ఇంకా పెరగాలి ఓటు ధర! Vote price should increase | Sakshi
Sakshi News home page

ఇంకా పెరగాలి ఓటు ధర!

Published Tue, Oct 17 2023 3:41 AM

Vote price should increase - Sakshi

ఓ జర్నలిస్టు... ఓ (అ)సామాన్య ఓటరును ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఓటును నోటుకూ, ఓ రేటుకూ అమ్ముకుంటున్నారనీ, ఈ పద్ధతి తప్పు అని తెలియజెప్పాలని సదరు జర్నలిస్టు ఉద్దేశం. అదే విషయాన్ని అతణ్ణి అడిగాడు.  ‘‘సార్‌... పేపర్లలో టీవీల్లో... మీరే దాన్ని ‘విలువైన ఓటు’, ‘విలువైన ఓటు’ అంటుంటారా, లేదా? మరి అంత విలువైనదాన్ని ఫిరీగా ఇచ్చేయడమేంటి?... నాన్చెంచ్‌’’  ‘‘ఓటు ధర ఇలా పెరిగిపోవడం ఓ చెడు సంకేతం కాదా?’’  

‘‘ఎంతమాత్రమూ కాదు. నిజానికి నా ఒపీనియనింగు పెకారం ఓటింగు ప్రైసింగు వింకా పెరగాలి. ఒకప్పటి రేట్లూ..ఇప్పటి ధరలూ, ఇప్పటికి తరిగిపోయిన రూపాయి విలువా.. వీటన్నింటినీ కూలంకచంగా పరిచీలింపచేసి, ఏ ఆడమ్‌ చ్మిత్తుతోనో, అమర్తచేనుతోనో లెక్కలు కట్టించారనుకోండి, పెరిగిన ద్రవ్యోల్బణం పెకారం.. ప్చ్‌..ఇప్పటి మన ఓటు ధర చాలా తక్కువని తెలుతుంది. ఇంకో విషయం.. ఓటు ధర బాగా పెరిగిందనుకోండి.. ‘అమ్మో.. మా చీటు ఇంతటి వ్యాల్యుయేషనబుల్‌ కదా’ అంటూ, దాన్ని నిలబెట్టుకోవడం కోసం మమ్మల్ని మరింత చంతృప్తిపరచేలా పాలిస్తుంటారు సార్‌ నేతలు’’  

‘‘అదేంటీ... ఇలా చెబుతున్నారు?’’  
‘‘సార్‌... మీకు మీ ఆఫీసువాళ్లు ఏడాదికోసారి బోనచు ఇస్తుంటారా, లేదా? దాన్ని మీరు తీసుకుంటారా లేక ‘అబ్బే..అప్పనంగా వచ్చింది మాకెందుకండీ’ అని వదిలేస్తారా?’’  
‘‘తీసుకుంటాం’’  ‘‘మాకు నెలనెలా వచ్చే మా పింఛనే జీతమనుకుందాం. జన్మకో శివరాత్రి అన్నట్టుగా ఎప్పుడో... ఐదేళ్లకోసారి బోనచుగా ఏ ఐదువేలో, ఆరువేలో ఇస్తారు. మీరు ఏడాదికోసారి బోనచు రాకపోతేనే ఎంతో అల్లల్లాడిపోతారు కదా. మాకేమో ఏదో ఓ రెణ్ణెల్ల పింఛన్ను..అది కూడా ఐదేళ్లకు..మచ్చుకు కొద్దిగా బోనచులాగా పడేస్తే..మీరీమాత్రానికే ఇంతగా విదైపోతుంటారెందుకో నాకు అర్థంకావడం లేదు’’  

‘‘ఇలా ఓటుకు ధర పెరుగుతూ పోవడం ప్రజాస్వామ్యానికి అనర్థం కాదా?’’  
‘‘ఓటును అమ్మడం, అమ్ముకోవడం అని మాటిమాటికీ అనకండి సిరాగ్గా! అమ్ముతున్నాడంటూ బదనాం చేయడానికి ఓటరే దొరికాడా మీకు తేరగా? అసలుఓటును అమ్ముకోడం అనడమేంటి? బార్బేరియన్‌’’ అన్నాడు చిరాగ్గా.  

‘‘మరి ఏమనాలి?’’ 
‘‘సార్‌.. నిజానికి ఇదొక వెకనమిక్‌ యాక్టివిటీ. అనగా... ఓ ఆర్థిక కార్యెకలాపం. ఉదాహరణకు..ఓ విలువైన పనికి టెండర్లు పిలుస్తారు. బిడ్డింగు వేస్తారు. ఎవరు ఎక్కువ లాభదాయకంగా కోటింగు చేస్తే, వాళ్లకు ఇస్తారు. ఓటు విషయంలోనూ అదే  జరుగుతోందని ఎందుకనుకోరు? ‘అరె ఓ విలువైన పనికి బిడ్డింగు జరిగింది, ఎవరు ఎక్కువగా ఇస్తే, వాళ్లకు ఓటిచ్చారు’ అని మీరెందుకనుకోరు?’’   

‘‘బిడ్డింగులో ఎవరు లాభదాయకంగా కోట్‌ చేస్తే వారికే పని అప్పగిస్తారు. కానీ ఓటు విషయంలో అభ్యర్థులందరినుంచీ డబ్బులు తీసుకుంటారు కదా ఓటర్లు?’’  
‘‘నేను ముందే చెప్పాను కదా... ఇదొక ఆర్థిక కార్యెకలాపం అని.  ‘ఓట్లు అమ్ముకుంటుంటారూ, అమ్ముకుంటున్నారం’టూ అదేపనిగా ఓటరును బ్లేమింగు చేస్తుంటారుగానీ..వాస్తవానికి ఏ ముగ్గురో, నలుగురో పోటీపడి ఆక్షనింగులో మానుంచి ఎమ్మెల్లే పదవిని కొనుక్కుంటున్నారననే ‘ఓ–కామర్స్‌’లా దీన్ని మీరెందుకు చూడరు?

అరె... మార్కెట్‌ అన్నాక వొడిదొడుకులుంటాయ్‌. డిమాండును బట్టి  ‘ఎలక్షన్‌ ఓటు రేటు సూచీ’ విండెక్చు ప్రకారం.. ఒక్కోసారి ఓటు ధర అమాంతం పెరుగుతుంది. ఒక్కోసారి పడిపోతుంది. కొన్నిసార్లు కొందరు ఓడిన అభ్యర్థులు తామిచ్చిన డబ్బులు తిరిగి వసూలు చేసుకున్న దాఖలాలు లేవా? మిగతా కామర్చు విషయాల్లోలాగే..చెరతులు వర్తిస్తాయనీ లేదా ‘ద వోటు ప్రైసెస్‌ ఆర్‌ సజ్జెట్టు టు మార్కెట్‌ రిచుకు’ అని పేపర్లలో మీరే రాస్తుంటారు కదా. ఇక్కడా అంతే. చేమ్‌ టు చేమ్‌. దీనికి మీరెందుకంతగా ఆశ్చర్యపోతుంటారెందుకో నాకర్థం కావడం లేదు’’  

‘‘మీరు పేపర్లు బాగా చదువుతూ, టీవీ ఎక్కువగా చూస్తుంటారు కదా? అందునా బిజినెస్‌ రిలేటెడ్‌ ప్రోగ్రాములు’’ ‘‘అవును... మీకెలా తెలుసు?’’ కాస్త సిగ్గు నటిస్తూ, కాంప్లిమెంటులా తీసుకున్నాడా ఎక్‌్చపర్టు!!      

Advertisement
 
Advertisement
 
Advertisement