బతికున్న రైతును చంపేసి.. | Sakshi
Sakshi News home page

బతికున్న రైతును చంపేసి..

Published Tue, May 7 2024 6:40 PM

బతికున్న రైతును చంపేసి..

భూమిని విరాసతు చేసిన ఘటనలో 9 మందిపై కేసు

కొందుర్గు: బతికుండగానే మరణించినట్లు ధ్రువీకరించి ఓ రైతుకు సంబంధించిన భూమిని ఇతరులపై పట్టా మార్పిడి చేసిన కేసులో తొమ్మిది మందిపై జిల్లేడ్‌ చౌదరిగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లేడ్‌ చౌదరిగూడ మండలంలో చేగిరెడ్డిఘనాపూర్‌ గ్రామ శివారులో గడ్డం వెంకటయ్యకు 30 గుంటల భూమి ఉంది. ఆయనకు కుమారులు మల్లేశ్‌, నర్సింలతో పాటు ఓ కుమార్తె ఉంది. రైతుతోపాటు ఆయన వారసులకు తెలియకుండా వెంకటయ్య మరణించినట్లు ఓ అఫిడవిట్‌ జత చేసి అదే గ్రామానికి చెందిన తిమ్మగళ్ల గాయత్రి, హన్మగళ్ల మమత పేర్లపై సదరు భూమిని విరాసతు చేసి ధరణి పోర్టల్‌ ద్వారా అధికారులు పట్టా మార్పిడి చేశారు.

గతంలో ఫిర్యాదు

దీనిపై వీరన్నపేట గ్రామానికి చెందిన బాధిత రైతు ఈ ఏడాది ఏప్రిల్‌ 20న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరిపి తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌తోపాటు, పట్టా మార్పిడి చేయించుకున్న గాయత్రి, మమత, స్టాంప్‌ వెండర్‌ రఫిక్‌ ఉద్దీన్‌,ఇందుకు సహకరించిన జంగయ్య, యాదయ్య, నర్సింలు, సుదర్శన్‌ తదితరులపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటనలో ఇప్పటికే పట్టా మార్పిడి చేయించుకున్న మమత, గాయత్రిలను అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ సక్రమ్‌ తెలిపారు. త్వరలోనే మిగతా వారిని పట్టుకుంటామని, విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

 
Advertisement
 
Advertisement