జన హితం.. మన అభిమతం | - | Sakshi
Sakshi News home page

జన హితం.. మన అభిమతం

Published Thu, Feb 20 2025 8:14 AM | Last Updated on Thu, Feb 20 2025 8:09 AM

జన హితం.. మన అభిమతం

జన హితం.. మన అభిమతం

మేయర్‌ పదవిని లాక్కోవాలని చూస్తే సహించం
● పేదల సంక్షేమం కోసం జగనన్న.. ప్రజల ఓట్ల కోసం చంద్రబాబు ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన

తిరుపతి మంగళం : జన హితమే వైఎస్సార్‌సీపీ అభిమతమని, మాట తప్పని మడం తిప్పని నేతగా ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన ఘనత జగనన్నకే దక్కుతుందని పార్టీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. బుధవారం తిరుపతిలోని ఎస్‌ఆర్‌ కల్యాణమండపంలో వైఎస్సార్‌సీపీ నగర కమిటీ ప్రమాణస్వీకారం నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో కరుణాకరరెడ్డి మాట్లాడారు. జగనన్నను ఎన్నికల్లో పోగొట్టుకున్నామని రాష్ట్ర ప్రజలందరూ ఎంతో బాధపడుతున్నారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అందించి దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేత జగనన్న మాత్రమేనని వెల్లడించారు. కూటమి నాయకుల అరాచకాలు మితిమీరిపోతున్నాయని, డిప్యూటి మేయర్‌ ఎన్నికలో వారు చేసిన దుర్మార్గాలను ప్రజలు చూశారని తెలిపారు. అదే కుట్రధోరణితో మేయర్‌ పదవిని కూడా లాక్కోవాలని చూస్తే జగనన్ననే తిరుపతికి రప్పిస్తామని హెచ్చరించారు. తిరుమల వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ తొక్కిసలాటలో గాయపడిన వారిని పరామర్శించేందుకు వచ్చినప్పుడు జగనన్న వెంట జనసంద్రమే తరలివచ్చిందని గుర్తుచేశారు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతుండగానే జగనన్న కోసం జనం పరుగులు తీశారంటే ఏస్థాయిలో ఆదరణ ఉందో అర్థమవుతోందని చెప్పారు. విజయవాడలో వల్లభనేని వంశీని పరామర్శించేందుకు వచ్చిన జగనన్నను చూసేందుకు జనప్రవాహం తరలివచ్చిందన్నారు. ఈ పర్యాయం అధికారంలోకి రాగానే ప్రజలతో పాటు పార్టీ కార్యకర్తల సంక్షేమం దిశగా పాలన ఉంటుందని జగనన్న భరోసా ఇచ్చారని తెలిపారు. పేదలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందించేందుకు జగనన్న పాటుపడితే, ప్రజలకు మాయమాటలు చెప్పి ఓట్లు దండుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తారని ఆరోపించారు. గత ఎన్నికల్లో జగన్‌ సంక్షేమ పథకాల ద్వారా రూ. 2.5లక్షల కోట్లు వస్తే తాను మరో రూ. 2.5లక్షల కోట్లు కలిపి సంక్షేమ పథకాలు అందిస్తానని చంద్రబాబు చెప్పిన హామీలు ఏమైయ్యాయని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నా ఒక్క హామీని నెరవేర్చని ప్రజాద్రోహి చంద్రబాబు అని విమర్శించారు. గత ఎన్నికల్లో అభినయ్‌ ఓడిపోయినప్పుడు కూడా బాధపడలేదని, ఎంతో ఇష్టపడే వ్యక్తులు పదవుల కోసం వదిలి వెళ్లిపోయినప్పుడే ఎక్కువ బాధపడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్నను తిరిగి ముఖ్యమంత్రి చేసుకునేవరకు సైనికుల్లా పనిచేద్దామని పిలుపునిచ్చారు.

ప్రజలే బుద్ధి చెబుతారు

అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని మేయర్‌ డాక్టర్‌ శిరీష తెలిపారు. జగనన్న పాలనలో ఈ నెల ఏ పథకం వస్తుందని ప్రజలంతా చర్చించుకుని సంతోషంగా పొందేవారన్నారు. అయితే కూటమి పాలనలో ఈ రోజు ఎవరిని అరెస్ట్‌ చేస్తారు, ఎవరిని బెదిరిస్తారు, ఎవరి ఆస్తులను ధ్వంసం చేస్తారనే ప్రజల్లో చర్చ జరుగుతోందని వెల్లడించారు.

ప్రభుత్వానికి నిద్రలేని రాత్రులే

ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై భూమన కరుణాకరరెడ్డి నాయకత్వంలో అవిశ్రాంత పోరాటం చేద్దామని ఎంపీ గురుమూర్తి స్పష్టం చేశారు. సర్కారుకు ఇకపై నిద్రలేని రాత్రులే ఉంటాయని వెల్లడించారు. ఆధ్యాత్మిక నగరంలో ఎప్పుడూ చూడని అమానవీయ ఘటనలను డిప్యూటి మేయర్‌ ఎన్నికలో చూశామన్నారు. రౌడీలతో పోలీసులు కలిసిపోయి ప్రజాస్వామ్యంపై దాడి చేశారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులపై దాడికి పాల్పడిన వారిని కటకటాలపాలు చేసే వరకూ పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు. నగర కమిటీలో పదవులు పొందిన ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా పార్టీ పటిష్టతకు కృషి చేయాలని కోరారు.

అపహాస్యం చేసింది

ప్రజాప్రతినిధులుగా తాము ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళుతున్న తమ బస్సుపై దాడి చేసి ప్రజాస్వామ్యాన్ని కూటమి ప్రభుత్వం అపహాస్యం చేసిందని ఎమ్మెల్సీ డాక్టర్‌ సిపాయి సుబ్రమణ్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్‌సిక్స్‌ హామీలను అమలు చేయకుండా వైఎస్సార్‌సీపీ నాయకులే టార్గెట్‌గా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాసంక్షేమం కోసం శ్రమించే జగన్‌మోహన్‌రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ప్రజలంతా ఎదురుచూస్తున్నారని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement