చౌక.. | - | Sakshi
Sakshi News home page

చౌక..

Published Wed, Mar 19 2025 12:28 AM | Last Updated on Wed, Mar 19 2025 12:28 AM

చౌక..

చౌక..

పేదల ఆకలి తీర్చాల్సిన ఉచిత బియ్యం పక్కదారి పడుతోంది. రూపుమార్చుకుని బహిరంగ మార్కెట్‌ల్లోకి అడుగుపెడుతోంది. ఇందుకు తొలుత గోడౌన్లలోనే బీజం పడుతోంది. ఆ తరువాత చౌక దుకాణాలూ అడ్డాగా మారుతున్నాయి. కార్డుదారులు సైతం ఉచిత దొడ్డు బియ్యాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా కిలోల్లో కొనుగోళ్లు చేసి.. టన్నుల కొద్దీ పొరుగు రాష్ట్రాలకు తరలించి, అధిక ధరలకు విక్రయిస్తున్నారు. మరి కొందరు స్థానికంగా మిల్లులో పాలిష్‌ పట్టి నాణ్యమైన బియ్యం పేరుతో విక్రయించి, వినియోగదారులను మోసం చేస్తున్నారు. ఇలా చౌక బియ్యంతో చక్కనైన వ్యాపారం సాగిస్తూ.. జేబులు నింపుకుంటోంది రేషన్‌ మాఫియా. పర్యవేక్షించాల్సిన ప్రభుత్వ పెద్దలు, అధికారులు మాత్రం రేషన్‌ అక్రమాలకు అడ్డుకట్ట వేయడం లేదు.
తూకాల్లో నొక్కుడు
● రాష్ట్రాలు దాటుతున్న రేషన్‌ ● ఇటు తమిళనాడుకు..అటు కర్ణాటకకు ● బస్తాకు కిలో బియ్యం తగ్గింపు ● 3,340 బస్తాలు నెలకు మిగులు

జిల్లా పౌరసరఫరాల సమాచారం

రేషన్‌దుకాణాల సంఖ్య 1,457

కార్డుదారుల సంఖ్య 6.03 లక్షలు

ప్రతినెలా పంపిణీ చేసే బియ్యం

8350 మెట్రిక్‌ టన్నులు

ఎండీయూ వాహనాలు సంఖ్య 369

అందుబాటులో ఉండే ఎండీయూ వాహనాలు 190

అఽధికారులు మాత్రం 70 మినహా మిగిలిన

వాహనాలు వాడుకలో ఉన్నాయని చెబుతున్నారు.

గోడౌన్ల నుంచి తగ్గింపు లేదు

గోడౌన్ల నుంచి డీలర్లు బియ్యం తగ్గించడం లేదు. వారికి ఎంత మోతాదులో బియ్యం ఇవ్వాలో అ లెక్క ప్రకారమే పంపుతున్నాం. కొందరు డీలర్లు అనుమానం ఉంటే సమీపంలోని ఏ మెంట్‌ వద్ద తూకాలు వేసుకుంటున్నారు. ఏమైనా బియ్యం తక్కువ వస్తే వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. అలాంటి పరిస్థితులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. మరోవైపు రైస్‌ మిల్లర్లకు కచ్చితంగా ఆదేశాలు ఇచ్చాం. రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేయడం లేదా పాలిష్‌ పట్టడం చేస్తే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించాం.

– వై.సుమతి, జిల్లా సివిల్‌ సప్లయి మేనేజర్‌

డీలర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చాం

రేషన్‌ డీలర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. తూకాల్లో 100 గ్రామాలు తక్కువ ఉన్నా చర్యలు తీసుకుంటామని చెప్పాం. మరోవైపు కార్డుదారుల నుంచి బియ్యం కొనుగోలు చేసినా చర్యలు తీసుకుంటాం. అలాగే అవసరం లేకుంటే కార్డుదారులు బియ్యం కొనుగోలు చేయకుండా ఉండాలి. అంతే తప్ప తమ బియ్యాన్ని డీలర్‌కు లేదా ఇతరులకు విక్రయించడం సరికాదు. అంతేకాకుండా బియ్యం వ్యాపారం చేస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టాం. ఏదైనా సమాచారం వస్తే వెంటనే బియ్యం స్టాక్‌ చేసిన ప్రాంతాల్లో దాడులు చేస్తున్నాం. ఉచితంగా రేషన్‌ దుకాణాల నుంచి ఇస్తున్న బియ్యాన్ని దుర్వినియోగం చేయరాదని అవగాహన కల్పిస్తున్నాం.

– శేషాచలం రాజు, జిల్లా సివిల్‌ సప్లయి అధికారి

తిరుపతి అర్బన్‌: చౌకదుకాణాల రేషన్‌ బియ్యాన్ని కొందరు వ్యాపారులు చైన్నెపోర్టుకు తరలిస్తున్నారు. మరి కొందరు కర్ణాటకకు, ఇంకొందరు స్థానికంగా రైస్‌మిల్లర్లకు తరలిస్తున్నట్లు చర్చసాగుతుంది. రేషన్‌ దుకాణాల్లో బియ్యం కార్డుదారులకు ఉచితంగా ఇస్తున్నారు. పలువురు డీలర్లు కిలో బియ్యానికి రూ.15 కార్డుదారుడికి చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఆ బియ్యాన్ని ఆయా ప్రాంతాల్లోని వ్యాపారులకు కిలో రూ.25 నుంచి 27 వరకు విక్రయిస్తున్నారు. ఆ తర్వాత ఆ బియ్యాన్ని చైన్నెలోని రెడ్‌హిల్స్‌ ప్రాంతానికి చెందిన వ్యాపారులకు కిలో రూ. 33 నుంచి రూ.35కు విక్రయిస్తున్నారు. ఆ తర్వాత శ్రీలంక, ఇండోనేషియా తదితర దేశాలకు రేషన్‌ బియ్యాన్ని ఎంచెక్కా తరలిస్తున్నారు. కొందరు ఇలా వ్యాపారం చేయడమే వృత్తిగా మార్చుకున్నారు. దీంతో ఉచిత రేషన్‌ బియ్యం బ్లాక్‌ మార్కెట్‌కు తరలిపోతోంది. ప్రతి నెల 25 శాతం బియ్యం వ్యాపారం వైపు వెళుతున్నట్లు అధికారులు లెక్కలు కడుతున్నారు.

రేషన్‌ బియ్యం రాయితీతో ఇలా..

కిలో బియ్యం రూ.30 నుంచి రూ.35 సర్కార్‌ కొనుగోలు చేస్తోంది. అయితే పేదోళ్లు మూడు పూటల భోజనం చేయడానికి కేంద్ర సర్కార్‌ 2023 నుంచి 2028 వరకు ఉచితంగా బియ్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఆ మేరకు మనిషికి 5 కిలోల చొప్పున రేషన్‌కార్డులో ఎంత మంది సభ్యులుంటే అన్ని 5 కిలోల వంతున అందిస్తోంది. అలాగే అంత్యోదయ కార్డులకు 35 కిలోల బియ్యం, అన్నపూర్ణకార్డులకు 10 కేజీల బియ్యం చొప్పున ప్రతి నెలా అందిస్తోంది. అయితే ఆ రేషన్‌ బియ్యాన్ని కొందరు అక్రమార్కులు రాష్ట్రాలను దాటిస్తున్నారు. బ్లాక్‌ మార్కెట్‌కు బియ్యాన్ని తరలిస్తూ పేదోళ్ల పొట్టకొడుతున్నారు.

చిలక్కొట్టుడిలా..

బస్తాకు కేజీ బియ్యం తగ్గింపు

నెలకు 8,350 మెట్రిక్‌ టన్నులు బియ్యం

నెలకు 1.67 లక్షల 50 కిలోల బస్తాలు

3,340 బస్తాలు మిగులు

దందా ఎలాగంటే..

రేషన్‌ దందా ఎలా సాగుతుందంటే.. గోడౌన్ల నుంచి 50 కిలోల బస్తాలను డీలర్లకు పంపుతారు. ఒక్క బస్తా నుంచి ఒక కేజీని తగ్గించి ఇచ్చేస్తున్నారని చర్చ సాగుతుంది. జిల్లాలోని 17 గోడౌన్ల నుంచి ప్రతి నెలా సుమారుగా 8,350 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని 1,457 మంది డీలర్లు పంపిణీ చేస్తున్నారు. 8,350 మెట్రిక్‌ టన్నులు అంటే 50 కిలోల బస్తాలు 1.67 లక్షలు పంపిణీ చేయాల్సి ఉంది. బస్తాకు కిలో చొప్పున కొట్టేస్తే నెలకు 3,340 బస్తాలు మిగులు ఉంటుంది. ఈ బియ్యంతోనే వ్యాపారం సాగుతుందని చర్చ సాగుతుంది. మరోవైపు డీలర్లు కార్డుదారులకు ఇచ్చే బియ్యంలోనూ తగ్గింపు ఉంది. ఆ బియ్యంతో వ్యాపారం సాగుతోంది. ఇంకోవైపు 20 శాతం మంది కార్డుదారులు డీలర్‌ వద్ద బయోమెట్రిక్‌ వేసిన తర్వాత కిలో రూపాయి వంతున రూ.15 చొప్పున డీలర్‌కు ఇచ్చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆ బియ్యంతోనే వ్యాపారం సాగుతుంది.

గోడౌన్‌లో కొంత.. డీలర్లు మరికొంత నొక్కేస్తున్నారు

పారదర్శకంగా బియ్యం తూకాలు జరగడం లేదని రేషన్‌ డీలర్లు గగ్గోలు పెడుతున్నారు. గోడౌన్ల నుంచి తమకు వచ్చే సమయంలో బస్తాకు కిలో నుంచి రెండు కిలోల బియ్యం తగ్గిపోతున్నాయని పలువురు డీలర్లు వాపోతున్నారు. అయితే అదే పద్ధతిని వారూ పాటిస్తున్నారు. కార్డుదారులకు ఇచ్చే సమయంలో తూకాల్లో మోసాలు చేస్తున్నారు. ఉదాహరణకు 30 కిలోలు ఇవ్వాల్సిన కార్డుదారునికి 29 కేజీలనే ఇస్తున్నారు. దీనిపై కార్డుదారులు గట్టిగా డీలర్‌ను ప్రశ్నిస్తే, తమకు గోడౌన్ల నుంచి తూకాల్లో తక్కువగా ఇస్తున్నారంటూ వారిపై నెట్టేస్తున్నారు.

పట్టుబడిన బియ్యం వేలం ద్వారా విక్రయాలు

అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన బియ్యాన్ని ఆయా గోడౌన్లలో నిల్వ చేసి, తర్వాత ఏడాదికి ఒక్కసారి ఆ బియ్యాన్ని వేలం వేస్తున్నారు. పట్టుబడి స్టాక్‌ ఉన్న రెండు లక్షల టన్నుల బియ్యాన్ని గత ఏడాది వేలం పాట ద్వారా విక్రయించారు. అధికారులు అక్రమంగా తరలిపోతున్న బియ్యంపై పటిష్టమైన చర్యలు చేపట్టకపోవడంతోనే ఇలా ఇష్టారాజ్యంగా వ్యాపారం సాగుతుందని అంతా చర్చించుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
చౌక.. 1
1/4

చౌక..

చౌక.. 2
2/4

చౌక..

చౌక.. 3
3/4

చౌక..

చౌక.. 4
4/4

చౌక..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement