సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రి ఆవరణలో హెరిటేజ్ భవనాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే వాటి వివరాలను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఉస్మానియా ఆసుపత్రిలోని పాత భవనం ప్రమాదకరంగా ఉందని, దాన్ని కూల్చి నూతన భవనాన్ని నిర్మించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. పాత భవనాన్ని వెంటనే ఖాళీ చేసి రోగులను నూతన భవనంలోకి మార్చాలని ప్రభుత్వం ఆదేశించిందని, ఈ మేరకు జారీ చేసిన మెమోను ధర్మాసనానికి ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్ సమర్పించారు.
కొన్ని భవనాలు మాత్రమే హెరిటేజ్ భవనాల కేటగిరీ కిందకి వస్తాయని వాటిని వదిలేసి గతేడాది ఆగస్టు నుంచి ఇతర భవనాలకు మరమ్మతులు (రెనోవేషన్) చేస్తున్నామని తెలిపారు. 2019 జూలైలో ఉస్మానియా ఆసుపత్రిని ప్రత్యేక బృందం సందర్శించి నివేదిక ఇచ్చిందని, దాన్ని ధర్మాసనం పరిశీలన కోసం సమర్పించామని వెల్లడించారు. ‘హెరిటేజ్ భవనం కూల్చరాదని ఒకరు, ప్రమాదకరంగా ఉన్న ఈ భవనాన్ని కూల్చి నూతన భవనాన్ని నిర్మించాలని మరొకరు పిటిషన్ దాఖలు చేశారు. హెరిటేజ్ భవనమా.. కాదా? ఎంత భాగం హెరిటేజ్ కేటగిరీ కిందకు వస్తుంది? ఇవేవీ తెలియజేయకుండా నిర్మాణాలు చేపట్టడం సరికాదు. ఈ రెండు పిటిషన్లను కలిపి విచారిస్తాం. ప్రస్తుతం అక్కడ చేపడుతున్న నిర్మాణాలకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించండి’ అని ధర్మాసనం ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment