రోజురోజుకీ రొయ్య ధర పతనం
● తగ్గుతున్న ఎగుమతులు ● గగ్గోలు పెడుతున్న అన్నదాతలు
హార్వెస్టింగ్ చేస్తున్న దృశ్యం
జిల్లా సమాచారం
రొయ్య సాగుచేసే మండలాల సంఖ్య 7
సాగులో ఉన్న విస్తీర్ణం 15 వేల హెక్టార్లు
ఎకరా సాగుకు అవుతున్న ఖర్చు రూ.2 లక్షలు
రైతులు 7 వేల మంది
ఏటా దిగుబడి 1.5 లక్షల టన్నులు
ఇందులో ఎగుమతి 90 శాతం వరకు
వాకాడు: రొయ్య ధరలు రోజురోజుకీ పతనమవుతు న్నాయి. రోజుకి రూ.10 చొప్పున తగ్గిపోతుండడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎగుమతి దారులు ప్రస్తుతం ఏ కారణం చెప్పకుండానే ధరలు తగ్గించేస్తున్నారు. దళారులు సిండికేట్‌గా ఏర్పడి మరింత పతనం చేస్తున్నారు. దీని వల్ల ఎకరాకు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లుతోంది. గత నెల రొయ్యల ధరలతో లెక్కిస్తే రూ.4 వేల కోట్లు ఆదాయం రావాల్సి ఉంది. ఐతే ప్రస్తుత ధరలతో అది కాస్త రూ.3.5 వేల కోట్లకు పడిపోయింది.
యూటర్న్
భారతదేశం నుంచి రొయ్య ఎగుమతులు ఎక్కువుగా యూరోపియన్ దేశాలకు వెళ్తుంటాయి. యూరప్‌లోని 10 దేశాల్లో ఆంధ్రా రొయ్యలకు మంచి డిమాండ్ ఉంది. ఐతే కొంతమంది రైతులు అత్యుత్సాహానికి వెళ్లి నిషేధిత యాంటీ బయోటిక్స్ సాగులో వాడడం వల్ల యూరోపియన్ ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కృష్ణపట్నం, విశాఖపట్నం, కాకినాడ నౌకాశ్రయాల ద్వారా ఎగుమతవుతున్న ప్రతి రెండు కంటైనర్‌లో ఒకదానికి శాంపిల్స్ తీస్తున్నారు. యాంటీ బయోటిక్స్ ఉన్నట్లు తేలితే ఎగుమతులు చేసే లైసెన్సులు రైతులు కోల్పోతున్నారు. ఐతే అమెరికా దేశానికి ఎగుమతయ్యే రొయ్య ఉత్పత్తును శాంపిల్స్ తక్కువుగా తీస్తుండడంతో ఎక్కువ మంది రైతులు ఆ దేశం వైపు మొగ్గు చూపుతున్నారు.
నాసిరకం సీడ్, ఫీడ్
హేచరీలు అధిక ధరలతో నాసిరకం సీడ్ అంటగడుతున్నాయి. దీన్ని చెరువుల్లో పోసిన పది రోజులకే రొయ్య పిల్లలు విపరీతంగా చనిపోతున్నాయి. వాటిల్లో కొన్ని బతికి బయటపడ్డా అవి సమాన గ్రోత్ రావడం లేదు. వాటిని అమ్ముకుందామంటే రొయ్యల ప్రొసెస్ కంపెనీ వ్యాపారులు సిండికేట్లుగా ఏర్పడి అందినకాడకి దోసుకుపోతున్నారు. ప్రొసెస్ కంపెనీ వ్యాపారులదీ అదే పరిస్థితి.
మామూళ్లమత్తులో అధికారులు
నాణ్యమైన సీడ్ అందేలా చూడాల్సిన కోస్టల్ ఆక్వా అథారిటీ, మత్స్యశాఖ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. వాస్తవానికి మత్స్యశాఖ అధికారులు నెలకు రెండు సార్లు హేచరీలను పరిశీలించి ఆయా యజమానులకు నాణ్యమైన సీడ్ ఉత్పత్తులపై పలు చూచనలు, సలహాలను ఇవ్వాల్సి ఉంది. ఐతే గత ఆరు నెలలుగా అలా జరగడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఒకప్పుడు జిల్లా తీరం వెంబడి దాదాపు 45 వేల ఎక్టార్లలో ఆక్వాసాగు చేసేవారు. ప్రస్తుత 15 వేల ఎక్టార్లకు పడిపోయింది.
ఆరు రోజుల్లో రూ.60 తగ్గిపోయింది
రొయ్యల కొనుగోలుదారులు సిండికేట్లుగా ఏర్పడి ఆరు రోజుల నుంచి రోజుకి రూ.10 చొప్పున రూ. 60 తగ్గించేశారు. నెల కిందట 30 పైసలు ఉన్న రొయ్య పిల్ల ఇప్పుడు 55 పైసలకు పెంచారు. నాణ్యమైన సీడ్ దొరకడం లేదు. అంతా నకిలీల మయంగా మారింది. సాగులో తీవ్ర నష్టాలు వస్తున్నాయి. – ఎస్.మధురెడ్డి, ఆక్వా రైతు, ముట్టెంబాక
ఒడిదుడుకులు సహజం
అన్ని వ్యాపార రంగాలలో ఒడిదుడుకులు సహజం. ఆక్వా రంగంలోనూ నేడు ధరల హెచ్చ తగ్గులు సర్వ సాధారణంగా జరుగుతున్నాయి. ఎక్కడా దళారీ వ్యవస్థ, సిండకేటు వ్యవస్థ కొనసాగడం లేదు. బార్డ్ ఫ్లూ ఉన్నందున రొయ్యల ధరలు పుంజుకునే అవకాశం ఉంది. – మత్స్యశాఖ జేడీ వివరణ
ఎకరాకు రూ.1.5 లక్షల నష్టం
ఓ పక్క ఆక్వా పెట్టుబడులు ఆమాంతంగా పెరిగి పోయాయి. లక్షలు పెట్టుబడులు పెట్టి 95 రోజులు కష్ట పడి పండించిన రొయ్యలకు ధరలు తగ్గించేశారు. ఎకరా సాగులో దాదాపు రూ.1.5 లక్షల వరకు నష్టం వస్తోంది.
– చెంగయ్య ఆక్వా రైతు పల్లెపాళెం
స్టోరేజీ సౌకర్యం లేకనే..
జిల్లా నుంచి ఏటా దాదాపు 1.5 లక్షల టన్నుల రొయ్యలను ఉత్పత్తి చేస్తుంటారు. ధరలు ఆశాజనకంగా లేనప్పుడు వాటిని నిల్వ చేసుకునేందుకు సరైన స్టోరేజీలు లేకపోవడంతో ఒకటికి సగానికి తెగనమ్ముతున్నారు. ఇక కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. జిల్లాలోని కౌలు రైతులకు ప్రాంతాన్ని బట్టి కౌలు నిర్ణయించారు. రూ. 50 వేల నుంచి రూ.లక్ష వరకు కౌలు ధర ఉంది. ప్రస్తుత ధరలతో పోల్చి చూస్తే కౌలు రైతుకు చివరకు మిగిలేది అప్పులే.
రొయ్య ధరలు ఇలా
కౌంట్ ఫిబ్రవరిలో మార్చిలో
40 రూ.415 రూ.350
50 రూ.375 రూ.335
60 రూ.345 రూ.315
70 రూ.310 రూ.285
80 రూ.290 రూ.255
90 రూ.270 రూ.235
100 రూ.260 రూ.225
రోజురోజుకీ రొయ్య ధర పతనం
రోజురోజుకీ రొయ్య ధర పతనం
రోజురోజుకీ రొయ్య ధర పతనం
Comments
Please login to add a commentAdd a comment