![In The Wake Of Schools Reopen Review Meeting Held - Sakshi](/styles/webp/s3/article_images/2021/01/12/Sabitha-Indra-Reddy.jpg.webp?itok=Eao2B0K6)
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ విరామం తర్వాత పాఠశాలల్లో బోధన మొదలు కాబోతోంది. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో గతేడాది మార్చి రెండో వారం నుంచే విద్యా సంస్థలు మూతపడ్డాయి. కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న తరుణంలో కాస్త ఆలస్యంగా విద్యా సంవత్సరాన్ని ప్రారంభించిన ప్రభుత్వం.. ఆన్‌లైన్ బోధనకు అనుమతిచ్చింది. ఈక్రమంలో ఆన్‌లైన్, వీడియో పాఠాలు, ఇతర నెట్‌వర్కింగ్ యాప్‌ల ద్వారా తరగతులను విద్యాశాఖ నిర్వహిస్తోంది. ప్రస్తుతం కోవిడ్ వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టగా.. వ్యాక్సినేషన్ ప్రక్రియ సైతం ప్రారంభం కాబోతుండటంతో పాఠశాలలను తెరిచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి మాన్యువల్ తరగతులకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకుంది. అయితే తొలుత 9, 10 తరగతుల విద్యార్థులకు మాన్యువల్ పాఠాలు బోధించాలని సూచిస్తూ వారి హాజరుకు సుముఖత తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరగనుంది. ఇందులో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో పాటు వైద్య, ఆరోగ్య నిపుణులు సైతం పాల్గొననున్నారు.
జిల్లాల్లో హడావుడి..
పాఠశాలల ప్రారంభంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో జిల్లాల్లో హడావుడి మొదలైంది. స్కూళ్ల మూసివేతతో వాటి ఆవరణలో పేరుకుపోయిన చెత్త, తుప్పలను తొలగించాలని, తరగతి గదులను శానిటైజేషన్ చేయాలని సూచిస్తూ సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా విద్యాశాఖ అధికారి మహ్మద్ అబ్దుల్ ఉత్తర్వులు జారీ చేశారు. స్కూళ్లలో తీసుకుంటున్న జాగ్రత్త చర్యలకు సంబంధించిన అప్‌డేట్స్‌ను విద్యాశాఖ వాట్సాప్ గ్రూపుల్లో ఫొటోలతో అప్‌డేట్ చేయాలని స్పష్టం చేశారు. నిర్దేశించిన ఆదేశాలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు డీఈఓ అందులో పేర్కొన్నారు. 9, 10 తరగతుల విద్యార్థులకే స్కూళ్లలో బోధనకు అనుమతినిచ్చిన నేపథ్యంలో మిగతా తరగతులకు ఆన్‌లైన్ బోధన, వీడియో పాఠాలు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా ఈనెల 20వ తేదీ నుంచి ఫిబ్రవరి 24వ తేదీ వరకు డిజిటల్ తరగతులకు సంబంధించిన షెడ్యూల్‌ను స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ (సైట్) డైరెక్టర్ ఏ.క్రిష్ణారావు సోమవారం విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment