అభివృద్ధి పనుల పరిశీలన
రేణిగుంట(ఏర్పేడు): ఏర్పేడు మండలంలోని తన స్వగ్రామమైన మన్నసముద్రంలో సోమవారం తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి గ్రామంలో ఎంపీ నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. మహిళలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సింగిల్ విండో మాజీ చైర్మన్ నాగార్జునరెడ్డి పాల్గొన్నారు.
గ్రీవెన్స్‌కు 238 అర్జీలు
తిరుపతి అర్బన్:కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు జిల్లా నలు మూలల నుంచి 238 అర్జీలు వచ్చినట్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవేంద్రరెడ్డి తెలిపారు. ఇందులో రెవెన్యూ సమస్య లపైనే 161 అర్జీలు వచ్చినట్టు వెల్లడించారు. ఆయా అర్జీలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ సుధారాణి, డీఆర్‌డీఏ పీడీ శోభన్‌బాబు పాల్గొన్నారు.
వేటుకు రంగం సిద్ధం!
తిరుపతి తుడా:ప్రభుత్వ కళాశాలలో, ఆస్పత్రుల్లో పనిచేస్తూ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిన అధ్యాపకులపై ప్రభుత్వం వేటుకు రంగం సిద్ధం చేసింది. ఈనెల 10వ తేదీన అలాంటి అధ్యాపకులను గుర్తించి నోటీసులు జారీచేసింది. ఈనెల 24వ తేదీలోపు వివరణ ఇవ్వాలని, లేని పక్షంలో విధుల నుంచి పూర్తి స్థాయిలో తొలగిస్తామని నోటీసుల్లో హెచ్చరించింది. ప్రభుత్వ వైద్య సంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లుగా ఉద్యోగాలు పొంది, కొన్ని రోజులకు సెలవులపై వెళ్లడం కొందరికి పరిపాటిగా మారింది. ప్రైవేట్ ఆస్పత్రులను స్థాపించుకుని గవర్నమెంట్ ఆస్పత్రి డిసిగ్నేషన్‌తో డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేసుకుని చలామణి అవుతున్నారు. ప్రభుత్వాస్పత్రులకు దీర్ఘకాలిక సెలవులు పెట్టి సొంత ఆస్పత్రుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారు. సంవత్సరాల తరబడి సెలవుల్లోనే ఉండడం వల్ల పోస్టుల ఖాళీల వివరాలు రికార్డుల్లో చూపడం లేదు. తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాల, రుయా ఆస్పత్రుల్లో 13 మంది వైద్య అధ్యాపకులు దీర్ఘకాలిక సెలవుల్లో సొంత పనుల్లో మునిగితేలుతున్నారు. నోటీసులు అందుకున్న వైద్య అధ్యాపకులు 24వ తేదీలోపు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.
ఘనంగా తెలుగు వీకిపీడియా
తిరుపతి తుడా: తిరుపతి కేంద్రంగా జరిగిన తెలుగు వీకిపీడియా పండుగ–2025 ఘనంగా నిర్వహించారు. తెలుగు వీకిపీడియా యూజర్స్ గ్రూప్ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. కో–ఆర్డినేటర్ కశ్వప్ మాట్లాడుతూ అందరికీ విజ్ఞానాన్ని పంచడమే దీని ప్రధాన లక్ష్యమన్నారు.
అభివృద్ధి పనుల పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment