
అభివృద్ధి పనులను పూర్తి చేయండి
● వికారాబాద్, నారాయణపేట కలెక్టర్లు ప్రతీక్ జైన్, సిక్తా పట్నాయక్
కొడంగల్: నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని వికారాబాద్, నారాయణపేట జిల్లాల కలెక్టర్లు ప్రతీక్ జైన్, సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. బుధవారం పట్టణంలోని కడా కార్యాలయంలో రెండు జిల్లాల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి పనులను ఆయా శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పూర్తి చేయాలన్నారు. బీసీ గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాల నిర్మాణ పనులను పూర్తి చేయాలన్నారు. దౌల్తాబాద్, బొంరాస్‌పేట మండలాల్లో మంజూరైన నిర్మాణాలకు టెండర్లు పిలవాలన్నారు. కొడంగల్‌లో ప్రభుత్వ ఆసుపత్రి భవనం, ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్ నిర్మాణ పనులను కలెక్టర్ ప్రతీక్ జైన్ పరిశీలించారు. రోడ్ల విస్తరణ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మిషన్ భగీరథ పథకం కింద ప్రతి ఇంటికీ తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్లపై గుంతలు లేకుండా చూడాలని ఆదేశించారు. సమావేశంలో కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, నారాయణపేట ఆర్డీఓ రామచందర్, పంచాయతీ రాజ్ ఎస్‌ఈ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ వసంత్ నాయక్, ట్రాన్స్‌కో ఎస్‌ఈ లీలావతి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
భవన నిర్మాణాలకు స్థల పరిశీలన
దుద్యాల్: మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం కలెక్టర్ ప్రతీక్ జైన్ పర్యటించారు. దుద్యాల్‌లో సమీకృత భవన నిర్మాణాలకు స్థల పరిశీలన చేశారు. మండల కేంద్రం నుంచి అల్లిఖాన్‌పల్లి వరకు వేస్తున్న బీటీ రోడ్డు పనులను, గౌరారం గ్రామంలో నిర్మిస్తున్న అంగన్‌వాడీ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమా ణాలు పాటించించాలని ఆదేశించారు. కార్యక్రమంలో కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, పంచాయత్‌రాజ్ ఈఈ నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
అధికారులతో సమీక్ష
అనంతగిరి: జిల్లాలో నేషనల్ హైవే, వివిధ ప్రాజెక్టుల కోసం భూ సేకరణ, పరిహారం పంపిణీపై బుధవారం కలెక్టర్ తన చాంబర్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతుల సమ్మతితో భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్, తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర ప్రసాద్, ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్ బిల్లులు విడుదల చేయండి
కలెక్టర్‌కు మాజీ ఎమ్మెల్యే వినతి
కొడంగల్: నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న బిల్లులను చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను కోరారు. బుధవారం ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. కొడంగల్ కడా కార్యాలయానికి వచ్చిన కలెక్టర్‌ను ఆయన కలిశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించాలని కోరారు. పనులు చేసిన ప్రజా ప్రతినిధులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులు చేసినట్లు వివరించారు. ఆయా గ్రామాల సర్పంచులు లక్షలాది రూపాయల పెట్టుబడి పెట్టి సీసీ రోడ్లు, ప్రభుత్వ భవనాలు నిర్మించినట్లు చెప్పారు. వాటికి సంబంధించిన బిల్లులు ఇప్పటి వరకు చెల్లించలేదన్నారు. సదరు బిల్లులను చెల్లించి ప్రజాప్రతినిధులకు న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ మధుయాదవ్, నాయకులు మహిపాల్‌రెడ్డి, దేశ్యా నాయక్, శేరి నారాయణరెడ్డి, రమేష్‌బాబు, నరేష్‌గౌడ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment