చంద్రగిరి: వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలను బలి తీసుకుంది. భార్య వేరొకరితో సహజీవనం చేస్తూ, కాపురానికి రాలేదని మనస్తాపంతో ఒంటిపై సోమవారం ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. వివరాలు.. విజయవాడలోని పాయకాపురానికి చెందిన మణికంఠ (32)కు పదేళ్ల కిత్రం వివాహమైంది. అయితే మనస్పర్థల కారణంగా భార్యతో విడిపోయాడు. అలాగే తిరుత్తణికి చెందిన దుర్గ అనే మహిళ తన భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటోంది.
ఆమెతో మణికంఠకు పరిచయం ఏర్పడింది. ఇరువురూ ఇష్టపడి పెద్దల సమక్షంలో రెండో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఇటీవల నుంచి మణికంఠ తరచూ దుర్గను వేధించేవాడు. దీంతో ఆమె భర్తను వదలి తిరుపతికి వచ్చేసింది. ఇక్కడ సోను అనే వ్యక్తి పరిచయం కావడంతో అతడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇద్దరూ భాకరాపేటలోని ఓ తోటలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే పిల్లల కోసం అప్పుడప్పుడూ మణికంఠకు ఫోన్ చేస్తుండేది. అలా ఫోన్ చేసే సమయంలో తాను భాకరాపేటలో ఉంటున్నట్లు వెల్లడించింది.
వెంటనే మణికంఠ భార్య కోసం వచ్చేశాడు. చంద్రగిరి పోలీసులను ఆశ్రయించాడు. అయితే భర్తతో వెళ్లడం ఇష్టం లేదని దుర్గ తేల్చి చెప్పడంతో శ్రీనివాసులు అనే కానిస్టేబుల్ ఇందులో జోక్యం చేసుకున్నాడు. ఆమె రానంటున్నప్పుడు ఎందుకు ఇబ్బంది పెడతావని మణికంఠను హెచ్చరించాడు. దీంతో మనస్తాపం చెందిన మణికంఠ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు వెంటనే అతడిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి మెడికల్ కళాశాలకు తరలించారు.
కానిస్టేబుల్‌కు చుట్టుకుంటున్న కేసు!
మణికంఠ ఆత్మహత్య కేసు కానిస్టేబుల్ శ్రీనివాసులు మెడకు చుట్టుకుంటోంది. దుర్గ, సోను పని కోసం ఆశ్రయిస్తే వారు భార్యాభర్తలనుకుని కూలి పని ఇప్పించానని శ్రీనివాసులు వెల్లడిస్తున్నాడు. మణికంఠతో ఆమెకు వివాహమైన విషయం తెలియగానే వారిని కలిపేందుకు యత్నించానని, అయితే దుర్గ ససేమిరా అనడంతో మణికంఠకు ఫోన్ చేసి విషయం తెలిపినట్లు వివరిస్తున్నాడు. ఇదే తనకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ క్రమంలో మృతుడు మణికంఠపై పలు చోరీ కేసులు నమోదైనట్లు పోలీసు విచారణ తేలింది. ప్రకాశం జిల్లా చీరాల, వేటపాళెం పోలీసు స్టేషన్లలో చోరీ కేసులు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment