి సురభి వాణి దేవి పోటీ చేసిన విషయం తెలిసిందే. దివంగత ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె అయిన ఆమె విద్యావేత్తగా పేరొందారు.
ఇక ఈ నెల 14న జరిగిన రంగారెడ్డి–మహబూబ్‌నగర్– హైదరాబాద్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలో ఈసారి 67 % పోలింగ్ నమోదైన విషయం తెలిసిందే. నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన ఓట్లను సరూర్‌నగర్‌లోని ఇండోర్‌స్టేడియంలో లెక్కిస్తున్నారు. భారీ సంఖ్యలో 93 మంది అభ్యర్థులు బరిలో ఉండటమే కాక, గతంలో కంటే ఓటర్లు..పోలింగ్ శాతం కూడా భారీగా పెరిగినందున కౌంటింగ్‌కు చాలా సమయం పడుతోంది. కాగా 2015లో జరిగిన ఇదే నియోజకవర్గ ఎన్నికల్లో అభ్యర్థులు 31 మందితోపాటు నోటా ఉంది.
అయితే, ప్రస్తుతం నోటా లేదు. ఓట్ల లెక్కింపు ప్రాధాన్యత క్రమంలో జరగనున్నందున మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఎవరికీ కోటా ( చెల్లుబాటయ్యే మొత్తం ఓట్లలో సగం కంటే ఒక ఓటు ఎక్కువ) ఓట్లు రాకుంటే, కోటా ఓట్లు వచ్చేంత వరకు తర్వాతి ప్రాధాన్యత ఓట్లను పరిగణనలోకి తీసుకుంటారు. తాజా సమాచారం ప్రకారం, ఏడో రౌండ్ పూర్తయ్యేసరికి వాణీదేవి(టీఆర్‌ఎస్)కి 1,12,689 ఓట్లు పొందినట్లు తెలుస్తోంది. మరోవైపు నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment