‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) చర్యలతో రాజధాని హైదరాబాద్‌లోని చెరువుల్లో ఆక్రమణలు చేసిన వారి వెన్నులో వణుకు పుడుతోంది. ఈ స్వయంప్రతిపత్తి సంస్థ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఎఫ్‌టీఎల్ పరిధిలోని అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్నారు.
ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించడం, చెరువులను పరిరక్షించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకున్న అధికారులు ఇప్పటివరకు నగరంలోని అనేక భవనాలతో పాటు పలు ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. నిత్యం ఏదో ఒకచోట అధికారులు ఆక్రమణలను కూల్చేస్తున్నారు. అయితే చాలా మందికి హైడ్రా మీద అనేక అనుమానాలు ఉన్నాయి.. వీటిపై హైడ్రా కమిషనర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..
చదవండి: ఆక్రమణదారులకు సింహస్వప్నం!
అసలు హైడ్రా అంటే ఏంటి?
హైడ్రా అనేది సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన. హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులు కబ్జాకు గురికాకూడదనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారు. చెరువుల పరిరక్షణ, అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటైన హైడ్రా పరిధి ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్) వరకు ఉంటుంది.
హైడ్రా ఛైర్మన్‌గా ముఖ్యమంత్రి వ్యవహరించనున్నారు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల మంత్రులు, సీఎస్, డీజీపీ, ప్రిన్సిపల్ సెక్రెటరీ, జీహెచ్‌ఎంసీ మేయర్ సభ్యులుగా ఉంటారు.
హైడ్రా ఏం చేస్తుంది.
హైడ్రా అంటే కేవలం కూల్చివేతలు మాత్రమే కాదు. సిటీని పకృతి విపత్తుల నుంచి రక్షించడానికి కృషి చేయడం, విపత్తుల సమయంలో వేగంగా స్పందించి ప్రజలను కాపాడే సంస్థ ప్రభుత్వ భూములను స్థానికులతో కలిసి కాపాడుకోవడానికి కృషి చేస్తాం. ప్రభుత్వ ఆస్తులైన చెరువులు, పార్కులు, నాలాలు, స్మశాన వాటికలు వంటి వాటిని కబ్జా కాకుండా చూస్తుంది. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించడం, విపత్కర పరిస్థితుల్లో నగరానికి అండగా ఉండటం దీని ప్రధాన లక్ష్యాలు.
ఇప్పుడున్న చెరువులను కాపాడుతూ గతంలో కబ్జాకు గురైన చెరువులను నెమ్మదిగా స్వాధీనం చేసుకోవడానికి చర్యలు తీసుకుంటాం. నగరంలోని చెరువుల్లో ఇప్పటి వరకు దాదాపు 66 శాతం కబ్జాకు గురయ్యాయి. ఇలాగే వదిలేస్తే ఒకటి రెండేళ్లలో సిటీ పరిధిలో చెరువనేదే కనిపించకుండా పోతుంది. వీటి రక్షణ కోసమే హైడ్రా. భవిష్యత్తులో ఎవరైనా ప్రభుత్వ భూములను కబ్జా చేయాలంటే భయం పుట్టాలి. ఇది కబ్జాదారుల వెన్నులో వణుకు పుట్టించాలి.
జీహెచ్‌ఎంసీ అధికారులు ఎవరైనా అవినీతికి పాల్పడితే, విధులు సక్రమంగా నిర్వర్తించకపోతే వారి మీద విజిలెన్స్ రిపోర్టు తయారు చేసి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు అందజేస్తాం. వర్షాలు వచ్చిన సమయంలో రోడ్లపై నీరు నిలిచిపోతే స్పందించి వాటిని క్లియర్ చేయడం. కూడా హైడ్రా విధినే.
ఇప్పటికే హైడ్రా అధికారులు ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు, లే అవుట్లలో సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలాలు, పరిశ్రమల శాఖకు చెందిన స్థలాల్లో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే ఉన్న నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చేస్తున్నారు. ఆక్రమణలకు గురైన చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటున్నారు.
చదవండి: ట్రిపుల్‌వన్ అడ్రస్ తెలుసా హైడ్రా?
నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత
ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా బృందం కూల్చివేస్తోంది. మాదాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య కన్వెన్షన్ కూల్చివేతను అధికారులు చేపట్టారు. తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఈ నిర్మాణం చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి. మూడున్నర ఎకరాలు కబ్జా చేసి కన్వెన్షన్‌ను నిర్మించారని అధికారులకు ఫిర్యాదులు రావడంతో అధికారులు ఈ చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment