సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల గరిష్ట వినియోగం లక్ష్యంగా చేపట్టనున్న కొత్త ప్రాజెక్టుల సర్వే పనులను జాతీయ సర్వే సంస్థ అయిన వ్యాప్కోస్‌తో చేయించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. కొత్త ప్రాజెక్టుల అంశం అంతర్రాష్ట్ర అంశాలతో ముడిపడి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. వ్యాప్కోస్ గతంలో కాళేశ్వరం, సీతారామ, తుపాకులగూడెం, డిండి ఎత్తిపోతల వంటి ప్రాజెక్టులకు లైడార్ సర్వే చేయడంతో పాటు డీపీఆర్‌లు తయారు చేసింది. వ్యాప్కోస్ ఇచ్చిన నివేదికల ఆధారంగానే ప్రస్తుతం అన్ని ప్రాజెక్టుల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
మళ్లీ అదే రీతిన జూరాల దిగువన 35 నుంచి 40 టీఎంసీల సామర్థ్యంలో చేపట్టనున్న జోగుళాంబ బ్యారేజీ సహా భీమా వరద కాలువ, పులిచింతల ఫోర్‌షోర్‌లో చేపట్టే ఎత్తిపోతల, నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్‌లో చేపట్టే ఎత్తిపోతల పథకాల సర్వే పనులను వ్యాప్కోస్‌కు అప్పగించే అంశంలో ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది. కాగా, వ్యాప్కోస్ సైతం ఈ సర్వే పనులను తమకు నామినేషన్ విధానం ద్వారా అప్పగించాలని ఇరిగేషన్ శాఖకు శుక్రవారం లేఖ రాసింది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
జూరాలకు భారీ వరద
42,200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
ధరూరు: జూరాల ప్రాజెక్టులో భారీగా వరద వస్తోంది. గంటగంటకూ ఇన్‌ఫ్లో పెరుగుతోంది. శుక్రవారం రాత్రి 10 గంటలకు 42,200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. విద్యుదుత్పత్తి, ఎత్తిపోతలతో 22,165 క్యూసెక్కులు వదులుతున్నారు. ఎగువన కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టుకు 34,685 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 28,783 క్యూసెక్కులు వదులుతున్నా రు. ఆ ప్రాజెక్టు పూర్తిమట్టం 129.72 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 92.73 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 37.64 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 24.45 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment