
అక్రమాస్తుల కేసులో మళ్లీ సోదాలు
● గతంలో లంచం తీసుకుంటూ పట్టుబడిన చంద్రగిరి పంచాయతీ ఈవో ● సదరు ఈవోను సస్పెండ్ చేసిన జిల్లా ఉన్నతాధికారులు ● సస్పెన్షన్‌లో ఉండగానే మరోసారి సోదాలు
సాక్షి, టాస్క్‌ఫోర్స్: చంద్రగిరి పంచాయతీ ఈవో మహేశ్వరయ్య లంచం తీసుకుంటూ ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఏసీబీకి చిక్కారు. అధికారులు ఆయనను కస్టడీలోకి తీసుకుని కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించారు. అయితే సరిగ్గా నెల రోజుల తర్వాత ఆయన ఇంటిపై మరోసారి ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఇంట్లోని పలు కీలక డాక్యుమెంట్లను సీజ్ చేసినట్టు సమాచారం.
ఆదాయానికి మించి ఆస్తులు
తిరుపతి రూరల్ మండలం, పేరూరు పంచాయతీ సమీపంలోని ఏకదంతా అపార్ట్‌మెంట్‌లో ఉన్న మహేశ్వరయ్య ప్లాటుకు మంగళవారం ఉదయమే ఏసీబీ అధికారులు చేరుకున్నారు. అతని కుటుంబీకులకు సంబంధించిన దస్త్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బంగారం, వెండికి సంబంధించిన బిల్లులు, స్థిరాస్తులకు సంబంధించిన దస్తావేజులను పరిశీలించి.. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించారు. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కన మహేశ్వరయ్యను జిల్లా ఉన్నతాధికారులు ఇప్పటికే సస్పెండ్ చేయగా మరోసారి ఆయన ఇంట్లో సోదాలు చేయడం చర్చనీయాంశమైంది. మహేశ్వరయ్య ఇంటితో పాటు కారు, ద్విచక్ర వాహనాలను తనిఖీ చేశారు. ఇప్పటివరకు నిర్వహించిన సోదాల్లో సుమారుగా మార్కెట్ విలువ ప్రకారం రూ.30 కోట్ల విలువైన అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు అధికారులు అంచనా వేసినట్టు సమాచారం. అయితే అధికారికంగా ఏసీబీ అధికారులు సోదాలు పూర్తయిన తరువాత పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.