విశ్వ నగరాలు.. శాస్త్రీయ విధానాలు | World Class Cities Disaster Management And Flood Scientific Approaches | Sakshi
Sakshi News home page

విశ్వ నగరాలు.. శాస్త్రీయ విధానాలు

Published Tue, Oct 20 2020 8:10 AM | Last Updated on Tue, Oct 20 2020 12:56 PM

World Class Cities Disaster Management And Flood Scientific Approaches - Sakshi

న్యూయార్క్‌ సిటీ, లండన్‌ మహా నగరం, ఫిలడెల్ఫియా నగరం, పారిస్‌ సిటీ

సాక్షి, హైదరాబాద్‌: భారీ వర్షాలతో నిండా మునకేస్తోంది మన గ్రేటర్‌ సిటీ. ఈ దుస్థితిని నివారించేందుకు విశ్వనగరాల్లో అమలవుతున్న అత్యున్నత శాస్త్రీయ విధానాలు భాగ్యనగరంలోనూ అమలుచేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచంలో లండన్, న్యూయార్క్, ఫిలడెల్ఫియా, పారిస్‌ నగరాల్లో భారీ వర్షం, విపత్తులు సంభవించినపుడు ప్రధాన రహదారులు, కాలనీలు మునగకుండా వరద, మురుగు నీరు సాఫీగా వెళ్లేందుకు వేర్వేరుగా ఏర్పాట్లు ఉండడం విశేషం. ఆయా నగరాల్లో అమలు చేస్తున్న అత్యున్నత విధానాలను నగరంలోనూ అమలు చేస్తే ముంపు సమస్యలను నివారించడం సాధ్యపడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

బార్సిలోనాలో.. 
బెంగళూరులో ఇంజెక్షన్‌ వెల్‌ సాంకేతికత ఇలా.. 

  • బెంగళూరు నగరంలో ప్రధాన రహదారులను ముంచెత్తుతున్న వరద నీటిని అరికట్టేందుకు భారీ సంఖ్యలో అండర్‌పాస్‌లు, ప్రధాన రహదారులపై ఇంజెక్షన్‌ వెల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు.  
  • భూమిపైనుంచి బోర్‌వెల్‌ యంత్రంతో 150 నుంచి 200 అడుగుల లోతు వరకు బోరుబావి(ఇంజెక్షన్‌ వెల్‌) తవ్వుతారు.  
  • ఈ బావిలోకి 12 ఎంఎం పరిమాణం చిల్లులున్న కేసింగ్‌ పైపును దింపుతారు. పైపులోనికి రాళ్లు చేరకుండా చుట్టూ సన్నటి జాలీని ఏర్పాటు చేస్తారు.  
  • ఈ బోరుబావి చుట్టూ రెండు మీటర్ల లోతు, మరో 1.5 మీటర్ల పొడవు, వెడల్పుతో గుంత ఏర్పాటు చేస్తారు. ఈ గుంతలో ఒక మీటరు మందం వరకు 40 ఎంఎం పరిమాణం ఉన్న బెందడి రాళ్లు వేస్తారు.  
  • మరో 0.5 మీటర్ల మేర 20 ఎంఎం పరిమాణం ఉన్న గులకరాళ్లను నింపుతారు. మరో 0.3 మీటర్ల మేర మందం ఇసుకతో నింపుతారు.  
  • పార్కు లేదా కమ్యూనిటీ హాలు లేదా లోతట్టు ప్రాంతాల నుంచి వర్షపునీరు వచ్చి ఈ ఇంకుడు గుంతపై కొద్దిసేపు నిలిచే ఏర్పాటు చేస్తారు.  
  • ఈ నీరు ఇంకుడు గుంత నుంచి, దానికి మధ్యలో రంధ్రాలున్న కేసింగ్‌ పైపు ద్వారా దశలవారీగా భూమి లోపలి పొరల్లోకి ఇంకుతుంది.  
  • దీంతో వర్షపునీరు భూమి అంతరాల్లో ఉన్న ఆయా పొరల్లోకి పాకుతుంది. దీంతో ఆయా పొరల్లోకి సమృద్ధిగా నీటి ఊట చేరి సమీపంలో కిలోమీటరు పరిధిలో ఉన్న బోరుబావులు త్వరగా రీఛార్జీ అవుతాయి.  
  • సాధారణ ఇంకుడు గుంత కంటే ఇంజెక్షన్‌ వెల్‌ సాంకేతికత ఆధారంగా నిర్మించే రీఛార్జి పిట్స్‌తో ఫలితాలు రెట్టింపు స్థాయిలో ఉంటాయి.  
  • ఒక్కో ఇంజెక్షన్‌ వెల్‌కు సుమారు రూ.40 వేల అంచనా వ్యయం కానుందని అంచనా.

    మన నగరంలోని కుత్బుల్లాపూర్‌ ఉమామహేశ్వర కాలనీ దుస్థితి ఇదీ.. 

    విశ్వ నగరాల్లో చర్యలివే.. 
  • ఆయా నగరాల్లోని అన్ని ప్రధాన, సర్వీసు రహదారులకు ఇరువైపులా వర్షపు నీరు సాఫీగా వెళ్లేందుకు వీలుగా వరదనీటి కాల్వలను ఏర్పాటు చేశారు. 
  • కాల్వల్లో మురుగు నీరు చేరకుండా చర్యలు చేపట్టారు.  
  • మురుగునీటి పారుదల వ్యవస్థకు ప్రత్యేక పైప్‌లైన్‌ వ్యవస్థ. 
  • ఆయా రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో రెయిన్‌గేజ్, స్మార్ట్‌బాల్‌ టెక్నాలజీ ఆధారంగా వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు శాస్త్రీయ అంచనాతో ముంపు నివారణ.  
  • వరద నీటి కాల్వలపై ఆక్రమణలు పూర్తిగా నిషిద్ధం.  
  • లోతట్టు ప్రాంతాల్లో భారీ పరిమాణంలో ఉండే ఇంకుడు కొలనుల ఏర్పాటుతో వరదనీరు నేలగర్భంలోకి సులువుగా ఇంకేలా చర్యలు.  
  • పార్కులు, ఫుట్‌పాత్‌లు, రహదారులకు ఇరువైపులా, నగరంలో ఖాళీస్థలాల్లో భారీగా గ్రీన్‌బెల్ట్‌ ఏర్పాటు చేయడంతో కాంక్రీట్‌ విస్తీర్ణం తగ్గి వర్షపు నీరు నేలగర్భంలోకి చేరుతుండడంతో తప్పుతున్న ముంపు అవస్థలు.  
  • ప్రతి ఇల్లూ, భవనం, కార్యాలయం, వాణిజ్య సముదాయంపై కురిసిన వర్షాన్ని నిల్వ చేసేందుకు అందుబాటులో విధిగా రీఛార్జింగ్‌ పిట్‌. దీంతో రహదారులపైకి వచ్చే వరద సుమారు 60 శాతం తగ్గుతోంది. 
  • భవన విస్తీర్ణంలో సగభాగం గ్రీన్‌బెల్ట్‌ ఉండేలా చూడటంతో వరద ముప్పు తప్పుతోంది. 
  • ఇక ఫిలడెల్ఫియా (అమెరికా), బార్సిలోనా మహానగరాల్లో ఇంకుడు గుంతలను విస్తృతంగా తవ్వడంతో 80 శాతం వర్షపు నీటిని ఒడిసిపడుతున్నారు. 
  • ఉదాహరణకు 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇంటికి బోరుబావికి ఆనుకొని రెండు మీటర్ల వెడల్పు, 2 మీటర్ల లోతున ఇంకుడు గుంత ఏర్పాటు.   
  • గుంత పూడకుండా చుట్టూ లోపలి వైపు నుంచి బండ రాళ్లు లేదా ఇటుకలతో మధ్యలో సన్నటి ఖాళీలుంచి పేర్చాలి. గుంతపై ఆర్‌సీసీ సిమెంటుతో తయారు చేసిన జాలీ ఏర్పాటు. జాలీకి ఉన్న పెద్ద రంధ్రాల నుంచి వర్షపునీరు గుంతలోకి మళ్లేలా ఏర్పాటు చేయాలి.  
  • ఇంటి పైకప్పుపై చేరిన వర్షపునీరు నేరుగా ఈ గుంతలోకి చేరేలా ఏర్పాటు చేయాలి. ఇలా చేస్తే రోజుకు సుమారు 50 నుంచి 80 మి.లీటర్ల వర్షపాతాన్ని బోరుబావికి సమీపంలో ఇంకించవచ్చు.  
  • సీజన్‌లో నిల్వ చేసిన ఈ నీరు ఐదుగురు సభ్యులున్న కుటుంబానికి మూడు నెలల అవసరాలకు సరిపోతాయి.  
  • లోతట్టు ప్రాంతాలు, పార్కులో పెద్ద విస్తీర్ణంలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేస్తే వాటికి సమీప ప్రాంతాల్లో బోరుబావులు రీఛార్జీ అవుతాయి. వర్షపునీటిని ఎక్కడికక్కడే ఇంకింపజేస్తే రహదారులను ముంచెత్తే వర్షపునీరు సైతం తగ్గుముఖం పడుతుంది.  
  • మన పొరుగునే ఉన్న తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్‌ నగరంలో తరచూ వరదనీరు నిలిచే ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో భారీ పరిమాణంలో ఉండే ఇంకుడు గుంతలను ఏర్పాటు చేశారు.  
  • దీంతో వరదనీరు నేలగర్భంలోకి చేరి భూగర్భ జలమట్టాలు గణనీయంగా పెరిగినట్లు టీఎస్‌డీపీఎస్‌ గుర్తించింది.  
  • ఈ నమూనా గ్రేటర్‌ పరిధిలోనూ అమలు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement