సంకల్ప సభను సక్సెస్‌ చేయండి: వైఎస్‌ షర్మిల | YS Sharmila Launches Khammam Meeting Campaign Chariot | Sakshi
Sakshi News home page

సంకల్ప సభను సక్సెస్‌ చేయండి: వైఎస్‌ షర్మిల

Published Tue, Apr 6 2021 12:47 AM | Last Updated on Tue, Apr 6 2021 11:52 AM

YS Sharmila Launches Khammam Meeting Campaign Chariot - Sakshi

సంకల్ప సభ ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభిస్తున్న వైఎస్‌ షర్మిల 

సాక్షి, హైదరాబాద్‌: ఖమ్మంలో ఈ నెల 9న ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సంకల్పసభను విజయవంతం చేయాలని వైఎస్‌ షర్మిల పిలుపునిచ్చారు. సోమవారం లోటస్‌పాండ్‌లోని తన కార్యాలయం లో ఆమె పాలేరు నియోజకవర్గానికి చెందిన యెనికే కిషోర్‌బాబు ఆధ్వర్యంలో రూపొందించిన సంకల్ప సభ ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ, తమ పార్టీ విధి విధానాలను ఆవిష్కరించే ఈ సభకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున తరలిరావాలన్నారు. ఆ దిశగా ఖమ్మంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్‌ఆర్‌ అనుచరులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా భారీ జన సమీకరణకు నడుంబిగించారన్నారు. ఈ సభను కరోనా నిబంధనలకు అనుగుణంగా జరుపుకుందామని, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని షర్మిల కోరారు. అదే విధంగా ఖమ్మం జిల్లాలో సైతం నియోజకవర్గాల వారీగా ఆయా పరిశీలకుల ఆధ్వర్యంలో సంకల్ప సభ సన్నాహాక సమావేశాలు కొనసాగుతున్నాయి. 

షర్మిలకు పెరుగుతున్న మద్దతు 
వైఎస్‌ షర్మిలకు రోజురోజుకీ వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నుంచి మద్దతు పెరుగుతోంది. సోమవారం కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సర్పంచ్‌లు, న్యాయవాదులు పెద్ద సంఖ్యలో లోటస్‌పాండ్‌కు తరలివచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ గ్రేటర్‌ హైదరాబాద్‌ మహిళా అధ్యక్షురాలు అచ్యుతా యాదవ్‌ తన పదవికి రాజీనామా చేసి షర్మిలకు మద్దతు పలికారు. నారాయణపేట్‌ జిల్లా మక్తల్‌ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ మాజీ సర్పంచ్‌లు ఆరుగురు కూడా మద్దతు తెలిపారు. అదే విధంగా కరీంనగర్‌ జిల్లా మంథని నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ మాజీ సర్పంచ్‌ లోటస్‌పాండ్‌లో షర్మిలను కలిశారు.

హైదరాబాద్‌లోని సివిల్, క్రిమినల్‌ కోర్టులతో పాటు హైకోర్టుకు సంబంధించిన న్యాయవాదులు మతీన్‌ ముజాద్దది షర్మిలను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ అభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ముందడుగు వేస్తున్న షర్మిలకు తమ సంపూర్ణ మద్దతు ఇస్తామని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు. షర్మిలను కలిసిన వారిలో న్యాయవాదులు సుభాన్‌ జావీద్, సయ్యద్‌ నసీబ్‌ ఫహీమ్, సిద్దయ్య, కోటేశ్వరావు, నాజిబా సుల్తాన, ఎస్‌.జె.సుజాత, వాహెబ్‌ అలీ, ఎ.శ్రీధర్‌ తదితరులు ఉన్నారు. కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన సర్దార్జీలు, నగరంలోని ఓ ప్రముఖ కార్పొరేట్‌ ఆస్పత్రికి చెందిన వైద్యుడు పెద్దఎత్తున అనుచర గణంతో షర్మిలకు మద్దతు తెలిపారు. 

జగ్జీవన్‌రామ్‌ చరిత్ర స్ఫూర్తిదాయకం: షర్మిల 
సాక్షి, హైదరాబాద్‌: దివంగత మాజీ ఉపప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్‌ చరిత్ర స్ఫూర్తిదాయకమని వైఎస్‌ షర్మిల అన్నారు. సోమవారం లోటస్‌పాండ్‌లో జగ్జీవన్‌రామ్‌ 114వ జయంతి వేడకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా షర్మిల జగ్జీవన్‌రామ్‌ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని పోరాటం సాగించిన ఆయన గొప్ప సంఘసంస్కర్త అని కొనియాడారు. సామాజిక సమానత్వం కోసం రాజీలేని పోరాటాన్ని కొనసాగించిన జగ్జీవన్‌.. మహనీయుడని శ్లాఘించారు. కార్యక్రమంలో షర్మిల అనుచరుడు పిట్టా రాంరెడ్డి, అధికార ప్రతినిధి ఇందిరాశోభన్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement