తాడుతో వెంకటేశ్‌ను బయటకు లాగుతున్న మత్స్యకారుడు, బాధితుడు వెంకటేశ్
సాక్షి, తిమ్మాపూర్(కరీంనగర్): భార్య వేధింపులు భరించలేక ఓ వ్యక్తి దిగువ మానేరు జలాశయం కాకతీయ కాలువలో దూకి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన సోమవారం కరీంనగర్ కార్పొరేషన్ పరిధి అల్గునూర్ శివారులో జరిగింది. నీటిలో కొట్టుకుపోతున్న యువకుడిని స్థానిక చేపలకాలనీకి చెందిన జాలర్లు ప్రాణాలు తెగించి కాపాడారు. బాధితుడు, జాలర్ల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా కొత్తవాడకు చెందిన వెంకటేశ్ భార్య వేధింపులు భరించలేక ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. కొన్ని రోజులుగా బయటే తిరుగుతూ సోమవారం ఉదయం అల్గునూర్ శివారులోని కాకతీయ కాలువ వద్దకు చేరుకొని అందులో దూకాడు. ఇదే సమయంలో చేపల కాలనీకి చెందిన బాలరాజు కరీంనగర్ మార్కెట్‌లో చేపలు విక్రయించి ఇంటికి వస్తున్నాడు.
కాలువ వద్దకు రాగానే వెంకటేశ్ నీటిలో కొట్టుకుపోతూ కనిపించాడు. వెంటనే అప్రమత్తమైన బాలరాజు అక్కడే ఉన్న చిందం శ్రీను, అమర్ సాయంతో తన బండికి ఉన్న తాడును కాలువలోకి వేసి యువకుడిని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే యువకుడు తాడు పట్టుకోకపోవడంతో బాలరాజు తాడుసాయంతో కాలువలోకి దిగి వెంకటేశ్‌ను ఒడ్డుకు చేర్చాడు. ఈ సందర్భంగా బాధితుడిని వివవరాలు అడగ్గా, తనది ఆదిలాబాద్ జిల్లా కొత్తవాడ అని చెప్పాడు. తనను భార్య మోసం చేసిందని, వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుందామని కాలువలో దూకానని వెల్లడించాడు. యువకుడిని కాపాడినవారు ఎల్‌ఎండీ పోలీసులకు సమాచారం అందించగా, అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాణాలకు తెగించి వెంటకేశ్‌ను కాపాడిన బాలరాజు, శ్రీను, అమర్‌ను ఎస్సై కృష్ణారెడ్డి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment