ఉత్సవమూర్తులకు రక్షాబంధనం చేసేందుకు కంకణం చూపిస్తున్న ప్రధానాచార్యులు. చిత్రంలో ఆలయ ఈవో, అనువంశిక ధర్మకర్త ఉన్నారు.
సాక్షి, యాదాద్రి/యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం స్వస్తివాచనంతో ప్రారంభమయ్యాయి. బాలాలయాన్ని వివిధ రకాల పూలతో అలంకరించారు. ముందుగా గర్భాలయ ఆవరణలో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, నవకలశాభిషేకం, రక్షాబంధనం కార్యక్రమాలను నిర్వహించారు. ధాన్యరాశిలో సత్యం, జ్ఞానం, ధర్మం అనే ముగ్గురు దేవతలను ఆవాహన చేసి ఆ కలశాలలో శుద్ధ గంగాజలాన్ని పోసి వాటికి ప్రత్యేక పూజలు చేశారు.
మొదట దేవస్థాన అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి యజ్ఞాచార్యులకు, ఆ తర్వాత ఆలయ అర్చకులకు రక్షాబంధనం చేశారు. అనంతరం అర్చకులు దేవస్థాన ఈఓ గీతారెడ్డి, చైర్మన్ బి.నర్సింహమూర్తిలకు రక్షాబంధనం చేశారు. ఈ ఉత్సవాల్లో పంచనారసింహుల శక్తిని పెంచడానికి కఠోర నియమాలతో దీక్ష తీసుకోవడమే రక్షాబంధనం.
అనంతరం పోచంపల్లి పద్మశాలి మహాజన సంఘం ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్లకు పట్టు చీరలు, ధోవతి, కండువా, తలంబ్రాలు సమర్పించారు. స్వామివారి కల్యాణానికి అవసరమయ్యే పుట్టమన్ను తెచ్చి కల్యాణ మండపంలో స్వామివారిని అధిష్టింపచేశారు. పుట్టమన్నును 12 పాత్రలలో వేసి 12 రకాలైన ధాన్యాలను వేసి 12 రకాల దేవతలతో ఆవాహన చేసి ప్రత్యేక పూజలతో అంకురార్పణ చేశారు.
ధ్వజస్తంభానికి బంగారు తొడుగు
ఈనెల 28న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్ఘాటన నేపథ్యంలో అళ్వార్ మండపంలో ఏర్పాటు చేసిన ధ్వజస్తంభానికి చేపట్టిన బంగారు తొడుగుల పనులు తుది దశకు చేరాయి. ధ్వజస్తంభం 34 అడుగుల ఎత్తు ఉంది. ఇక గోపురాలు, విమాన శిఖరాలపై బిగించేందుకు బంగారు కలశాలు సిద్ధం చేస్తున్నారు. కలశాలు 8 నుంచి 10అడుగుల ఎత్తు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment