సాక్షి, హైదరాబాద్: తెలిసీ తెలియక కొందరు యువతులు, విద్యార్థినులు ఆన్‌లైన్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. ఇలాంటి బాధితుల రక్షణ కోసం విమెన్ సేఫ్టీ వింగ్ త్వరలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. ఇకపై సైబర్ బాధితుల ఇంటికే నేరుగా పోలీసులు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించనున్నారు. ఇందుకోసం షీ టీమ్స్‌లో కొందరు మహిళా పోలీసులకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు. వీరు ఆర్థిక నేరాలు మినహా మహిళలకు ఆన్‌లైన్‌లో ఎదురయ్యే అన్నిరకాల మోసాలు, వేధింపులపై తమకు ఫిర్యాదు రాగానే.. వెంటనే బాధితుల వద్దకు వెళ్తారు. అక్కడే ఫిర్యాదు తీసుకుని పరిస్థితిని బట్టి చర్యలు తీసుకుంటారు. ఈ టీం సభ్యులకు సైబర్ నేరాలు, ఆన్‌లైన్ వేధింపులు.. వాటిని ఎలా ఎదుర్కోవాలి తదితర విషయాలపై ఇప్పటికే సమగ్ర అవగాహన కల్పించారు. అంతేకాకుండా ఈ బృందంలో ఒక సైకియాట్రిస్ట్ కూడా ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు.
ఈ బృందం ఏమేం చేస్తుంది?
వాస్తవానికి ఉద్యోగం చేస్తున్న మహిళలు, చదువుకుంటున్న యువతులు, స్కూలు విద్యార్థినులు నిత్యం ఏదో ఒకచోట రకరకాల వేధింపులు ఎదుర్కొంటున్నారు. వాటిని పరిష్కరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 341 షీ టీమ్స్ ఉన్నాయి. ఇలాంటి ఫిర్యాదులను స్వీకరించేందుకు ఇటీవల ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్‌లు కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆన్‌లైన్‌లో ఎదురయ్యే వేధింపులపై చాలామంది పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసేందుకు వెనకడుగు వేస్తుంటారు. ఎవరికీ చెప్పుకోలేక, తమలో తామే కుమిలిపోతుంటారు. కొందరికి ఆడ పిల్ల పోలీస్‌స్టేషన్ గడప తొక్కకూడదన్న ఆలోచనలతో వదిలేయాలని పెద్దలు సలహా ఇస్తుంటారు.
అవసరమైతే ఆఫీసు, కాలేజీ, స్కూలు మాన్పించి వేధింపులకు దూరంగా ఉంచేందుకు ప్రయత్నిస్తుంటారు. చాలా సందర్భాల్లో సోషల్ మీడియా, ఆన్‌లైన్, సెల్‌ఫోన్.. ఇలా మాధ్యమం ఏదైనా, అది ఎలాంటి వేధింపులైనా, లేక ప్రేమ వ్యవహారం నడిపి మోసం చేసినా, పెళ్లిపేరుతో మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో పరిచయం పెంచుకుని మాట తప్పినా.. అవేమీ వెలుగు చూడటం లేదు. కారణం పరువుపోతుందన్న భయం. అయితే, ఇకపై అలాంటి భయాలు అవసరం లేదని షీ టీమ్స్ పోలీసులు అంటున్నారు. ‘మీరు షీ టీమ్స్‌కు కాల్ చేయగానే సైబర్ టీం మీ ముందుకు వస్తారు. మీ పేరు, వివరాలు ఎక్కడా బయటకు రావు. వారు ముందుగా మీలో ధైర్యాన్ని నింపుతారు. ఓదార్పునిస్తారు. నిందితులను క్షణాల్లో గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటారు. మీకు ఇకపై నిందితుల నుంచి ఎలాంటి ఇబ్బంది రాకుండా, విషయం మూడో కంటికి తెలియకుండా సమస్యను పరిష్కరిస్తారు’అని చెబుతున్నారు. ఒక వేళ సమస్య తీవ్రత అధికంగా ఉంటే, తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్నతాధికారులను సంప్రదించి కేసు పెడతారు.
లాక్‌డౌన్‌తో పెరిగిన సమస్యలు..
కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగింది. అయితే అంతే స్థాయిలో మహిళలు, పిల్లలకు ఆన్‌లైన్ వేధింపులు కూడా అధికమయ్యాయి. అలాంటి వేధింపులకు చరమగీతం పాడేందుకు, బాధితులకు తామున్నామన్న భరోసా కల్పించేందుకు విమెన్ సేఫ్టీ వింగ్ ఇలాంటి వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. ఇప్పటికే లాక్‌డౌన్ కాలంలో గృహహింస, భార్యాభర్తల కలహాలపై టెలిఫోన్‌లో కౌన్సెలింగ్ నిర్వహించి అనేక సమస్యలు పరిష్కరించిన విమెన్ సేఫ్టీ వింగ్‌పై ప్రశంసల జల్లు కురిసింది. రాష్ట్రంలో వేలాదిమంది గృహిణులకు స్వాంతన చేకూర్చింది. ఇపుడు ఈ విధానం కూడా లక్షలాది మంది యువతులు, విద్యార్థినులలో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెంచుతుందని పోలీసు ఉన్నతాధికారులు ధీమాగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment