కుమారుడు, భర్తతో మనీషా (ఫైల్)
తిరుపతి: నగరంలోని ఓ ప్రైవేట్ అతిథి గృహంలో అన్నా చెల్లెళ్లు దారుణంగా హత్యకు గురైన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. అలిపిరి సీఐ అబ్బన్న కథనం మేరకు.. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన యువరాజ్, మనీషా దంపతులకు షక్షీమ్(6), ప్రజ్ఞాన్(4) ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇతను మేస్త్రీ పనిచేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఏడాది నుంచి భర్యాభర్తల మధ్య గొడవ చోటుచేసుకోవడంతో దూరంగా ఉండేవారు. అయితే యువరాజ్ 4 రోజుల కిందట తిరుపతి కి చేరుకుని నగరంలోని ఓ ప్రైవేట్ అతిథి గృహంలో బస చేశాడు.
ఇదే క్రమంలో భార్యకు ఫోన్ చేసి, తిరుపతి కొస్తే మాట్లాడుకుందామని చెప్పా డు. దీంతో మనీషా పిల్లలను తీసుకుని హైదరాబాద్ వర కు రైలులో వచ్చి, అక్కడి నుంచి తన అన్న హర్షవర్దన్‌తోపాటు విమానంలో తిరుపతికి చేరుకుంది. ఆ రాత్రి ఏం జరిగిందో ఏమో కానీ వీరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో యువరాజ్ తన భార్య మనీషాతోపాటు ఆమె అన్న హర్షవర్ధన్(25) కూడా దారుణంగా కత్తితో పొడిచి, హత్య చేశాడు. అయితే హత్యకు కారణాలు పలు కోణాల్లో వినిపిస్తున్నాయి.
వీరి మధ్య ఆస్తి తగాదాలున్నాయని, యువరాజును హత్య చేస్తే పెద్ద మొత్తంలో ఆస్తి వస్తుందని, అతడిని చంపడానికి వారు తిరుగు తున్నట్లు విచారణలో తేలిందని సీఐ తెలిపారు. ఈ క్రమంలోనే యువరాజ్ చంపి ఉండొచ్చని భావిస్తున్నామన్నారు. యువరాజ్ అన్నతో మనీషాకు వివాహేతర సంబంధం ఉండడంతో వారి మధ్య గొడవ జరిగినట్లు కూడా తెలిసిందని సీఐ చెప్పారు. అయితే నిజాలు పూర్తిస్థాయిలో తెలియాల్సి ఉందన్నారు. మృతుల కుటుంబాలకు సమాచారం ఇచ్చామని, వారు వస్తే నిజాలు బయటపడతాయన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment