
సాక్షి, హైదరాబాద్: కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. మరోసారి సీబీఐ విచారణలో భాగంగా మంగళవారం హైదరాబాద్‌కు వచ్చిన అవినాశ్‌రెడ్డిని సుమారు నాలుగు గంటపాటు అధికారులు ప్రశ్నించారు. న్యాయవాది సమక్షంలో అవినాశ్‌రెడ్డిని సీబీఐ విచారించింది.
కాగా, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం వాదనలు విన్న అనంతరం అరెస్టు సహా ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని సీబీఐని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. తాము తీర్పు వెలువరించే వరకు ఈ మధ్యంతర ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.
తనను విచారణకు హాజరు కావాలని ఆదేశించడంపై స్టే విధించాలని కోరుతూ అవినాశ్‌రెడ్డి తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఒకవేళ విచారణ చేపట్టినా ఆడియో, వీడియో రికార్డింగ్‌తోపాటు దర్యాప్తు పారదర్శకంగా సాగేలా సీబీఐని ఆదేశించాలని అభ్యర్థించారు. ఈ పిటిష న్‌పై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ సోమవారం మరోసారి విచారణ చేపట్టారు. ఎంపీ అవినాశ్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పు రిజర్వు చేశారు. తదుపరి విచారణపై స్టే ఇవ్వాలన్న పిటిషన్‌పైనా తీర్పు రిజర్వు చేస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది.