ఉభయ సభల్లో ఎలా ఉండాలి
ఎంసీహెచ్‌ఆర్‌డీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నేటి నుంచి రెండురోజుల పాటు అవగాహన కార్యక్రమాలు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఈ నెల 11, 12 తేదీల్లో రెండురోజులపాటు అవగాహన కల్పించే కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో బుధ, గురువారాల్లో జరిగే ఈ అవగాహన కార్యక్రమ ఏర్పాట్లను స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహాచార్యులు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను ఎంసీహెచ్‌ఆర్‌డీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశాంక్ గోయల్ వివరించారు.
» తొలిరోజు బుధవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే అవగాహన కార్యక్రమంలో ‘ప్రభావంతమైన శాసనసభ్యులుగా ఉండటం ఎలా’అనే అంశంపై చక్షురాయ్, ‘ప్రజాప్రతినిధులు–గౌరవ మర్యాదలు, ప్రొటోకాల్, పాలనలో వారి పాత్ర’అనే అంశంపై పీడీటీ ఆచారి ప్రసంగిస్తారు.
» మధ్యాహ్నం సెషన్‌లో ‘ప్రశ్నోత్తరాలు, జీరో అవర్, తీర్మానాలు, వాయిదా తీర్మానాలు, ప్రత్యేక ప్రస్తావనలు, అత్యవసర అంశాలు’తదితరాలపై చక్షురాయ్ ప్రసంగిస్తారు.
» రెండోరోజు గురువారం జరిగే ప్రారంభ సెషన్‌లో ‘బిల్లుల ప్రస్తావన.. వాటిని పరిగణనలోకి తీసుకోవడం, పాస్ చేయడం’, ‘రాష్ట బడ్జెట్‌ను అవగాహన చేసుకోవడం’పై తుషార్ చక్రవర్తి ప్రసంగిస్తారు.
» భోజన విరామం అనంతరం జరిగే సెషన్‌లో ‘రాష్ట్ర లెజిస్లేచర్ కమిటీలను బలోపేతం చేయడం’పై పీడీటీ ఆచారి ప్రసంగిస్తారు. అనంతరం జరిగే ముగింపు కార్యక్రమంలో స్పీకర్, మండలి చైర్మన్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొంటారు
ఓరియెంటేషన్‌ను బహిష్కరిస్తున్నాం: కేటీఆర్
రెండు రోజులపాటు జరిగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అవగాహన కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘శాసనసభ ప్రారంభానికి ముందే మా హక్కులకు భంగం కలిగేలా స్పీకర్ వ్యవహరించారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాసమస్యలను ఎత్తిచూపేందుకు నిరసన తెలిపితే అరెస్టు చేశారు. మా పార్టీ శాసనసభ్యుల అక్రమ పార్టీ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ నాని్చవేత ధోరణి అవలంబిస్తున్నారు. గత శాసనసభ సమావేశాల్లోనూ మా పార్టీ సభ్యుల గొంతు నొక్కేలా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరించారు.
బీఆర్‌ఎస్ పార్టీ శాసనసభ్యుల్లో అతి తక్కువమంది మాత్రమే కొత్త శాసనసభ్యులు ఉన్నారు. ఇప్పటికైనా స్పీకర్ పార్టీలకతీతంగా ఎలాంటి వివక్ష లేకుండా వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం’అని కేటీఆర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment